- 70 ఏళ్లకు పైబడిన 14 మందికి టికెట్
- 80 ఏళ్ల వయసున్న నాయకుడికీ అవకాశం
- వయసుతో సంబంధం లేకుండా గెలుపు గుర్రాలకే పెద్ద పీట
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అనుసరిస్తున్న వ్యూహమిది! కర్ణాటక ఎన్నికల్లో ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి తన పంథాను మార్చుకొని సీనియర్లను రంగంలోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తున్న బీజేపీ.. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది.
BJP Age Limit For Election : సాధారణంగా తర్వాతి తరం నేతలను ప్రోత్సహిస్తుంటుంది బీజేపీ. కానీ, తన పద్ధతికి భిన్నంగా ఈసారి తలపండిన సీనియర్లను నమ్ముకుంది. 70 ఏళ్లు దాటిన నేతలను ఏకంగా 14 మందిని బరిలో దించింది. అందులో ఓ నాయకుడి వయసైతే 80 ఏళ్లు. కొత్త నాయకుల కంటే.. గెలిచేవారికే పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఈ మేరకు వృద్ధనేతలకు అవకాశం ఇస్తోంది కమలం పార్టీ.
సత్నా జిల్లా నాగోద్ నియోజకవర్గం నుంచి నాగేంద్ర సింగ్ నాగోద్(80)ను బరిలోకి దింపిన బీజేపీ.. రీవా జిల్లా గూఢ్ స్థానం నుంచి నాగేంద్ర సింగ్(79)ను పోటీ చేయిస్తోంది. దామోహ్ నుంచి జయంత్ మాలవీయ(76), చందేరీ నుంచి జగన్నాథ్ సింగ్ రఘువంశీ(75), హోశంగాబాద్ నుంచి సీతాశరణ్ శర్మ(73), అనుప్పుర్ నుంచి బిసాహులాల్ సింగ్, గ్వాలియర్-తూర్పు నుంచి మాయా సింగ్(73)ను రంగంలోకి దించింది. గూఢ్ స్థానంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఆప్ తరఫున ప్రఖార్ ప్రతాప్ సింగ్ అనే 25 ఏళ్ల అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఉద్యోగం వదిలి అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన.. 79 ఏళ్ల నాగేంద్ర సింగ్‌ను ఢీకొంటున్నారు. రాష్ట్రంలోనే యువ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
"నాగేంద్ర సింగ్ నాగోద్, నాగేంద్ర సింగ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేయబోమని ఐదు నెలల క్రితం వారు ప్రకటించారు. కానీ, ఇప్పుడు వారికే టికెట్లు దక్కాయి" అని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు.
యువకులకు ఛాన్స్ ఇచ్చి.. దెబ్బ తిని..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక మంది సీనియర్లను తప్పించింది బీజేపీ. మాజీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్థాయి సీనియర్ నాయకులను సైతం పక్కనబెట్టింది. మాజీ సీఎం జగదీశ్ శెట్టర్(67), మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప(75) వంటి నాయకులను కాదని.. వారి స్థానాల్లో యువకులకు అవకాశం ఇచ్చింది. కానీ, అక్కడ ఆశాజనక ఫలితాలు రాలేదు. అంతేకాకుండా, మధ్యప్రదేశ్ గత ఎన్నికల్లోనూ టికెట్ రాని సీనియర్ నాయకులు బీజేపీని గట్టిగా దెబ్బ కొట్టారు. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్త పడుతోంది కాషాయదళం.
"ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాల ఆధారంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఎన్నికల్లో రామకృష్ణ కుసుమారియా(81)కు బీజేపీ టికెట్ కేటాయించలేదు. దామోహ్, పథ్రియా స్థానాల నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఫలితంగా బుందేల్‌ఖండ్ ప్రాంతంలో బీజేపీ ఓట్లకు గండిపడినట్లైంది. దామోహ్, పథ్రియాలో రామకృష్ణ వరుసగా.. 1133, 13,000 ఓట్లు సాధించారు. ఆ రెండు స్థానాలను బీజేపీ స్వల్ప తేడాతో చేజార్చుకుంది. దామోహ్‌లో 798 ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలవగా.. 2,205 ఓట్ల తేడాతో పథ్రియాను బీఎస్పీ కైవసం చేసుకుంది. రామకృష్ణ తిరిగి బీజేపీలో చేరారు. ఈసారి బీజేపీ ముందుగానే జాగ్రత్తపడింది. బుందేల్‌ఖండ్‌లో మరోసారి ఆయన ప్లేట్ ఫిరాయించకుండా ఎన్నికలకు ముందు ఆయన్ను రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌గా నియమించింది."
-జైరాం శుక్లా, రాజకీయ విశ్లేషకులు, చరవతి మంత్లీ మేగజీన్ మాజీ సంపాదకులు