Indian education in 75 years of independence: భారత్... ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్యాధామం. గణితం, ఖగోళం, ఆయుర్వేదం, తత్వం వంటి శాస్త్రాలకు కేంద్ర బిందువు. చైనా, ఇండోనేసియా, కొరియా, జపాన్, పర్షియా (ఇరాన్), మయన్మార్ (బర్మా), టర్కీ (తుర్కియే) తదితర దేశాల విద్యార్థుల కలలకు గమ్యస్థానం. పరాయిపాలనకు చిక్కి ఈ వైభవం చరిత్రగా మిగిలిపోయింది.
బ్రిటిష్ పాలన ఆరంభమయ్యే వరకూ మనదైన విద్యావ్యవస్థ సలక్షణంగా కొనసాగింది. ఇంత పెద్ద దేశాన్ని చెరబట్టిన తెల్లదొరలు.. ఇక్కడి విద్యా విధానాన్నీ తమ మనుగడకు అనువుగా మార్చేశారు. ఫలితంగా మనది కాని ఆంగ్లం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేందుకు మాత్రమే అనువైన బోధన విధానాలు బడులను ఆక్రమించాయి. ఈ చట్రంలో ఇరుక్కున్న స్వదేశీ విద్య.. శతాబ్దాల పోరాటంతో దాస్య శృంఖలాలను తెంచుకుని స్వతంత్ర ప్రస్థానం ఆరంభించింది. ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని పురోగమిస్తోంది.
- 1947లో కేవలం 12% అక్షరాస్యత, 2.10 లక్షల పాఠశాలలతో ప్రారంభమైన ప్రయాణం.. నేడు 77.70% అక్షరాస్యులు, 15 లక్షలకుపైగా బడులతో విరాజిల్లుతోంది.
- స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇరవై విశ్వవిద్యాలయాలు ఉండగా, ఇప్పుడవి 1,055కు పెరిగాయి.
- నాటి ఇంజినీరింగ్ కళాశాలలు కేవలం 33... ఇప్పుడవి ఏకంగా 3,010.
- దేశంలోని ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 44.50 కోట్లు.
- ఇది రష్యా, పాకిస్థాన్, బ్రిటన్‌ల మొత్తం జనాభాతో సమానం.
- 1947 కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన ఖర్చు రూ.1.38 కోట్లు.
- అదే 2022లో రూ.1.04 లక్షల కోట్లు.
- అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా (12.50 కోట్ల మంది) ఆంగ్లం మాట్లాడుతున్నదీ భారతీయులే.
భిన్నత్వంలో ఏకత్వమే ఆత్మగా ఉన్న భారతదేశం అనాదిగా చక్కని చదువరి. స్వాతంత్య్రానికి 120 ఏళ్ల ముందే ఆంగ్లేయ పాలకులు అప్పటి మద్రాసు, బొంబాయి, బెంగాల్ ప్రాంతాల్లో ఓ సర్వే చేశారు. ప్రాంతీయ భాషల్లోనే పాఠశాలలు నడుస్తున్నాయని.. కొన్నిచోట్ల ప్రతి వెయ్యి మందికి ఒకటి చొప్పున ఉన్నాయని.. నాణ్యమైన చదువు అందుతోందని తేల్చారు. ఐరోపా ఖండంలోని పాఠశాలలన్నీ కలిపినా భారత్‌లోని బడుల సంఖ్యకు సరిపోవని ఆ సర్వే నిర్ధారించింది. ఇంతటి పటిష్ఠమైన మన విద్యావ్యవస్థను బ్రిటిష్ అధికారి మెకాలే ఛిన్నాభిన్నం చేశాడు. అది మొదలుగా మన చదువుల రూపురేఖలు మారిపోయాయి. దీన్ని సరిదిద్దే క్రమంలో మన విద్యావ్యవస్థ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని.. నిలదొక్కుకుంది. ఓనమాలు మొదలు ఓవర్సీస్ విద్య వరకు ఎన్నో విజయాలు సాధించి.. దేశ మేధాసంపత్తి విశ్వమంతా విస్తరించింది. ప్రపంచ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, గూగుల్‌కు సుందర్ పిచాయ్, ఐబీఎంకు అరవింద్ కృష్ణ, ట్విటర్‌కు పరాగ్ అగర్వాల్, అడోబ్‌కు శంతను నారాయణ్, పెప్సీకోకు ఇంద్రా నూయి.. ఇలా ఎందరో భారతీయులు ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్లంతా మన దేశంలో చదువుకున్నవారే. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషితో అక్షరయాత్ర అప్రతిహతంగా సాగుతున్నా.. ఇంకా చేరుకోవాల్సిన గమ్యాలు, ఛేదించాల్సిన సవాళ్లు చాలానే ఉన్నాయి.
చదువు నేర్పిన చట్టాలు.. పథకాలు:బ్రిటిష్ సంకెళ్లను తెంచుకున్న అనంతరం దేశ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చే దిశగా పలు కమిషన్ల సిఫార్సుల మేరకు వివిధ చట్టాలు, పథకాలు అమల్లోకి వచ్చాయి.
- విశ్వవిద్యాలయ విద్యపై 1948లో రాధాకృష్ణన్ కమిషన్, మాధ్యమిక విద్యపై 1952లో మొదలియార్ కమిషన్, విద్యపై సమగ్ర పరిశీలనకు 1964లో కొఠారి కమిషన్ నిశిత మథనం సాగించాయి. వాటి సిఫారసుల ఆధారంగా రూపొందించిన జాతీయ విద్యావిధానం-1968, నూతన విద్యావిధానం-1986... ఇంకా పలు కమిటీల సూచనలు చదువుల ప్రస్థానానికి మార్గనిర్దేశం చేశాయి.
- అందరికీ ప్రాథమిక విద్య అందించాలని, త్రిభాషా సూత్రాన్ని పాటించాలని, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలను వినియోగించాలని.. పారిశ్రామిక, వ్యవసాయ, వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టాలని కొఠారి కమిషన్ సూచించింది. అనంతర కాలంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డు, డిపెప్, అనియత కేంద్రాలు, సర్వశిక్ష అభియాన్ (సమగ్ర శిక్ష అభియాన్) వంటి పథకాలు విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి.
- 14 ఏళ్లలోపు బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య లక్ష్యంతో 2009లో విద్యాహక్కు చట్టం రూపుదాల్చింది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నా, ఇంకా 3.20 కోట్ల మంది బడులకు దూరంగా ఉన్నారు.
రాజ్యాంగ సవరణతో ఉమ్మడి జాబితాలోకి..:భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలది. దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని 1968 నాటి జాతీయ విద్యావిధానం నిర్దేశించడంతో.. 1976లో రాజ్యాంగ సవరణ చేపట్టి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. జాతీయ చట్టాల స్ఫూర్తి దెబ్బతినకుండానే రాష్ట్రాలు తమ అవసరాల మేరకు వాటిని మార్పులతో అమలు చేస్తున్నాయి.
తొలిసారి తెలుగు నేలపై..:
- సార్వత్రిక విద్య కోసం దేశంలోనే తొలిసారిగా నాగార్జున సాగర్ కేంద్రంగా 1982లో ఏపీ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భవించింది. దీన్ని తర్వాత హైదరాబాద్‌కు తరలించి.. డా.బి.ఆర్.అంబేడ్కర్ పేరు పెట్టారు.
- వైద్య విద్య నిమిత్తం విజయవాడ కేంద్రంగా 1986లో 'ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్' ఏర్పాటైంది. తర్వాత దీనిపేరు డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మారింది.
ఆశావహం.. నూతన విద్యావిధానం:విద్యా రంగానికి, భావితరాలకు సరికొత్త దిశానిర్దేశం చేసేలా కేంద్ర ప్రభుత్వం 'జాతీయ విద్యా విధానం-2020'ని తెచ్చింది. 2030 నాటికి బడిఈడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలని సంకల్పించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఏకీకృతం చేసి, 15 వేల అద్భుత విద్యా సంస్థలను తీసుకురావాలని భావించింది. పరిశోధనలకు దన్నుగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, చదువుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరమ్‌లను నెలకొల్పాలని నిశ్చయించింది. 2040 నాటికి ప్రతి విశ్వవిద్యాలయాన్ని మల్టీ డిసిప్లినరీ విద్యా సంస్థగా మార్చాలని తలపోసింది. వచ్చే పాతికేళ్ల ప్రయాణంలో వీటన్నిటినీ సాకారం చేసుకుని పురోగమించాల్సి ఉంది.