ప్రపంచవ్యాప్తంగా అప్పటికే ఉన్న సంక్షోభాలు చాలవన్నట్లు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాజేసిపోయిన కొత్త కుంపట్లు అన్నీ ఇన్నీ కావు. నిన్నటివి కావు, నేటి రేపటి సవాళ్లను సమర్థంగా కాచుకొనేందుకు ప్రపంచదేశాలతో కలిసి పని చేస్తామని ప్రమాణ స్వీకారోత్సవ వేళ ప్రకటించిన కొత్త అధ్యక్షుడు జో బైడెన్- జాతీయ భద్రతా వ్యూహం కన్నా ముందే ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకం కాగల తన 'విజన్'ను వెల్లడించారు.
కొత్త ఒరవడికి శ్రీకారం..
ప్రపంచ భావి గతిపై మౌలిక చర్చ సాగుతున్న కీలక దశలో- ట్రంప్ మాదిరిగా 'అమెరికా ఫస్ట్' వంటి ఉద్వేగభరిత నినాదాల జోలికి పోకుండా 'ఆర్థిక భద్రతే జాతీయ భద్రత' అన్న ప్రాథమిక అవగాహన పునాదులపై వెలసిన విజన్ అది. ప్రవచిత విలువలకు దేశీయంగా పట్టం కట్టి తక్కిన చోట్ల వాటి పరిరక్షణపై మాట్లాడతామన్న హామీలో, సైనిక పాటవాన్ని ఆధునికీకరించాలంటూనే తొలుత దౌత్య మార్గంలోనే ముందడుగేస్తామన్న ధోరణిలో; కూటములు, భాగస్వామ్యాల్ని పునరుజ్జీవింపజేసి, అంతర్జాతీయ వ్యవస్థల్లో అమెరికా కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతామన్న ఆకాంక్షలో- కొత్త ఒరవడి ప్రస్ఫుటమవుతోంది. ఉత్తర కొరియానుంచి కొవిడ్ మహమ్మారి దాకా, ఇరాన్ బహుపాక్షిక ఒప్పందంనుంచి ప్యారిస్ ఒడంబడిక వరకు అన్నింటా ఉలిపికట్టె వరసలో సాగిన ట్రంప్- అమెరికాలోనూ వర్ణ దుర్విచక్షణ రాజకీయాలతో పెను సామాజిక అగాధాన్నే సృష్టించారు.
స్వేచ్ఛ, సౌభాగ్యం, శాంతి, వ్యక్తిగౌరవాలకు ప్రజాస్వామ్యమే కీలకమంటున్న బైడెన్ విజన్‌లో పెద్దన్న పోకడల కన్నా పెద్దరికం ఛాయలే కనిపిస్తున్నాయి. ఆర్థిక, సైనిక, దౌత్య, సాంకేతిక శక్తుల్ని మేళవించి అంతర్జాతీయ వ్యవస్థలకు స్థిర సవాళ్లు రువ్వే సామర్థ్యం ఒక్క చైనాకే ఉందని బైడెన్ మార్గదర్శక పత్రం సరిగ్గానే గుర్తించింది. చైనాతో కలిసి పని చేయడాన్ని తోసిపుచ్చకుండానే, బీజింగ్‌తో వ్యూహాత్మక స్పర్ధను బైడెన్ ప్రస్తావించడాన్ని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ స్వాగతించడం- గమనార్హ విశేషం!
'పారిస్' ఒప్పందంలోకి అమెరికా రీఎంట్రీ
'అగ్రరాజ్యంలో భారతీయ- అమెరికన్ల హవా'
భారత్‌తో దోస్తీ ప్రత్యేకం..
'ఏనుగు పడుకొన్నా గుర్రమెత్తు' అని నానుడి. అంతర్జాతీయ యవనికపై అమెరికా కోల్పోతున్న స్థానాన్ని భర్తీ చేసే లక్ష్యంతో చైనా ఎదుగుతున్నా- సమున్నత సైనిక ఆర్థిక శక్తి సంపన్నగా అగ్రరాజ్యం ప్రాబల్యం నేటికీ తిరుగులేనిది. మహమ్మారులు, వాతావరణ సంక్షోభాలు, సైబర్ దాడులు, ఉగ్రవాదం, హింసోన్మాదం వంటివాటిని ఏ ఒక్క దేశమో తనంత తానుగా పరిష్కరించలేదని, అమెరికాను పక్కనపెడితే వేరెవరికీ అది సాధ్యం కూడా కాదని బైడెన్ విశ్లేషిస్తున్నారు. ప్యారిస్ ఒడంబడికలో, డబ్ల్యూహెచ్‌ఓలాంటి సంస్థల్లో తిరిగి చేరడం ద్వారా సానుకూల సంకేతాలు ఇస్తున్న బైడెన్ సర్కారు- మిత్ర, భాగస్వామ్య దేశాలతో కలిసి అంతర్జాతీయ సహకార వేదికను నవీకరించడం ద్వారా శతాబ్ది సవాళ్లను ఎదుర్కోవాలనుకొంటున్నారు. మిత్రదేశాలన్నీ ప్రజాస్వామ్య కూటమిగా జతకట్టి పటుతర అంతర్జాతీయ నిబంధనల్ని క్రోడీకరిస్తే చైనాలాంటి దేశాల్నీ జవాబుదారీ చెయ్యగలమన్న బైడెన్- ఇండియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2020నాటికల్లా 'ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలు'గా ఇండియా అమెరికాలు నిలుస్తాయని ఏనాడో 2006లోనే భవిష్యద్దర్శనం చేసిన బైడెన్- బాధ్యతాయుత భాగస్వాములుగా రెండు దేశాలూ కలిసి పనిచేయకుండా అంతర్జాతీయ సవాళ్లలో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించలేమని ఆనాడే స్పష్టీకరించారు.
సాక్షాత్తు ఉపాధ్యక్షురాలు సహా 50 మందికిపైగా భారతీయ మూలాలున్నవారితో తన కొలువుకూటాన్ని పరిపుష్టం చేసిన బైడెన్- ఇండియాతో భాగస్వామ్యాన్ని మరో మెట్టు ఎక్కించడానికి చేయాల్సింది ఎంతో ఉంది. ఇండో పసిఫిక్‌లో చైనా దూకుడు కట్టడి కోసం మాత్రమే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరిమితం చేయకుండా, కీలక సాంకేతిక పరిజ్ఞానం బదిలీకీ చొరవ చూపాలి. అగ్రరాజ్యంతో భాగస్వామ్యం ప్రపంచ శాంతి సద్భావాలకు ప్రోది చేస్తుందన్న విశ్వాసం కలిగించడమే బైడెన్ విజన్ సాఫల్యానికి గీటురాయి!
ఇవీ చదవండి:అగ్రరాజ్యంలో నవశకం.. అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
ఇరాన్‌తో చర్చలకు సిద్ధం: అమెరికా
అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
అమెరికా నూతన కథను లిఖిద్దాం రండి: బైడెన్