Beijing Olympics boycott: చైనాలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుంటోందని పేర్కొంటూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్‌లో జరిగే శీతకాల ఒలింపిక్ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. తమ అధికారులు, దౌత్యవేత్తలు ఎవరూ అందులో పాల్గొనబోరని బైడెన్ సర్కారు స్పష్టీకరించింది. తమ క్రీడాకారులు మాత్రం అందులో భాగస్వామ్యం వహిస్తారని వెల్లడించింది. ఆకుస్ కూటమిలో భాగస్వాములుగా ఉన్న ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్‌లతో పాటు కెనడా సైతం అమెరికా బాటలో నడుస్తున్నట్లు పేర్కొన్నాయి. దేశాల విధానాల పట్ల నిరసన తెలిపేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అంతర్జాతీయంగా సుహృద్భావాన్ని, దౌత్య సంబంధాలను పెంపొందించే క్రీడలను రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవడంపై ప్రస్తుతం నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)లో అన్ని దేశాల భాగస్వామ్యం ఉంది. ఆది నుంచీ ఐఓసీ రాజకీయంగా తటస్థంగా ఉంటూ వస్తోంది. అది నిర్వహించే ఆటల్లోకి రాజకీయాలను చొప్పిస్తే క్రీడాస్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Diplomatic boycott Beijing Olympics
క్రీడల ద్వారా ప్రశాంతమైన, ఉత్తమ ప్రపంచాన్ని రూపుదిద్దాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఇటీవల తీర్మానించింది. అగ్రరాజ్య బహిష్కరణ ప్రకటనకు కొద్ది రోజుల ముందే ఆ నిర్ణయం వెలువడింది. ఒక్క అమెరికా తప్ప 173 సభ్య దేశాలు దానికి అంగీకారం తెలిపాయి. ఒలింపిక్ క్రీడలు రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఐరాస ఆకాంక్ష నెరవేరుతుందని ఆ సంస్థలో ఐఓసీ శాశ్వత పరిశీలకులు లూయీ మొరీనో చెబుతున్నారు. రాజకీయ ఉద్దేశాలతో ఒలింపిక్స్‌ను బహిష్కరించడాన్ని ఐఓసీ తీవ్రంగా ఖండించింది. ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో సైతం తన నిరసన గళం వినిపించారు. అఫ్గానిస్థాన్‌పై సోవియట్లు దండెత్తిన సమయంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను వాషింగ్టన్ బహిష్కరించింది. బ్రిటన్ సహా చాలా దేశాలు అమెరికాకు వత్తాసు పలికాయి. బ్రిటిష్ ఒలింపిక్ సంఘం అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిరాజని ఆ క్రీడల్లో పాల్గొనాలని నిర్ణయించింది. వాటిలోనే సెబాస్టియన్ కో విజేతగా అవతరించారు.