Ayodhya Ram Mandir BJP Campaign :2019 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 303 సీట్లు, 37.36 శాతం ఓట్లను ఈసారి ఎలాగైనా అధిగమించాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని భావిస్తోంది. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 22న జరగనుండగా దీన్ని 15 రోజుల పాటు ఓ వేడుకగా చేసుకోవాలని బీజేపీ ప్రణాళిక రచించింది. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు ఇందుకోసం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా దేవాలయాలను శుభ్రం చేయడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం నాడు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించేలా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయనున్నారు. దీపావళి తరహాలో 22వ తేదీ సాయంత్రం ప్రతి ఇంట్లో రామ జ్యోతులను వెలిగించాలని బీజేపీ కోరుతోంది. ఇదే విషయమై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
జనవరి 25 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా భక్తులు రామమందిరాన్ని సందర్శించేలా కార్యకర్తలు సహాయం చేయాలని, అందుకు తగ్గ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరింది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రోజూ 50 వేల మంది భక్తులు రామున్ని దర్శించుకుంటారని బీజేపీ అంచనా వేస్తోంది. ప్రయాణ, వసతి సౌకర్యాలు, ఇతర అంశాల్లో బీజేపీ కార్యకర్తలు భక్తులకు సాయం చేయనున్నారు. ఇందుకోసం RSS కార్యకర్తలతో బీజేపీ శ్రేణులు భుజం భుజం కలిసి నడుస్తాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాలను కార్యకర్తలు ఉపయోగించరాదని బీజేపీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది.