తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దేశమంతా సంతోషం.. గాంధీ మదినిండా దుఃఖం.. 1947 ఆగస్టు 15న ఏమైంది? - mahatma gandhi india

అన్నాళ్ళూ యావద్దేశాన్ని నడిపించి.. అహింసా పద్దతిలో బ్రిటిష్‌ను ఎదిరించిన మహాత్ముడు.. స్వాతంత్య్రోదయాన ఎలా స్పందించారు? ఆనంద వేళ ఎలాంటి సంబరాల్లో పాల్గొన్నారు.. అని చరిత్రలోకి తొంగిచూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే!

mahatma gandhi
దేశమంతా సంతోషం.. గాంధీ మదినిండా దుఃఖం.. 1947 ఆగస్టు 15న ఏమైంది?

By

Published : Aug 12, 2022, 7:30 AM IST

ఎర్రకోటపై జవహర్‌లాల్‌ నెహ్రూ మువ్వన్నెల జెండా ఆవిష్కరిస్తుంటే.. గాంధీజీ బెంగాల్‌లో శాంతి జెండా ఎగరేశారు! ఒకపైపు స్వాతంత్య్ర సంబరాలు సాగుతుంటే, మరోవైపు మహాత్ముడు మనోవేదనతో గడిపారు. అంతా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుంటే ఆయన కన్నీళ్ళతో నిండిపోయారు! నెహ్రూ తదితరులు దిల్లీలో పదవీ ప్రమాణాలు చేస్తుంటే.. బెంగాల్‌లో ఆయన మతకల్లోలాలను ఆర్పే ప్రమాణాలు చేయించే పనిలో నిమగ్నమయ్యారు! భారతీయులంతా సంతోషంతో మిఠాయిలు పంచుకుంటుంటే.. ఆయన ఉపవాస దీక్ష చేశారు!

భారత్‌-పాకిస్థాన్‌లుగా విభజనతో కూడిన స్వాతంత్య్రం.. సంబరాలతో పాటు లక్షల కుటుంబాల్లో సంక్షోభానికి కూడా కారణమైంది! బ్రిటిష్‌ ప్రభుత్వ చేతగానితనానికి మతోన్మాదం తోడవటంతో.. దేశంలోని అనేక చోట్ల.. ముఖ్యంగా బెంగాల్‌, పంజాబ్‌ల్లో హిందూ-ముస్లిం మతకల్లోలాలు, మారణకాండ చెలరేగింది. లాహోర్‌ నుంచి ఢాకా దాకా లక్షల మంది మరణించారు. అంతకు కొద్దినెలల ముందు నుంచే పరిస్థితి తీవ్రంగా ఉన్న బెంగాల్‌లోని నోఖాలి (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) ప్రాంతాన్ని సందర్శించటానికి ఆగస్టు 9న బయల్దేరారు గాంధీజీ! కానీ స్థానిక నాయకులు ఆయన్ను కోల్‌కతాలోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముస్లింలు అధికంగా ఉండే.. మియాబాగన్‌ ప్రాంతంలో ఆయన బస చేశారు. ఆయన రాకపై వ్యతిరేకత వ్యక్తమైనా.. వెరవలేదు. ఒకట్రెండు రోజుల్లో పరిస్థితి సర్దుకుంది. అల్లర్లు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అప్పటిదాకా మతకల్లోలాలతో అట్టుడికిన కోల్‌కతాలో ఆయన ప్రభావంతో ఆగస్టు 15న అనూహ్య చిత్రం చోటు చేసుకుంది. హిందూ, ముస్లింలు కలసిమెలసి సంబరాలు చేసుకున్నారు. దీనిపై లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ స్పందిస్తూ.. "పంజాబ్‌లో మేం 55వేలమంది సైనికులను దించినా రక్తపాతాన్ని నియంత్రించలేకపోయాం. కానీ.. బెంగాల్‌లో కేవలం ఒకే ఒక్కడు.. అందరినీ దారిలోకి తెచ్చారు" అని గాంధీజీని ప్రశంసించారు!

డబ్బుకు కక్కుర్తి పడకండి!
ఆగస్టు 15న గాంధీ 24 గంటలు ఉపవాసం ఉన్నారు. ప్రార్థనలు చేసి.. ఖద్దరు వడికారు. "స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న ఈ తొలిరోజు మనం పేదవారిని, ఆకలితో అలమటిస్తున్నవారిని మరచిపోకూడదు. అందుకే ఈ ఉపవాసం. పేదరికాన్ని పారదోలటం.. మన జాతీయోద్యమ ప్రాథమిక లక్ష్యం. దాన్ని మరవకూడదు" అన్నారు. బెంగాల్‌ గవర్నర్‌ సి.రాజగోపాలచారి, కొంతమంది విద్యార్థులతో పాటు మంత్రులు గాంధీజీని కలవటానికి వచ్చారు. బెంగాల్‌ మంత్రులను ఉద్దేశించి.. "మీ తలలపై ఉన్నదిప్పుడు ముళ్ళకిరీటం! డబ్బుకు కక్కుర్తి పడకండి" అంటూ హెచ్చరించారు గాంధీజీ! జూన్‌ 3న జరిగిన ప్రార్థన సమావేశంలో.. "ఒకవైపు ప్రజలు తిండికోసం అలమటిస్తుంటే.. ఉద్యోగాల కోసం అల్లాడుతుంటుంటే.. బాడీగార్డులతో, వందలమంది సేవకులతో విశాల భవనాల్లో విలాసంగా జీవించేవారికి (వారు బ్రిటిష్‌వారైనా, మనవారైనా) అంతా అప్పగిస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు" అన్నారు గాంధీజీ. నిరాడంబరత పాటించాల్సిందిగా కోరుతూ 1947 జులై 28న నెహ్రూకు కూడా లేఖ రాశారు. అంతేగాకుండా వైస్రాయ్‌ని తక్షణమే రాష్ట్రపతి భవనం వదిలి.. మామూలు ఇంట్లో ఉండేలా ఒప్పించాలని సూచించారు. వైస్రాయ్‌ మారలేదు సరికదా.. గాంధీజీ చనిపోయాక నెహ్రూ సైతం... గతంలో బ్రిటిష్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఉన్న భారీ భవంతి (తీన్‌మూర్తి భవన్‌)ని తన నివాసంగా ఎంచుకున్నారు.

స్వతంత్ర దేశంలో పరిస్థితులను చూసి రోజురోజుకూ గాంధీజీలో ఆవేదన పెరిగిందే తప్ప తగ్గలేదు. తన హత్యకు నెల రోజుల ముందు.. "బ్రిటిష్‌పై పోరాటం చాలా కష్టంగా భావించాం. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అదే చాలా సులభమని అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇవాళ మన వేళ్లను మనమే నరుక్కుంటున్నాం. మనల్ని మనం పరిశుద్ధం చేసుకోలేదు కాబట్టే.. ఈ ప్రభుత్వం వచ్చింది. నా దృష్టిలో ఇది స్వరాజ్యంకాదు" అని అన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రార్థనల తర్వాత సమావేశంలో గాంధీజీ మాట్లాడేవారు. తన భావాలను పంచుకునేవారు. లేఖలను చదివి... సమాధానాలిచ్చేవారు. అలా.. 1948 జనవరి 12న కొండా వెంకటప్పయ్య రాసిన లేఖను ప్రస్తావించారు. ఆ లేఖలో ఏం ఉందంటే.. "కాంగ్రెస్‌ నేతల విలువలు దిగజారటం సమస్యగా కనిపిస్తోంది. అధికారం నెత్తికెక్కింది. దీపం ఉండగానే ఇల్లుచక్కబెట్టుకోవాలనే ధోరణి అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కనిపిస్తోంది. అడ్డదారిలో సొమ్ము సంపాదించేందుకు పరపతిని వాడుకుంటున్నారు. నీతినిజాయతీగల అధికారి పదవిలో కొనసాగలేని పరిస్థితి నెలకొంటోంది. వీరికంటే బ్రిటిష్‌ పాలనే బాగుండేదని ప్రజలనుకోవటం మొదలెట్టారు!"

ABOUT THE AUTHOR

...view details