తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నిర్మలమ్మ బడ్జెట్..​ పారిశ్రామిక రంగానికి ఊతమందించేనా..? ఆర్థిక వృద్ధికి చుక్కాని అవుతుందా? - 2023 బడ్జెట్​లో కీలకాంశాలు న్యూస్

అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితులు ముప్పిరిగొంటుంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగానే ఉంది. అయితే, ఎగుమతుల్లో తగ్గుదల, నిరుద్యోగం వంటివి దేశీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై దృష్టి సారిస్తూ, ఆర్థిక వృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా రాబోయే కేంద్ర బడ్జెట్లో సరైన చర్యలు తీసుకోవాలి.

2023 Central budget latest news
బడ్జెట్

By

Published : Jan 28, 2023, 9:13 AM IST

గత రెండు కేంద్ర బడ్జెట్లను కొవిడ్‌ తెచ్చిపెట్టిన అసాధారణ పరిస్థితుల మధ్య ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి వీలుగా వాటిలో పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. 2020-21లో అధిక స్థాయిలో నమోదైన ద్రవ్యలోటు ఈ రెండేళ్లలో దిగివచ్చింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం సంతోషించదగ్గ విషయం. అయితే, నానాటికీ తెగ్గోసుకుపోతున్న ఇండియా ఎగుమతులు, పెరుగుతున్న కరెంటు ఖాతా లోటు, పడిపోయిన విదేశీ పెట్టుబడులు, నిరుద్యోగిత, రూపాయి పతనం వంటివన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పొంచి ఉన్న మాంద్యం ముప్పు కలవరపెడుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిచ్చేలా రాబోయే కేంద్ర బడ్జెట్‌ను సమర్థంగా తీర్చిదిద్దడం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కత్తిమీద సామే.

ఇన్నాళ్లూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సేవారంగం ఎంతగానో తోడ్పడింది. ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తరవాత సేవారంగానికి దీటుగా పారిశ్రామిక రంగాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో భారత్‌లో తయారీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. దానికి తోడు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం, ఆత్మ నిర్భర్‌ భారత్‌, కొత్త పరిశ్రమలకు పన్ను రాయితీల ప్రకటన వంటివాటితో పారిశ్రామిక రంగానికి ఊతం ఇవ్వదలచింది. మరోవైపు జీడీపీలో మూడో వంతు ఆక్రమించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) ఏటా బడ్జెట్‌ సమయంలో పలు రాయితీలు, పథకాలు ప్రకటిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో వృద్ధి జోరందుకోవాలంటే దేశీయంగా శ్రామిక శక్తిలో మహిళల వాటాను పెంచాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకొంటూ, నిపుణ కార్మికులను తీర్చిదిద్దుకోవడం అత్యవసరం.

రాబోయే కేంద్ర బడ్జెట్లో పన్నుల విధానంపైనా సరైన దృష్టి సారించాలి. ఒకవైపు దేశీయంగా ఏటా పన్నుల వాటా పెరుగుతోంది. దేశ జీడీపీలో మాత్రం అది ఉండాల్సిన 15శాతం కన్నా తక్కువగానే కనిపిస్తోంది. పన్నుల వాటా 2018-19లో 11శాతం నుంచి 2019-20లో 9.9శాతానికి దిగజారింది. మన పన్నుల వాటా ప్రపంచ వర్ధమాన దేశాల సగటు అయిన 21శాతం, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాల సగటు అయిన 34శాతం కన్నా తక్కువ. ప్రతీసారి నిజాయతీగా పన్నులు చెల్లించే వారి నుంచే ఆదాయం పిండుకుంటుండటం సరికాదు. నల్ల విపణిలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు, కృత్రిమ కొరత సృష్టించి సరకులను దాచిపెట్టేవారు. కమిషన్‌ ఏజెంట్లు, స్థిరాస్తి వ్యాపారులు, ఇన్వాయిస్‌ తక్కువగా చూపించే వర్తకులు తదితర పన్ను ఎగవేతదారులపై పటిష్ఠ నిఘా పెట్టాలి. ఇండియా మొత్తం పన్ను ఆదాయంలో అత్యల్ప వాటా కలిగిన వేతన జీవులను ట్యాక్స్‌ల నుంచి మినహాయించాలి. లేదంటే వారికి చెల్లిస్తున్న ఉద్యోగ విరమణ ఫలాలపై పన్నులు తొలగించాలి.
పొగాకు ఉత్పత్తుల అక్రమ వ్యాపారం, ఆల్కహాల్‌ విక్రయాల్లోనే ఏటా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా పన్ను ఆదాయాన్ని భారత్‌ కోల్పోతున్నట్లు ఫిక్కీ నివేదిక వెల్లడిస్తోంది. చట్టాల్లో ఉన్న లోపాలË ఆధారంగా బహుళ జాతి సంస్థలు ఏటా వేల కోట్ల రూపాయల పన్నులను ఎగ్గొడుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. దేశీయంగా జీఎస్‌టీ ఎగవేత సైతం పలురకాలుగా జరుగుతోంది. రాబోయే ఇరవై అయిదు సంవత్సరాలను దేశానికి అమృత కాలంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ కాలంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆశిస్తున్నారు. అందుకోసం దేశీయంగా మౌలిక వసతుల కల్పనపై అధికంగా వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఆయా లొసుగుల ఆధారంగా వివిధ మార్గాల్లో చేజారిపోతున్న పన్ను ఆదాయాలను రాబట్టి కేంద్రం మౌలిక వసతులను పటిష్ఠం చేయాలి. ముఖ్యంగా జీ20కి భారత్‌ నాయకత్వం వహిస్తున్నందువల్ల ఈ లోపాలకు సాధ్యమైనంత మేర అడ్డుకట్ట వేయడానికి మంచి అవకాశం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details