తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆగమేఘాలపై దేశవిభజన.. లెక్కలేసుకుంటూ ఆస్తి పంపకాలు.. పుస్తకాలనూ చించేసి.. - Azadi ka amrti mahotsav latest

Azadi ka amrit mahotsav: అనుకోని విభజన, అనూహ్య వలసలు, ఆగని అల్లర్లు... అంతా అతలాకుతలం... ముంచుకొస్తున్న స్వాతంత్య్ర ముహూర్తం... పూర్తిగా గందరగోళం... అలాంటి వేళ ఆస్తుల పంపకం ఎంత కష్టం? అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది నాటి నాయకత్వం! 70 రోజుల్లో అన్ని విభాగాలు, శాఖల వారీగా ఆస్తులు, అప్పుల విభజన, పంపకాలు చేశారు. ఈ పంపకం ఆసక్తికరమే కాదు... దేశ విభజనలా ఆవేదనాభరితం కూడా!

azadi ka amrit
azadi ka amrit

By

Published : Aug 10, 2022, 7:22 AM IST

Pakistan India partition stories: భారత్‌, పాకిస్థాన్‌ భౌగోళిక సరిహద్దుల్ని తేల్చే పని రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. మరి ఆస్తులు, అప్పుల సంగతేంటనే ప్రశ్న తలెత్తింది. 1947 జూన్‌ 12 వైస్రాయ్‌ ఛైర్మన్‌గా విభజన కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్‌ తరఫున సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, ముస్లింలీగ్‌ నుంచి లియాఖత్‌ అలీఖాన్‌, అబ్దుర్‌ రబ్‌ నిష్తార్‌ సభ్యులు. వీరికి సహాయకంగా ఉన్నతాధికారులతో పది నిపుణుల బృందాల్ని నియమించారు. విభజన కమిటీకి, నిపుణుల బృందాలకు మధ్య వారధిగా... ఇద్దరు సీనియర్‌ బ్యూరోక్రాట్లు హెచ్‌ఎం పటేల్‌, మహమ్మద్‌ అలీలతో స్టీరింగ్‌ కమిటీని పెట్టారు. అయినా... రెండు వైపులా తేల్చుకోలేని సమస్య వస్తే విచారించడానికి ఒక మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాల స్థాయిలోనూ విభజన కోసం శాఖల వారీగా ఇలాగే సమప్రాధాన్యంతో కమిటీలు ఏర్పడ్డాయి.

70 రోజుల్లో శాఖలవారీగా ఫైళ్లు, రికార్డులను విభజించాల్సి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన దస్త్రాలను 'ఎ' అనీ; భారత దస్త్రాలకు 'బి' అనీ, ఇద్దరికీ చెందినవాటికి 'సి' అని ముద్రలేశారు. గుండు పిన్నుల నుంచి... కుర్చీలు, బల్లలు, బెంచీలు, ఫ్యాన్లు, పేపర్‌ వెయిట్‌లు, పెన్‌ స్టాండ్‌లు... ఇలా ప్రతిదీ లెక్కగట్టి ఎవరికెన్నో తేల్చారు. ఉదాహరణకు... విదేశాంగశాఖలో 386 టైప్‌రైటర్లుంటే... 183 భారత్‌కిచ్చి మిగిలినవాటిని కరాచీకి తరలించారు. అలాగే 31 పెన్‌స్టాండ్లు, 125 పేపర్‌ స్టాండ్లు, 16 కుర్చీలు, 31 బల్లలు, 20 ప్యూన్‌ బెంచీలు కేటాయించారు.

  • ఈ క్రమంలో... విదేశాంగ శాఖలో కశ్మీర్‌కు సంబంధించిన ఫైళ్లపై 'ఎ' అని రాసేశారు. తర్వాత విభజనలో కశ్మీర్‌ భాగం కాదని గుర్తించి... 'సి'గా మార్చారు.
  • ఉద్యోగులకు ఏ దేశాన్నైనా ఎంచుకునే వెసులుబాటిచ్చారు. అయితే వెంటనే తేల్చుకోవటం కష్టమని గుర్తించి, అప్పటికప్పుడు సర్దుబాటుచేసి నిర్ణయించుకోవటానికి ఆరు నెలల సమయం ఇచ్చారు.
  • సైన్యంలో ఈ వెసులుబాటు ఇవ్వలేదు. ముస్లిమేతరులు భారత్‌కు, ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లాలని ముందే స్పష్టంచేశారు.
  • నేరస్థుల విషయంలో మాత్రం మతం ప్రాధాన్యం వహించలేదు. మతమేదైనా... నేరస్థులను వారు నేరం చేసిన ప్రాంతంలోని జైళ్లకు బదిలీ చేయాలని నిర్ణయించారు.
  • ఆస్తుల పంపకం 4:1 నిష్పత్తి చొప్పున జరిగింది. అంటే... ప్రతి ఐదు బంగారు కడ్డీల్లో నాలుగు భారత్‌కు, ఒకటి పాక్‌కు కేటాయించారు.
  • లాహోర్‌లో ఓ పోలీసు సూపరింటెండెంట్‌ తన హిందూ, ముస్లిం డిప్యూటీలకు చేసిన పంపకం నవ్వు తెప్పించింది. తలపాగాలు, లాఠీలు, రైఫిళ్లతోపాటు పోలీసు బ్యాండ్‌ను కూడా 4:1 చొప్పున విభజించారు. ఒక పిల్లనగ్రోవి పాక్‌కు ఇస్తే, బ్యాండ్‌ భారత్‌కు ఇచ్చారు.
  • పుస్తకాల విషయంలోనైతే ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరించారు. పంజాబ్‌ లైబ్రరీలో ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికాను ఎ నుంచి కే వరకు చింపి భారత్‌కు, మిగిలిన భాగాన్ని పాక్‌కు ఇచ్చారు.
  • మద్యం నిల్వల్ని పాకిస్థాన్‌ నిరాకరించింది. కారణం ఇస్లామిక్‌ నియమాల ప్రకారం... మద్యానికి వ్యతిరేకం. కాబట్టి తమ వాటా మద్యానికి సరిపడా డబ్బులు తీసుకొని... మద్యాన్ని భారత్‌కు వదిలేసింది.

వైస్రాయ్‌కి రెండు బగ్గీలుండేవి. ఒకటి బంగారుది, రెండోది వెండిది. ఎవరికేది ఇవ్వాలనే విషయంలో... మౌంట్‌బాటెన్‌ సిబ్బంది లాటరీ వేశారు. బంగారు బగ్గీ భారత్‌కు వచ్చింది. అలా... వైస్రాయ్‌ బంగళాలోని అన్నింటినీ విభజించాక... ఉత్సవాల సమయంలో ఊదే ఓ బూర మిగిలింది. ఎవరికివ్వాలో అర్థంగాని పరిస్థితిలో... తానే తీపిగుర్తుగా ఉంచుకుంటానంటూ మౌంట్‌బాటెన్‌ తీసుకెళ్లిపోయాడు.

అభిమానం లేకున్నా.. విద్వేషం లేదు..
బయట వాతావరణం ఎంత ఉద్విగ్నంగా ఉన్నా... సీనియర్‌ బ్యూరోక్రాట్లు సంయమనంతో వ్యవహరిస్తూ 70 రోజుల్లో ఈ ప్రక్రియ అంతటినీ ముగించారు. 'ఆస్తుల పంపకం సమయంలో అధికారుల మధ్య పరస్పరం అభిమానం లేకున్నా... విద్వేషం లేదు' అని అని హెచ్‌ఎం పటేల్‌ నాటి పనితీరును వివరించారు.

ABOUT THE AUTHOR

...view details