తెలంగాణ

telangana

ETV Bharat / opinion

యాంత్రీకరణతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగావకాశాలు! - యాంటీ బయోటిక్స్ రంగంలో ఉద్యోగాలు

2030 నాటికి దేశంలో పనిచేసే వయస్కుల జనాభా ప్రపంచంలోనే అత్యధికంగా 96కోట్లకు మించనుందని, వారిలో పట్టభద్రులు 31కోట్లని 'యునిసెఫ్‌' గత ఏడాది మదింపు వేసింది. కానీ, కరోనా కారణంగా 2025 నాటికి కోట్లాది ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారుతాయని ఓ తాజా నివేదిక అంచనావేస్తోంది.

AUTOMATION_CORONA
యాంత్రీకరణతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగావకాశాలు!

By

Published : Oct 23, 2020, 9:01 AM IST

కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా రోబో విప్లవం ముందుగానే వచ్చేసిందంటున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజా నివేదిక, 2025 సంవత్సరం నాటికి కోట్లాది ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారిపోతాయని భవిష్యద్దర్శనం చేస్తోంది. యాంత్రీకరణ (ఆటొమేషన్‌) ఊపందుకున్న పర్యవసానంగా కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు రూపాంతరం చెందడంతోపాటు పదికోట్ల వరకు సరికొత్త కొలువులూ పుట్టుకొస్తాయంటోంది.

గతిని మార్చనున్న 20 రంగాలు

కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ మూలాన అదృశ్యమయ్యే ఉపాధి అవకాశాలకన్నా నూతనంగా అవతరించేవే అధికమన్నది శుభ సమాచారమే అయినా, వాటిని రెండుచేతులా అందిపుచ్చుకొనే సన్నద్ధతే అత్యంత కీలకాంశం. ఆ మేరకు ప్రపంచ దేశాల ప్రణాళికలు పదును తేలాల్సి ఉందన్నది విశ్లేషణాత్మక నివేదిక అంతస్సారం! సమీప భవిష్యత్తులో ఉపగ్రహ సేవలు, విద్యుత్‌ వాహనాలు, వినూత్న యాంటీబయాటిక్స్‌, ఎడ్‌టెక్‌ తదితర ఇరవై రంగాలు ప్రపంచ గతినే మార్చేయనున్నాయంటున్న అధ్యయనం- ఉపాధి కల్పనకు సంబంధించి అవన్నీ బంగారు గనులేనని చెప్పకనే చెబుతోంది.

అలా విప్పారనున్న అవకాశాలు భారత్‌కు ఎంత మేర లబ్ధి చేకూర్చనున్నాయి? 2030 నాటికి దేశంలో పనిచేసే వయస్కుల జనాభా ప్రపంచంలోనే అత్యధికంగా 96కోట్లకు మించనుందని, వారిలో పట్టభద్రులు 31కోట్లదాకా ఉంటారని, ఉద్యోగార్జనకు అవసరమైన నైపుణ్యాలు కలిగినవారు మొత్తం అభ్యర్థుల్లో సగం మందేనని ‘యునిసెఫ్‌’ గత ఏడాది మదింపు వేసింది.

వారి సంఖ్య పెద్ద ఎత్తున!

ఉద్యోగార్హ నైపుణ్యాలు కొరవడినవారి సంఖ్య పెద్దయెత్తున ఉండనుందన్న అధ్యయనాలు, తక్షణ దిద్దుబాటు చర్యల అత్యావశ్యకతను చాటుతున్నాయి. ‘నాణ్యమైన చదువు విద్యార్థి హక్కు’ అని నూతన జాతీయ విద్యావిధానం అభివర్ణించడం వినసొంపుగా ఉన్నా- మానవ వనరుల శక్తియుక్తులు దేశానికి గరిష్ఠంగా ఉపకరించడానికి దోహదపడే విస్తృత కార్యాచరణ ప్రభుత్వాల ప్రధాన అజెండాగా తేజరిల్లాల్సి ఉంది!

స్కిల్​ ఇండియా?

పదకొండేళ్ల క్రితం మొగ్గతొడిగిన జాతీయ నైపుణ్యాభివృద్ధి వ్యూహం స్థానే- 2022నాటికి 40కోట్లమందిని నిపుణశక్తులుగా తీర్చిదిద్దాలన్న ‘స్కిల్‌ ఇండియా’ విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఆవిష్కరించింది. ‘కౌశల్‌ వికాస్‌ యోజన’ తొలిదశలో శిక్షణ పొందినవారిలో 13.23శాతం, 2016-2019మధ్య 24.17శాతమే జీవనోపాధి పొందగలిగారని ఆమధ్య కేంద్రమే వెల్లడించింది. శిక్షణ పొందిన మొత్తం 72లక్షలమందిలో సుమారు 15లక్షల మందే ఉపాధిలో కుదురుకోగలిగారంటే, నైపుణ్య భారత్‌ లక్ష్యాలు దారుణంగా గురితప్పినట్లు స్పష్టమవుతూనే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తత

అమెరికాకు చెందిన రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటొమేషన్‌ (ఆర్‌పీఏ) సాఫ్ట్‌వేర్‌ సంస్థతో వచ్చే ఏడాది 80వేలమంది వరకు విద్యార్థుల ప్రతిభకు మెరుగులద్దడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఇటీవలే ఒడంబడిక కుదుర్చుకున్నాయి. లక్షమంది యువతీ యువకులకు డిజిటల్‌ మెలకువలు నేర్పడానికి మైక్రోసాఫ్ట్‌, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేతులు కలిపాయి.

15-24ఏళ్లమధ్య వయసు కలిగిన యువత దేశ జనాభాలో మూడోవంతుకు పైబడిన ఇండియాలో, వారిని భావి భారత భాగ్య విధాతలుగా మలచడానికి అనుసరణీయ యోజన కాదిది! వచ్చే అయిదు, పదేళ్లలో ఏయే పరిశ్రమలూ రంగాల్లో ఎన్నెన్ని నిపుణ మానవ వనరులు ఆవశ్యకమో ఎప్పటికప్పుడు మదింపు వేసే ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పి, ఆ సిఫార్సుల ప్రాతిపదికన తగిన కోర్సులు రూపొందించాలి.

మాధ్యమిక స్థాయిదాకా భాష, గణితం, విజ్ఞానశాస్త్రాల్లో మౌలికాంశాలు, నైతిక విద్యాబోధనకు పరిమితమై- కళాశాల దశలో సొంతకాళ్లపై నిలబెట్టే చదువులకే ప్రాధాన్యమివ్వాలి. సరైన అర్హతలు కలిగిన నిపుణ శ్రామికులు అందుబాట్లో లేరని పలు సంస్థలు మొత్తుకుంటుండగా, చిన్నాచితకా ఉద్యోగాలకూ స్నాతకోత్తర పట్టభద్రులూ డాక్టరేట్లు బారులు తీరే దురవస్థను చెల్లాచెదురు చేయగల పటుతర వ్యూహమిది. విద్యకు ఉపాధితో అనుసంధానం కుదిరితేనే, బహుముఖాభివృద్ధిలో దేశం ముందంజ వేయగలుగుతుంది!

ఇదీ చదవండి:ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పార్లమెంటరీ కమిటీ సమన్లు

ABOUT THE AUTHOR

...view details