1940లో ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని కోరుతూ ముస్లింలీగ్ తీర్మానం చేసింది. పాకిస్థాన్ ఏర్పాటును వదిలిపెట్టి.. కావాలంటే భారత ప్రధాని పదవి చేపట్టాలని జిన్నాకు సుభాష్ చంద్రబోస్ సూచించారు. అప్పటికి ఆ అంశం అంత తీవ్రత సంతరించుకోకపోవటంతో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొద్దిరోజులకే.. గాంధీజీ సన్నిహితుడైన రాజాజీ.. ముస్లింలీగ్ నేత ప్రధానిగా ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తూ.. గాంధీజీ పరోక్షంగా ఈ ప్రతిపాదన చేశారు. బ్రిటిష్ వైస్రాయ్ లిన్‌లిత్‌గోకు రాసిన లేఖలో.. "యావత్ భారతావని పక్షాన.. ముస్లింలీగ్‌కు మీరు అధికారం బదిలీ చేసి వెళితే కాంగ్రెస్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు. ముస్లింలీగ్ ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మేం అడ్డంకులు సృష్టించం. కావాలంటే మెరుగైన పాలన కోసం ప్రభుత్వంలో చేరతాం. ఇది ఎంతో నిబద్ధతతో, నిష్ఠతో చేస్తున్న ప్రతిపాదన" అని గాంధీజీ స్పష్టం చేశారు. 1944లో గాంధీ-జిన్నా మధ్య నేరుగా సుదీర్ఘ చర్చలు సాగాయి. భారత్‌ను కలిపి ఉంచటంపైనే ఇద్దరూ చర్చించారు. పాకిస్థాన్ ఏర్పాటు ఆవశ్యకతపై గాంధీజీని ఒప్పించటంలో జిన్నా విఫలమయ్యారు. 1946 కేబినెట్ మిషన్ రాయబారం సందర్భంగా కూడా గాంధీజీ ఇదే విషయం ప్రస్తావించారు. బ్రిటన్ ప్రభుత్వం పంపించిన కేబినెట్ బృందం పాకిస్థాన్ ఏర్పాటుకు అవకాశం లేదని తేల్చింది. దాని బదులు బలహీన కేంద్రం, బలమైన రాష్ట్రాలతో కూడిన ఐక్య భారత్‌ను ప్రతిపాదించింది. ఇందుకు తొలుత జిన్నా అంగీకరించాడు కూడా. కానీ చివరకు కేబినెట్ మిషన్ కూడా విఫలమై.. విభజన దిశగా అడుగులు పడ్డాయి. అధికార మార్పిడి సవ్యంగా పూర్తి చేయటానికి చివరి వైస్రాయ్‌గా 1947లో మౌంట్‌బాటెన్ భారత్‌లో అడుగు పెట్టాడు.
1947 ఏప్రిల్ 1న వైస్రాయ్ మౌంట్‌బాటెన్‌ను గాంధీజీ కలిశారు. అప్పటికింకా విభజన ప్రకటన వెలువడలేదు. 1948 జూన్‌కల్లా భారత్‌ను విడిచిపెడతామంటూ మాత్రమే బ్రిటన్ ప్రకటించింది. 1947 ఆగస్టు 15 ముహూర్తం కూడా పెట్టలేదింకా! అంతా అయోమయంగా చర్చోపచర్చలు సాగుతున్న ఆ సమయంలో.. గాంధీజీ మరోమారు తన పరిష్కార సూత్రాన్ని మౌంట్‌బాటెన్ ముందుంచారు. "ముస్లింలీగ్ సభ్యులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా జిన్నాను కోరండి. స్వాతంత్య్రం ప్రకటించేదాకా ఆయన సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వమే అధికారంలో ఉండొచ్చు" అని సూచించారు. గాంధీజీ సూచన విన్న మౌంట్‌బాటెన్... ఈ విషయంపై జవహర్‌లాల్ నెహ్రూతో చర్చించవచ్చా? అని అడిగారు. అందుకు గాంధీజీ సరే అన్నారు. అదే రోజు మధ్యాహ్నం మౌంట్‌బాటెన్-నెహ్రూ మధ్య భేటీ జరిగింది. గాంధీజీ ప్రతిపాదనను నెహ్రూకు చెప్పాడు మౌంట్‌బాటెన్. అది వినగానే నెహ్రూ నవ్వి.. "ఇందులో కొత్తేమీ లేదు. బాపూ చాలాకాలం నుంచి ఈ వాదన వినిపిస్తున్నారు. 1942లో చెప్పారు. కేబినెట్ మిషన్ ముందూ ఉంచారు" అని గుర్తు చేశారు. గాంధీ ప్రతిపాదన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులకు ఇష్టం లేదు.
కాంగ్రెస్‌కే కాదు.. ముస్లింలీగ్, జిన్నాకు కూడా ఇష్టం లేదు. గాంధీని విశ్వసించని జిన్నా ఈ ప్రతిపాదనను నమ్మలేదు. "గాంధీ చెబుతున్న స్వతంత్ర భారతానికి మేం కోరుతున్నదానికి తేడా ఉంది" అన్నాడు జిన్నా.