తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ముదిరిన సరిహద్దు వివాదం- హద్దు మీరితే సంక్షోభమే! - అసోం సరిహద్దు వివాదం

అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు దేశ సమాఖ్య తత్వాన్ని దెబ్బతీసేలా మారుతున్నాయి. గత నెల 26వ తేదీన మిజోరం పోలీసులు అసోం అధికారులపై కాల్పులు జరపడంతో పరిస్థితి దిగజారింది. ఈ ఘటన తర్వాత ఆ రాష్ట్రానికి వెళ్లవద్దని అసోం ప్రభుత్వం ప్రజలకు సూచించడంతో వివాదం ముదిరింది.

assam, mizoram
అసోం, మిజోరాం

By

Published : Aug 7, 2021, 6:52 AM IST

అసోం, మిజోరాం మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగి చర్యలు చేపట్టిన దరిమిలా- సరిహద్దు వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకొంటామని ఇరు రాష్ట్రాలు సంయుక్త ప్రకటన జారీ చేశాయి. తాజాగా అసోం ప్రభుత్వం ప్రజలకు చేసిన సూచనను రద్దుచేసింది.

మిజోరం పౌరుల్లో అసంతృప్తి

ఈశాన్య రాష్ట్రాల్లో పర్వతాలు ఎక్కువగా ఉండటంతో భూమిని సాగుకు సిద్ధం చేయడం కష్టమైన పని. దీంతో మైదాన ప్రాంతాలకు గిరాకీ ఎక్కువ. గతంలో ఆంగ్లేయులు టీ తోటల కోసం నిర్ణయించిన సరిహద్దులనే కొనసాగించడం అసోం-మిజోరం మధ్య వివాదానికి కారణమైంది. 1933లో మణిపూర్‌, బరాక్‌లోయ (అస్సాం), లుషాయ్‌ హిల్స్‌ (నేటి మిజోరం) సరిహద్దులను నిర్ధారించారు. ఈ సమయంలో బ్రిటిష్‌ పాలకులు మిజో తెగల అభిప్రాయం తెలుసుకోలేదు. మైదాన ప్రాంతం అసోంలోకి వెళ్ళిపోగా- పర్వత ప్రాంతాలు మిజోలకు మిగిలాయి. ఆ అసంతృప్తి వారిలో బలంగా ఉండిపోయింది. వాస్తవానికి అవిభాజ్య అసోం ప్రభుత్వం లుషాయ్‌ హిల్స్‌ సరిహద్దులను నిర్ధారించేందుకు 1950ల్లో సర్వే మొదలుపెట్టింది. కానీ, సర్వే విభాగ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టడంతో ఈ ప్రయత్నం నిలిచిపోయింది. మిజోరం రాష్ట్ర ఏర్పాటుకు 1933 నాటి సరిహద్దులనే ఆధారంగా చేసుకోవడం స్థానికంగా మరింత చిచ్చు రగిల్చింది. తమ ప్రజలకు వందేళ్లుగా అనుబంధం ఉన్న ప్రాంతాన్ని మిజోరం సరిహద్దుగా భావిస్తుంటే, అస్సాం మ్యాప్‌లో ఉన్న సరిహద్దును పరిగణనలోకి తీసుకొంటోంది. ఈ వివాదం 2016 నుంచి తీవ్రరూపం ధరించడం మొదలైంది. ఈ అయిదేళ్లలో దాదాపు 200 ఘర్షణలు చోటుచేసుకొని, 40 కేసులు నమోదయ్యాయి. 2008, 2018, 2020, 2021 సంవత్సరాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

మరో వివాదం..

ఇటీవల రిజర్వు అటవీ భూముల విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. దీంతో ఈశాన్య రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు హోంశాఖ మంత్రి అమిత్‌ షా షిల్లాంగ్‌ చేరుకొని చర్చలు జరిపారు. ఈ పర్యటన ముగిసిన 48 గంటల్లోనే లైలాపూర్‌, వైరెంగ్తే మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఇరు రాష్ట్రాల నేతలు, అధికారుల బాధ్యతారాహిత్యంతో ఈ వివాదం మరింత ముదిరింది. కాల్పుల ఘటనకు ముందే మిజోరంలోని ఐజీ స్థాయి అధికారి ఒకరు తుపాకులు వాడతామని హెచ్చరించడం గమనార్హం. ఘటన తరవాత సైతం ఆ రాష్ట్ర ఎంపీ వన్‌లాల్‌వెనా 'ఈసారి అందర్నీ కాలుస్తాం' అంటూ బెదిరించారు. రోహింగ్యాల శిబిరాల కోసం అసోం ప్రభుత్వం తమ ప్రజలను అటవీ ప్రాంతంలోకి రానివ్వడం లేదని మిజోరం ముఖ్యమంత్రి జోరాంథాంగా భావిస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి సహా 200 మందిపై మిజోరంలో తొలుత వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం 'ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోం' అంటూ సమస్యను సంక్లిష్టం చేసే ప్రకటనలు చేశారు. 306 నంబరు జాతీయ రహదారి అప్రకటిత మూసివేతతో మిజోరం అవస్థలు పడుతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌డీఏకు కీలకమైన 'నార్త్‌ఈస్ట్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌(నెడ)'లో భాజపా, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ భాగస్వాములు. కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగి ఇరువర్గాలపై ఒత్తిడి తేవడంతో పరస్పరం కేసుల ఉపసంహరణకు అంగీకరించారు. తాజాగా ఐజ్వాల్‌ క్లబ్‌లో ఇరు రాష్ట్రాల ప్రతినిధుల భేటీ జరిగింది. అసోం వైపు కరీంగంజ్‌, హాయిలాకండి, కాచార్‌, మిజోరం వైపు మమిత్‌, కొలాసిబ్‌ జిల్లాల సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో కేంద్ర దళాల మోహరింపునకు అంగీకరించారు. కాల్పుల ఘటనలో మరణించిన అసోం పోలీసులకు మిజోరం సంతాపం తెలియజేయడం ప్రజల మధ్య ఉద్రిక్తతలను కొంత తగ్గించే చర్య.

అస్సామ్‌లోనే అత్యధిక వివాదాలు

దేశంలో అత్యధిక సరిహద్దు వివాదాలు ఉన్న రాష్ట్రం అస్సాం. కేంద్రం ప్రకటించిన ఏడు వివాదాల్లో నాలుగు ఇక్కడే ఉన్నాయి. అస్సామ్‌లోని గువాహటి, మేఘాలయలోని రి-బోయ్‌ జిల్లాల మధ్య వివాదం కొనసాగుతోంది. అసోంలోని గోలాఘాట్‌, నాగాలాండ్‌లోని వోఖా జిల్లాల మధ్య వివాదంలో ఎందరో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌తో అస్సాం 804 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటోంది. అక్కడా స్థానికుల మధ్య చెదురుమదురు ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. వీటిని అస్సామ్‌తో చర్చించి పరిష్కరించుకొంటామని ఇటీవల అరుణాచల్‌ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ వెల్లడించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు శాంతిభద్రతల సమస్యగా మారితే ఈశాన్య రాష్ట్రాలకు రావాల్సిన పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనాకు భయపడి అరుణాచల్‌ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు ముందుకు రావడంలేదు. మయన్మార్‌లో భారత్‌ చేపట్టిన కళాదాన్‌ ప్రాజెక్టు ఫలాలు అస్సామ్‌కు చేరాలంటే మిజోరంతో సఖ్యత చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు పట్టువిడుపు ధోరణితో వ్యవహరిస్తేనే సమస్యకు పరిష్కారం సాధ్యపడుతుంది.

- ఫణికిరణ్‌

ఇదీ చదవండి:సినిమా సీన్​ను తలపించిన యాక్సిడెంట్​- 22 మంది సేఫ్​

ABOUT THE AUTHOR

...view details