మేర మీరిన మూర్ఖత్వంతో వాతావరణ మార్పు అన్నదే అర్థం లేనిదంటూ ప్యారిస్ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన డొనాల్డ్ ట్రంప్ కారణంగా పర్యావరణానికి వాటిల్లిన అనర్థం అంతాఇంతా కాదు. శ్వేతసౌధం చేతులు మారిన దరిమిలా చరిత్రాత్మక ప్యారిస్ ఒడంబడికకు కట్టుబాటు చాటిన జో బైడెన్, కాలుష్య ఉద్గారాల నియంత్రణకు చూపుతున్న నిబద్ధత కారుచీకట్లో కాంతిరేఖ అని చెప్పక తప్పదు. వాతావరణ మార్పులపై శాస్త్రీయ హెచ్చరికల్ని చెవిన పెట్టాల్సిందేనంటూ అధ్యక్షపీఠం అధిష్ఠించిన తొలివారంలోనే జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానాల్లో దానికి చోటు పెట్టిన బైడెన్ సర్కారు- ధరిత్రీ దినోత్సవం సందర్భంగా 40 దేశాల అధినేతలతో ఆన్‌లైన్ సదస్సు ద్వారా విశేష చొరవ కనబరచిందిప్పుడు! ప్రపంచ భవిష్యత్తును నిగ్గు తేల్చే దశాబ్ది ఇదేనంటూ- 2005 నాటి అమెరికా కాలుష్య ఉద్గారాల స్థాయిని 2030 నాటికి 50-52శాతం తగ్గించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.
2015లో ఒబామా ప్రభుత్వం అంగీకరించిన లక్ష్యానికిది రెట్టింపు అంటున్న అధికారులు- 2035 నాటికి అమెరికా విద్యుత్ రంగాన్ని నూరుశాతం కర్బన కాలుష్యరహితంగా బైడెన్ తీర్చిదిద్దగలరంటున్నారు. 2050 నాటికే అమెరికా ఆర్థికాన్ని కర్బన ఉద్గార తటస్థత (నెట్ జీరో) దిశగా మళ్లిస్తామన్న వాగ్దానంతో పాటు, మరో మూడేళ్ళలో పేద దేశాలకు అందించే ఆర్థిక తోడ్పాటును రెట్టింపు చేయడానికీ అమెరికా సంకల్పించింది. పర్యావరణాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్న కర్బన ఉద్గారాల్లో చైనా 28శాతం, అమెరికా 15, ఈయూ తొమ్మిది, ఇండియా ఏడుశాతం వాటా కలిగి ఉన్నాయి. అమెరికాతో పాటే కెనడా, జపాన్, దక్షిణ కొరియాలూ స్వయం నియంత్రణ లక్ష్యాల్ని మెరుగుపరచడం గమనార్హ విశేషం. చైనా కొత్త వాగ్దానాలేవీ చేయకపోయినా థర్మల్ విద్యుత్ కేంద్రాల్ని కచ్చితంగా నియంత్రిస్తామని చెబుతోంది. అగ్రరాజ్యంతో ఇంధన, వాతావరణ భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇండియా- నిర్దేశిత లక్ష్యాల దిశగా చేయాల్సింది మరెంతో ఉంది.
భారత్లోనే రూ. 3.75 కోట్ల నష్టం..