బిహార్ ఎన్నికల సమరాంగణంలో అన్ని రాజకీయ పక్షాలూ హోరాహోరీగా మోహరించాయి. ఎన్డీయే అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో యాదవులు, ముస్లిముల ఓట్ల మొగ్గు కీలకంగా మారింది. బిహార్‌లో కులాల సమరక్షేత్రానికి బహుముఖ కోణాలుంటాయి. ముస్లిములు, యాదవుల ఓట్లన్నీ గంపగుత్తగా ఎన్డీయేకు వ్యతిరేకంగా పడేలా చేయడం ఇతర పక్షాలకు అంత సులువేమీ కాదు. అధికార పార్టీ జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) నేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దశాబ్దాలుగా ముస్లిములు, ఓబీసీల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న పరపతి ఒక్కసారిగా పోయేదేమీ కాదు. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాల్లో పార్లమెంటులో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ ప్రభ కొంతమేర తగ్గి ఉండొచ్ఛు.
ఓట్ల చీలికపైనే ఆశలు
ముస్లిములు, ఇతర బలహీన వర్గాల ప్రజల్లో ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఆ రెండు వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతౌల్యాన్ని పాటించేందుకు నీతీశ్ యత్నించారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జేడీయూ యాదవులు, ముస్లిం వర్గాల నుంచి, కుర్మీల నుంచి అభ్యర్థులను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసింది. 27శాతందాకా ముస్లిం జనాభా ఉండే దర్భంగ జిల్లాకు చెందిన ఫరాజ్ ఫాత్మి, ముస్లిం వర్గాల్లో ప్రభావం చూపగల ఎమ్మెల్సీ మౌలానా గులాం రసూల్ బల్యావి జేడీయూకే ఓటు వేయాల్సిందిగా ఇటీవల ప్రజలకు విన్నవించడం- నీతీశ్ ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా రూపుదిద్దారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతానికి 18 మంది యాదవ వర్గ నేతలతో బరిలోకి దిగిన జేడీయూ- ఆర్జేడీ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతివ్యూహం పన్నింది. లాలూప్రసాద్ కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ మాజీ మామ చంద్రికారాయ్ (ఈయన కుమార్తె తన భర్తతో వేరుపడ్డారు) జేడీయూ టికెట్‌పై పర్సా అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగారు.
రాయ్ కుటుంబానికి ఎంతోకాలంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో అనుబంధం ఉంది. ఆయన తండ్రి దరోగా ప్రసాద్ ఒకప్పుడు లాలూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015లో పాలిగంజ్ స్థానం నుంచి ఆర్జేడీ టికెట్‌పై గెలిచిన జైవర్ధన్ యాదవ్‌ను ఆకర్షించి తమ పార్టీ తరఫున బరిలోకి దింపడం ద్వారా జేడీయూ ప్రత్యర్థిని గట్టి దెబ్బే కొట్టింది. సొంత సామాజిక వర్గాల్లో గట్టి పట్టున్న ప్రముఖ ఆర్జేడీ నేతలను ఆ పార్టీకి వ్యతిరేకంగా తమ టికెట్‌పై నిలబెట్టడం ద్వారా జేడీయూ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముస్లిములు, యాదవులు నీతీశ్ తరఫున నిలబడుతుండటంతో ఈ రెండు వర్గాలూ పూర్తిస్థాయిలో సంఘటితంగా లేవనేది విదితమవుతోంది. ముస్లిం, యాదవ వర్గాల నుంచి ప్రముఖ నేతలను ఆకట్టుకొని బరిలోకి దింపడం ద్వారా నీతీశ్ విభజన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్జేడీ కూటమి నుంచి భారీ స్థాయిలో ఓట్లను జేడీయూకు అనుకూలంగా చీల్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పరిస్థితి ఇదీ...