తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విస్తరిస్తున్న గృహ నిర్మాణరంగం.. 'అందరికీ ఇల్లు' ఎప్పుడో? - azadi ka amrit mahotsav

AZADI KA AMRIT MAHOTSAV: దేశంలో గృహనిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తోంది. పట్టణ జనాభా పెరిగిపోతోంది. అయితే, పట్టణాల్లో కనీస అవసరాల కొరత.. జనాలను వేధిస్తోంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న ప్రస్తుత సమయంలో.. మన దేశంలోని గృహ నిర్మాణ రంగం పురోగతిని, భవిష్యత్తు లక్ష్యాలను ఓసారి పరిశీలిస్తే...

AZADI KA AMRIT HOUSE FOR ALL
AZADI KA AMRIT HOUSE FOR ALL

By

Published : Aug 10, 2022, 10:38 AM IST

➼ పల్లె చిన్నబోతోంది.. పట్నం కిటకిటలాడిపోతోంది.. గ్రామాల నుంచి జనం పొట్టచేతపట్టుకుని వలస పోతుంటే పట్టణాలు వారందరికీ కనీసావసరాలు చూపలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారత జనసాంద్రతలో వచ్చిన కీలకమార్పు ఇది.

➼ స్వాతంత్ర్యానికి పూర్వం సుమారు 90 శాతం ప్రజలు పల్లెల్లోనే ఉండేవారు. 1901 నాటి జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో నివసించే వారు 11.5 శాతం మంది మాత్రమే. జనాభా పెరిగి.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పేదలు పట్నం బాట పట్టారు. అలా క్రమేణా పెరిగిపోయిన పట్టణాల జనాభా 2021 నాటికి 35 శాతానికి ఎగబాకింది.

➼ పూర్వం తక్కువ జనాభా ఉండటంతో ఇళ్ల సమస్య పెద్దగా లేదు. కాలక్రమంలో జనాభా పెరగడంతో గృహాల సమస్య తలెత్తింది. ఇప్పటికీ అత్యధికంగా సొంతిళ్లు ఉన్నది గ్రామీణులకే. పట్టణాలు, నగరాల్లో ఆ భాగ్యం కొందరికే దక్కింది. మిగిలిన వారందరికీ అద్దె ఇళ్లే దిక్కు.

➼ ప్రస్తుత డిమాండ్‌ మేరకు ఏటా ప్రతి వెయ్యి మంది జనాభాకు అయిదు ఇళ్ల చొప్పున నిర్మించాలి. ప్రస్తుతం మూడే నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే కోటి ఇళ్లకు కొరత ఏర్పడింది. 2030 నాటికి ఈ లోటు 2.25 కోట్లకు చేరవచ్చని అంచనా.

... ఈ గణాంకాలు మన దేశంలోని గృహ నిర్మాణ రంగం పురోగతిని, భవిష్యత్తు లక్ష్యాలను చాటుతున్నాయి.

స్వాతంత్ర్యం... మనకు సంతోషంతోపాటు ఎన్నో సవాళ్లనూ మోసుకొచ్చింది. నాడు కడు పేదరికంతో అల్లాడుతున్న ప్రజలకు కూడు, గూడు, గుడ్డ కల్పించే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేశాయి. 'ప్రతి ఒక్కరికీ సొంతిల్లు' లక్ష్యంగా గత 75 ఏళ్లలో అనేక అడుగులు పడ్డాయి. ఎన్నెన్నో పథకాలు, విధానాలు, సంస్కరణలు అమలయ్యాయి. ప్రతిబంధకాలను అధిగమిస్తూ ఈ ఏడున్నర దశాబ్దాల్లో గృహనిర్మాణ రంగంలో దేశం గణనీయంగా పురోగమించింది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో గృహ నిర్మాణ రంగం ఎదిగిన తీరుతెన్ను, రానున్న 25 ఏళ్లలో అధిరోహించాల్సిన సోపానాలపై ప్రత్యేక కథనం.

గూడు కట్టిన పథకాలు
స్వాతంత్ర్యం వచ్చాక ఆహార సమస్యకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. దేశ విభజన అనంతరం అధిక సంఖ్యలో శరణార్థుల రాకతో ఇళ్ల కొరత ఏర్పడింది. దీంతో 1950లో కార్మికులు, బలహీనవర్గాల కోసం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణ పథకం (1954), మురికివాడల అభివృద్ధి పథకం (1956), మధ్య ఆదాయ వర్గాలకు గృహనిర్మాణ పథకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దె ఇళ్ల పథకం, గ్రామీణ గృహ నిర్మాణ ప్రాజెక్టు (1959), ఇందిరా ఆవాస్‌ యోజన (1985), వాల్మీకి అంబేడ్కర్‌ ఆవాస్‌ యోజన (1998), జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం (2005), రాజీవ్‌ ఆవాస్‌ యోజన (2013), ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (2015) వంటివి అమలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం 1988 తర్వాత తీసుకొచ్చిన కొన్ని విధానాలు గృహ నిర్మాణానికి ఊతమిచ్చాయి. 1988లో తొలిసారిగా జాతీయ గృహకల్పన విధానాన్ని కేంద్రం ప్రకటించింది. తర్వాత 1994లో దాన్ని సవరించారు. 1998లో నివాస, గృహకల్పన విధానాన్ని ఖరారు చేశారు. పట్టణ భూ పరిమితి, నియంత్రణ చట్టాన్ని (యూఎల్‌సీఆర్‌ఏ) రద్దు చేశారు. స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులకు అవకాశమిచ్చారు.

2007లో జాతీయ, పట్టణ గృహ, నివాస విధానాన్ని (ఎన్‌యూహెచ్‌హెచ్‌పీ) ప్రకటించారు. అందుబాటు ధరల్లో 'అందరికీ ఇల్లు' అనే లక్ష్య సాధన దిశగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఈ విధానం ప్రోత్సహించింది.

సొంతింటికి సహకారం
ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం గృహ నిర్మాణ సహకార సంస్థల్ని ఏర్పాటు చేసింది. 1969-70 మధ్య 16,308 ప్రాథమిక గృహ నిర్మాణ సహకార సంఘాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య పది లక్షలు దాటింది.

1970లో కేంద్ర ప్రభుత్వం హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) ఏర్పాటు చేసింది. 1977లో హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుతో గృహ నిర్మాణానికి ప్రైవేటు రంగంలో రుణాలు ఇవ్వటం మొదలైంది. 1988లో నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకును గృహ రుణాల కోసం ఏర్పాటు చేశారు. వీటితో అధికాదాయ (హెచ్‌ఐజీ), మధ్య ఆదాయ (ఎంఐజీ) వర్గాలు లబ్ధి పొందాయి.

గతి మార్చిన ఆర్థిక సంస్కరణలు
ఆర్థిక సంస్కరణలు (1991) అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు, ఆదాయాలు భారీగా పెరగటం, వాటి ఆధారంగా అనుబంధ వ్యాపారాలు వృద్ధి చెందటంతో నగరాలు, పట్టణాల్లో స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది. ప్రధానంగా ఐటీ రంగం వృద్ధి... ప్రైవేటు రంగంలో గృహ నిర్మాణం శరవేగంగా పెరగటానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి రుణాలిచ్చే ప్రైవేటు సంస్థలు పుట్టుకొచ్చాయి. రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు, సులభ వాయిదాల్లో చెల్లింపు వంటి అవకాశాలు.. సొంతిల్లు సమకూర్చుకునే వారి సంఖ్య పెరగటానికి దోహదపడ్డాయి.

స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి 'అందరికీ ఇల్లు' లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో నిపుణులు ఇచ్చిన సూచనలు ఇవీ..

ఇప్పటికే పల్లెల్లోని ప్రతి 10 మందిలో ఒకరు, పట్టణాల్లోని ప్రతి ఆరుగురిలో ఒకరు సరైన సౌకర్యాలు లేని ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దేశంలోని పట్టణాల జనాభా 2050 నాటికి 81.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పెరిగే జనాభాకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, పేదలకు మౌలిక సదుపాయాల కల్పన సవాల్‌ కానుంది. గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ పథకాలను మరింత సరళతరం చేసి.. అంతిమంగా ప్రజలు సొంత ఇంట్లో నివసించేందుకు అనువైనచర్యలు తీసుకోవాలి.

  • భూముల ధర అధికంగా ఉండటం, వాటి లభ్యత తక్కువగా ఉండటం, నిర్మాణ వ్యయం పెరగటం, పేదలకు గృహ రుణాలు అందుబాటులో లేకపోవడం వంటివి సమస్యలు కానున్నాయి. వీటిని అధిగమించాలి.
  • తక్కువ వ్యయంతో నాణ్యమైన నిర్మాణాలు అందుబాటులోకి రావాలి. గృహనిర్మాణ సామగ్రిపై పన్నుల భారం తగ్గించాలి.
  • పేదలు, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణాల కోసం వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి.
  • ఇళ్లు కట్టుకోడానికి ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండేలా సహకారాన్ని పెంపొందించాలి. రుణాల మంజూరును విస్తృతం చేయాలి. ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న మినహాయింపులనూ పెంచాలి.

ఇంజినీర్లు అందుబాటులో ఉన్నా మేస్త్రీల కొరత ఎక్కువగా ఉంది. క్షేత్రస్థాయిలో పని చేసే వారు తక్కువగా ఉన్నారు. ఉన్న వారిలోనూ సాంకేతిక నైపుణ్యం పెరగాల్సి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. నిర్మాణరంగానికి అవసరమైన కార్మికుల శిక్షణ కోసం ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలను పెంచి.. తదనుగుణమైన కోర్సులు ప్రవేశపెట్టాలి.

269 అనుబంధ పరిశ్రమలకు ఊతం
గృహ నిర్మాణ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పాటు అందిస్తోంది. దీని ఆధారంగా 269 రకాల అనుబంధ పరిశ్రమలు నడుస్తున్నాయి. తద్వారా ఉద్యోగిత పెరుగుతుంది. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగితను చూపుతున్నది గృహ నిర్మాణ రంగమే. విదేశీ నిధులు అత్యధికంగా తరలివస్తున్న వాటిలో ఈ రంగానిది మూడో స్థానం. నానాటికీ పురోగమిస్తున్న ఈ మార్కెట్‌ ఎంతో మందికి సొంత ఇళ్లను, మరెంతో మందికి ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.

నాణానికి మరోవైపు..
ఒకవైపు ఇళ్ల కొరత వేధిస్తుండగా పట్టణాలు, గ్రామాల్లో కలిపి దేశంలో 1.10 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రైవేటు ఇళ్లకు అధిక అద్దెలు, ప్రభుత్వం నిర్మించిన వాటిలో సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణం.

ABOUT THE AUTHOR

...view details