అసోం-మిజోరం రాష్ట్రాలమధ్య సరిహద్దుల వివాదం చినికి చినికి గాలివాన అయిన చందంగా, ఏడుగురు పోలీసుల మృతికి దారితీయడం దేశ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతపరచింది. ఇరు రాష్ట్రప్రభుత్వాలూ అధికార శ్రేణులపై పరస్పరం కేసులు బనాయించుకున్న క్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేరు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)లోకి ఎక్కింది. అంతగా ప్రజ్వరిల్లిన విభేదాల ఉపశమనానికి కేంద్ర యత్నం కొంతవరకు ఫలించినట్లే కనిపిస్తోంది. చర్చల ద్వారానే సరిహద్దు వివాదాలు ఒక కొలిక్కి వస్తాయని హిమంత శర్మ తాజాగా 'ట్వీట్' చేయగా- కేంద్రం జోక్యంతోనే సామరస్యపూర్వక పరిష్కారం లభించగలదని మిజోరం ముఖ్యమంత్రి జొరాం థాంగా విశ్వాసం వ్యక్తీకరిస్తున్నారు. గత అయిదేళ్లలో అక్కడ రెండువందల ఘర్షణలు జరిగి 40 కేసులు నమోదైనా ఉద్రిక్తతల ఉపశమనానికి గట్టి యత్నమన్నది కొరవడటంవల్లే కక్షలూ కార్పణ్యాలు ఇంతగా ప్రబలాయన్నది సుస్పష్టం.
రోగమొకటి.. మందొకటి..
వాస్తవానికి సమస్య మూలాలు ఆంగ్లేయుల జమానాలో ఉన్నప్పటికీ, నాలుగైదేళ్లుగానే విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. వివాదాస్పద అటవీ ప్రాంతంలోకి మిజోవాసుల్ని రానివ్వడం లేదన్నది జొరాం థాంగా ప్రధాన ఆరోపణ. రిజర్వ్ అటవీ భూముల్ని మిజోవాసులు ఆక్రమించారన్నది అసోం ప్రతివాదన. రెండు రాష్ట్రాలకూ ఆమోదయోగ్య పరిష్కారం కోసం పక్షం రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్న హిమంత శర్మకు గుర్తుందో లేదో- అస్సాముతో నాగాలాండ్, అరుణాచల్ సరిహద్దు వివాదాలు ఇప్పటికే 'సుప్రీం' తీర్పు కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నాయి. లోగడ ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు వివాదం తలెత్తినప్పుడు 21 గ్రామాలపై హక్కుల్ని తనకు దఖలుపరచాలన్న ఒడిశా అభ్యర్థనపై పదిహేనేళ్ల క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దాని ప్రకారం, రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు 'సుప్రీం' పరిధిలోకి రావు. అందువల్ల అస్సాం-మిజోరం రాష్ట్రాలమధ్య ఘర్షణలకు కారణమైన అంశాలను మరికొన్నేళ్లపాటు మురగబెట్టకుండా సత్వర పరిష్కార సాధనపై కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టడం సముచితం, విజ్ఞతాయుతం.