తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'పాక్​కు రూ.55 కోట్లు ఇప్పించేందుకు గాంధీ దీక్ష!'.. నిజమెంత?

India Pak currency : రాజకీయ నిర్ణయాలతో రాత్రికి రాత్రి కొత్త దేశం ఏర్పడిందిగానీ.. ఛూ మంతర్‌ అంటూ అన్నింటినీ అలా సృష్టించలేని పరిస్థితి! భారత్‌-పాకిస్థాన్‌ మధ్య వాణిజ్య-ఆర్థిక కార్యకలాపాల విభజనకొచ్చేసరికి అనుకోని సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా కరెన్సీ, నాణేలు.. వాటి చలామణి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విభజనలో చిక్కుముడి పడింది. సొంత దేశం ఏర్పాటైనా.. భారత రూపాయినే పాకిస్థాన్‌ వాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు.. పాకిస్థాన్‌కు భారత్‌ రూ.55 కోట్లను చెల్లించనందుకు నిరసనగా గాంధీజీ దీక్ష చేస్తున్నట్లు ప్రచారమైంది. కానీ.. అందులో నిజానిజాలేంటో తెలుసుకునేందుకు ఈ పూర్తి కథనం చదవండి.

pakistan rupee
రూపాయి మనది.. ముద్ర పాక్​ది!

By

Published : Aug 11, 2022, 7:40 AM IST

Rupee history in India : విభజనకు ముందు వరకు పాకిస్థానీలు బెంగాల్‌, బొంబాయి, దిల్లీల్లో పనిచేసేవారు. భారతీయులు కూడా లాహోర్‌, కరాచీ, ఢాకాల్లో పనిచేసేవారు. వ్యాపార, వాణిజ్యాల్లో ఇబ్బందులు, అదనపు సుంకాలు లేవు. కానీ దేశాలు విడిపోయాక విదేశీమారకం, ఎగుమతి, దిగుమతి సుంకాల సమస్య తలెత్తింది. ఒకదశలో ఇరుదేశాలకూ ఒకే కరెన్సీని కొనసాగిస్తూ విదేశీమారక నిల్వలపై సంయుక్త నిర్వహణ, ఎగుమతి దిగుమతి సుంకాలు లేని వ్యవస్థ ఉండాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ.. ఇవే అమలైతే దేశ విభజనే అవసరం లేదంటూ దీన్ని తోసిపుచ్చారు. అదే సమయంలో.. తక్షణమే కొత్త కరెన్సీని అమలులోకి తేవటమూ కష్టమని గుర్తించారు. అప్పటికే ఏర్పడ్డ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) లాభాలు, ఆస్తులు, అప్పుల విభజన ఓ సవాలుగా మారింది. ఆ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌... మన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ భర్త సి.డి.దేశ్‌ముఖ్‌. ఆర్బీఐ తొలి భారతీయ గవర్నర్‌ ఆయనే. కె.జి. అంబేగావకర్‌, సంజీవరావు, ఎం.వి. రంగాచారి (భారత్‌వైపు), గులాం మహమ్మద్‌, జాహిద్‌ హుస్సేన్‌, ఐ.ఖురేషి (పాక్‌వైపు)తో కూడిన నిపుణుల కమిటీ ఈ ఆర్థిక విభజనను పర్యవేక్షించింది. నెల రోజుల్లో కరెన్సీ నోట్లు, నాణేల సమస్య, ఆర్బీఐ విభజన బాధ్యత వీరిపై పడింది.

1947 జులైలో కమిటీ తొలినివేదిక సమర్పించింది. దాని ప్రకారం.. 1948 మార్చి 31 దాకా భారత్‌-పాకిస్థాన్‌లో ఒకే కరెన్సీ నోట్లు, నాణేలు చలామణి అవుతాయి. భారత నోట్లపై పాకిస్థాన్‌ ప్రభుత్వం అని స్టాంపు వేసుకుని చలామణి చేసుకున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి పాకిస్థాన్‌ కొత్త నాణేలు, నోట్లు విడుదల చేసుకుంటుంది. ఆ తర్వాత కూడా ఆరునెలల పాటు పాక్‌లో భారత కరెన్సీ చెల్లుబాటు అవుతుంది. 1948 అక్టోబరు దాకా ఆర్బీఐ రెండు దేశాలకూ సేవలందిస్తుంది. తర్వాత పాక్‌ ప్రభుత్వంతో సమస్యల కారణంగా ఈ తేదీని ముందుకు జరిపారు.

ఉద్యోగుల విభజన తదితరాలన్నీ పూర్తయ్యాక నగదు నిల్వల పంపకం వద్ద గొడవ మొదలైంది. విభజన నాటికి భారత ప్రభుత్వం వద్ద రూ.400 కోట్ల నగదు నిల్వలున్నాయి. వీటిలో రూ.75 కోట్లు పాకిస్థాన్‌ వాటాగా తేల్చారు. 1947 ఆగస్టు 15 నాడే నిర్వహణ కోసమని రూ.20 కోట్లను విడుదల చేశారు. మిగిలిన రూ.55 కోట్ల విషయంలో ఆర్బీఐ, పాకిస్థాన్‌ మధ్య పీటముడి పడింది. దొడ్డిదారిన కశ్మీర్‌ను ఆక్రమించటానికి పాకిస్థాన్‌ తెరలేపింది. అదే సమయంలో మిగిలిన తమ రూ.55 కోట్లను బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌లోని ప్రభుత్వ ఖాతాలకు జమచేయాలంటూ ఆర్బీఐని కోరింది. దీనిపై ఆర్బీఐ గవర్నర్‌ దేశ్‌ముఖ్‌ భారత ఆర్థిక శాఖను సంప్రదించారు. అక్కడి నుంచి 'వద్దు' అనే సమాధానం వచ్చింది. కారణం.. ఈ సొమ్ముతో పాక్‌ విదేశాల నుంచి ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసి కశ్మీర్‌లో యుద్ధాన్ని ఎగదోయాలని ప్రయత్నిస్తుండటమే!

Gandhi 55 crore to Pakistan : ప్రస్తుత పరిస్థితుల్లో రూ.5 కోట్లకు మించి ఇవ్వలేమని పాకిస్థాన్‌కు దేశ్‌ముఖ్‌ తెలిపారు. దీనిపై పాక్‌ ఆగ్రహం వ్యక్తంజేసింది. అలాగైతే తమ అనుమతి లేకుండా భారత ప్రభుత్వం కూడా లావాదేవీలు నిర్వహించొద్దని డిమాండ్‌ చేసింది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఆ సొమ్మును ఇచ్చేది లేదని హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పాకిస్థాన్‌కు స్పష్టం చేశారు. ఇంతలో గాంధీజీ దిల్లీలో హిందూ-ముస్లింల ఐక్యతను కోరుతూ ఉపవాసదీక్ష ఆరంభించారు. పాకిస్థాన్‌కు భారత్‌ రూ.55 కోట్లను చెల్లించనందుకు నిరసనగానే ఆయనీ దీక్ష చేస్తున్నట్లు ప్రచారమైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పాక్‌కు రూ.55 కోట్లు ఇవ్వాల్సిందేనంటూ గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటెన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన గాంధీజీ వద్దకు తీసుకెళ్లారు. ఒప్పందాన్ని ఉల్లంఘించటం సరికాదన్న ఆయన వాదనతో గాంధీజీ ఏకీభవించారు. అంతేతప్ప పాకిస్థాన్‌కు ఈ సొమ్ము ఇప్పించాలని ఆయన దీక్ష చేపట్టలేదు.

Pakistan rupee history : 1948 ఫిబ్రవరిలో కరాచీకి రావాలన్న పాక్‌ ఆర్థిక శాఖ ఆహ్వానాన్ని దేశ్‌ముఖ్‌ నిరాకరించారు. చివరకు.. ముందుగా నిర్ణయించిన 1948 మార్చి 31కంటే ముందే ఆర్బీఐతో తెగతెంపులు చేసుకోవాలని పాక్‌ నిర్ణయించింది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ను ఏర్పాటు చేసుకొని.. తమ కరెన్సీ ముద్రణ, నిర్వహణను అప్పగించింది. ఆ తర్వాత కొద్దిరోజులకు భారత్‌ రూ.55 కోట్లను పాక్‌కు చెల్లించింది. పాకిస్థాన్‌ మాత్రం తన జమాఖర్చు లెక్కల్లో ఆర్బీఐ నుంచి లెక్క తేలని మొత్తాన్ని తమ ఆస్తులుగా దశాబ్దాలుగా అలాగే చూపుతూనే వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details