తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బలవర్ధక బాల్యమే లక్ష్యంగా! - పోషన్​ అభియాన్

బాల్యం తొలినాళ్లలోనే పౌష్టికాహారలేమి, వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు కొరవడటం.. వంటి ప్రాతిపదికలు పరిగణలోకి తీసుకుని ఆకలి సూచీ భారత్​కు 94వ స్థానం ఇచ్చింది. ఇటీవలె క్షుద్భాధ సూచీ తాజాగా వెల్లడించిన ఓ నివేదిక ద్వారా భారత్​ పరిస్థితేంటో స్పష్టమౌతోంది. ఈ నేపథ్యంలో భారత్ విస్తృత ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది.

Hunger_Index
బలవర్ధక బాల్యమే లక్ష్యంగా!

By

Published : Oct 19, 2020, 6:24 AM IST

పేదరికం- నిర్భాగ్య జన సమూహాలకే కాదు, దేశ ప్రగతి లక్ష్యాలకూ నిశ్శబ్ద మృత్యు ఘాతం. కాబట్టే, పేదరికాన్ని దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని రూపుమాపి, పౌరులందరి గౌరవప్రద జీవనానికి భరోసా ఇస్తామన్నది దేశ స్వాతంత్య్ర తొలి వేకువలో పార్లమెంటులో ప్రతిధ్వనించిన వాగ్దానాల సారాంశం!

'94వ స్థానంలో'

ఏడు దశాబ్దాల గణతంత్ర భారతంలో ఆరోగ్యకర జీవనమే కోట్లమందికి అందని ద్రాక్షగా మిగిలిపోగా, పొత్తిళ్లలోనే బాల్యం దుర్భర వేదనల పాలవుతోందని ప్రపంచ క్షుద్బాధా సూచీ తాజాగా వెల్లడించింది. పౌష్టికాహారలేమి, అయిదేళ్లలోపు పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు పెరగకపోవడం, ఎత్తుకు తగిన బరువు కొరవడటం, మరణాల శాతం ప్రాతిపదికలుగా రూపొందిన ఆకలి సూచీ- 107 దేశాల జాబితాలో మొత్తం 27.2 పాయింట్లతో ఇండియాకు 94వ స్థానం కట్టబెట్టింది.

సూడాన్​కు చేరువలో

నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మియన్మార్‌, పాకిస్థాన్‌ వంటివన్నీ మెరుగైన ప్రమాణాలు కనబరచగా సూడాన్‌ సరసన ఇండియా నిలిచిన తీరే- విధాన వైఫల్యాలను ఎలుగెత్తి చాటుతోంది.

2000 సంవత్సరంలో క్షుద్బాధా సూచీలో ఇండియా స్కోరు 38.9; 2006నాటికది 37.5కు, 2012కు 29.3కు దిగివచ్చింది. పేదలకు అభివృద్ధి ఫలాలు అందడంలో మందగమనాన్ని నిర్ధారిస్తూ దరిమిలా ఎనిమిదేళ్లలో ఇండియా కేవలం 2.1 పాయింట్ల మెరుగుదలే నమోదు చేసింది.

నివేదిక చెబుతోందేంటి?

దేశ జనాభాలో 14శాతం పౌష్టికాహార లోపంతో కునారిల్లుతున్నారని, అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గట్లు ఎదగనివారు 37.4శాతం, బరువు కొరవడినవారు 17.3 శాతమని, ఆ ఈడు పిల్లల్లో మరణాల రేటు 3.7శాతమనీ నివేదిక నిర్ధారించింది.

మొన్న మే నెలనాటి విశ్వ పౌష్టికాహార నివేదిక- సంతానవతులయ్యే వయసులోని స్త్రీలు ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారంటూ 2025నాటికి నిర్దేశిత లక్ష్యాలను ఇండియా చేరే అవకాశం లేదని ప్రకటించింది. కొవిడ్‌ కాటుకు జనజీవనం మరింతగా చితికిపోయిన వాస్తవాన్ని గుర్తించి- బాల భారతాన్ని ఆదుకునే వ్యూహాలకు సానపట్టి పట్టాలకెక్కించాలి!

'పోషన్​ అభియాన్​ ద్వారా'

బిడ్డపుట్టిన తొలి రెండేళ్లలోనే సమస్త పోషకాలు సమృద్ధిగా అందాలని, ఆ తరవాత ఎంత చేసినా ప్రయోజనం పూజ్యమనీ వైద్యప్రపంచం ఎలుగెత్తుతోంది. రక్తహీనతతో బాధపడే స్త్రీమూర్తులపై వారు గర్భం దాల్చకముందునుంచే శ్రద్ధ వహించి, పుట్టిన బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేదాకా సమతుల పోషకాలు అందేలా మాతా శిశు సంక్షేమ పథకాల్ని కొత్త పుంతలు తొక్కించాలి.

దేశవ్యాప్తంగా లక్షలకొద్దీ అంగన్‌వాడీలను నెలకొల్పి తల్లీ బిడ్డల పౌష్టికాహార బాధ్యతల్ని వాటికి కట్టబెట్టినా ఒనగూడిన ఫలితం పరిమితంగానే ఉంది. కాబట్టే, 2022కల్లా దేశంలో పోషకాహార ప్రమాణాల్ని మెరుగుపరచేందుకు 2017నుంచి కేంద్రం పోషణ్‌ అభియాన్‌ పథకాన్ని ప్రారంభించింది. తొలి మూడేళ్లలో కేంద్రం రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో కేవలం 30శాతమే వినియోగమైన తీరే నిర్వేదం కలిగిస్తోంది.

సెప్టెంబర్​ను పోషన్​ మాసంగా

ఏటా సెప్టెంబరును పోషణ్‌ మాసంగా ప్రకటించి బిడ్డల సమగ్ర ఎదుగుదలకు పూర్ణ ఆహారం అందించాలని నిర్ణయించినా- నిరుడు ఆ భాగ్యం దక్కించుకొన్న చిన్నారులు 43శాతమే.

6-24 నెలల లోపు పిల్లల్లో పదిశాతం లోపు మందికే తగిన పోషకాలందాయన్న సమాచారం దిగ్భ్రాంతపరచేదే! నేటి బాలల శారీరక మానసిక ఆరోగ్యకర ఎదుగుదలకోసం వెచ్చించే ప్రతి రూపాయీ, 35 రూపాయల లబ్ధి చేకూరుస్తుందన్న అధ్యయనాల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో గుణాత్మక మార్పులు కావాలి.

తల్లులు, పిల్లల సవివర సమాచారంతో ప్రణాళికాబద్ధ పౌష్టికాహార పంపిణీ చేపడుతున్న దేశాలన్నీ ధీమాగా పురోగమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గిడసబారిపోతున్న పిల్లల్లో 30శాతం, ఈసురోమంటున్న వారిలో 50శాతానికి పురిటి గడ్డగా భ్రష్టుపడుతున్న ఇండియా- భావితరానికి జవసత్వాలు సమకూర్చే విశిష్ట వ్యూహాన్ని సత్వరం రూపొందించాలి!

ఇదీ చదవండి:నేటి నుంచి భారత్- శ్రీలంక నౌకాదళ విన్యాసాలు

ABOUT THE AUTHOR

...view details