తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2020, 7:03 AM IST

ETV Bharat / opinion

ఉచిత న్యాయసేవలతో సముచిత సాయం

'న్యాయసేవల చట్టం' అమల్లోకి వచ్చి నేటికి పాతికేళ్లు. 1995 నవంబరు 9న ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీని నాటి సీజేఐ జస్టిస్‌ ఎ.ఎస్‌.ఆనంద్‌ ‘న్యాయ సేవల దినోత్సవం’గా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చట్టం కింద ఏర్పాటైన న్యాయసేవాధికార సంస్థలు నిరంతరం ఉచిత సేవలందిస్తూ ఆపన్నులకు అండగా ఉంటున్నాయి. ఈ చట్టం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది.

legal services
న్యాయసేవల చట్టం

భారత రాజ్యాంగంలోని అధికరణ 39-ఏ ప్రకారం ఆర్థిక స్థితిగతులతో సంబంధంలేకుండా ప్రజలందరికీ న్యాయ సాయం అందించాలి. రాజ్యాంగ లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన న్యాయసేవల (లీగల్‌ సర్వీసెస్‌) చట్టం అమల్లోకి వచ్చి నేటికి పాతికేళ్లు. 1995 నవంబరు 9న న్యాయసేవల చట్టం అమల్లోకి వచ్చిన తేదీని నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఎస్‌.ఆనంద్‌ ‘న్యాయ సేవల దినోత్సవం’గా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చట్టం కింద ఏర్పాటైన న్యాయసేవాధికార సంస్థలు నిరంతరం ఉచిత సేవలందిస్తూ ఆపన్నులకు అండగా ఉంటున్నాయి. ఈ చట్టం పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లున్నా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది.

ప్రభుత్వం వివిధ న్యాయసేవా పథకాలకు సంబంధించి 1960లోనే మార్గదర్శకాలు రూపొందించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయ బోర్డులు, సొసైటీల తోడ్పాటుతో ఉచిత సేవలందిస్తూ వచ్చాయి. ఉచిత సేవా పథకాల కోసం 1980లో జస్టిస్‌ పి.ఎన్‌.భగవతి నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి అనంతరం 1987లో లీగల్‌ సర్వీసెస్‌ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. చట్టం వచ్చినప్పటికీ దాన్ని అమల్లోకి తీసుకురావడానికి మరో ఎనిమిదేళ్లు పట్టింది. 1995 నవంబరు 9న చట్టం అమల్లోకి రాగా- ఆ ప్రకారం అదే ఏడాది డిసెంబరులో జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటైంది.

అనంతరం అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అన్వయించుకుని రాష్ట్రస్థాయిలో న్యాయసేవాధికార సంస్థలను ఏర్పాటు చేశాయి. సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించుకోవడానికి ఇవి సహకరిస్తాయి. పేదలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా న్యాయ సేవలందిస్తాయి. మహిళలు, పిల్లలు, మానవ అక్రమ రవాణా బాధితులు, వికలాంగులు, విపత్తులు, ఘర్షణలు, యుద్ధాల బారినపడినవారికి జిల్లా స్థాయిలోని న్యాయ సేవా సంస్థలు అండగా నిలుస్తాయి. ఇలాంటివారి తరఫున వాదించడంకోసం ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడంతోపాటు- కోర్టు ఫీజులనూ ఇవి చెల్లిస్తాయి.

కోర్టులపై భారం తగ్గిస్తూ...

న్యాయసేవల చట్టం కింద ఏర్పాటైన ఈ సంస్థలు కోర్టులపై భారం తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.57 కోట్లు కేసులు పెండింగ్‌లో ఉండగా- ఇందులో సివిల్‌ కేసులు 97.61 లక్షలు, క్రిమినల్‌ కేసులు 2.59 కోట్లు! 10 ఏళ్లకు పైబడిన కేసులు 49.84 లక్షలుండగా, 30 ఏళ్లు దాటినవి 87 వేలకు పైగా కేసులున్నాయంటే న్యాయం ఏమేరకు సత్వరంగా అందుతుందో అర్థం చేసుకోవచ్చు. వివాదాల పరిష్కారానికి కోర్టులే అంతిమం కాదని, ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్న విషయంపై న్యాయసేవాధికార సంస్థలు చైతన్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. లోక్‌అదాలత్‌లు, మధ్యవర్తిత్వం, రాజీ, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార (ఏడీఆర్‌) వంటి మార్గాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇందులో భాగంగా లోక్‌అదాలత్‌లు నిర్వహించడంతోపాటు ‘మీడియేషన్‌’ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతోపాటు ప్రాథమిక దశలో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంకులు, బీమా, రోడ్డు ప్రమాదాలు, దాంపత్య వివాదాలు వంటి కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించడం ద్వారా ఆమేరకు కోర్టులపై భారం తగ్గుతోంది. న్యాయసేవాధికార సంస్థలు నిర్వహిస్తున్న లోక్‌అదాలత్‌లలో సివిల్‌ కేసులతో పాటు జరిమానా విధించదగ్గ క్రిమినల్‌ కేసులనూ పరిష్కరిస్తున్నారు. లోక్‌అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులకు అప్పీలుకు అవకాశం లేదు.

లోక్‌అదాలత్‌లతో మంచి ఫలితాలు వస్తుండటంతో 2016 నుంచి జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమాన్ని జాతీయ న్యాయసేవాధికార సంస్థ ప్రారంభించింది. ప్రతి నెలా ఒక శనివారం దేశవ్యాప్తంగా లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనాకు ముందు ఫిబ్రవరి 8న జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా 11.99 లక్షల కేసులను పరిష్కరించారు. రూ.3,846 కోట్ల పరిహారంగా అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 507 లోక్‌అదాలత్‌లు నిర్వహించి 22,483 కేసులను పరిష్కరించింది. తెలంగాణలో 15,468 కేసులు పరిష్కారమయ్యాయి. లోక్‌అదాలత్‌లతో సత్ఫలితాలు వస్తుండటంతో శాశ్వత లోక్‌అదాలత్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 2019 మార్చి నుంచి 2020 మార్చి వరకు 1.10 లక్షల కేసులు పరిష్కారమాయ్యయి. ఆంధ్రప్రదేశ్‌లో 1608, తెలంగాణలో 3,546 కేసులు పరిష్కారమయ్యాయి. 2014 జూన్‌ నుంచి 2020 వరకు ఒక్క తెలంగాణలోనే 4.12 లక్షల కేసులు లోక్‌అదాలత్‌ల ద్వారా పరిష్కారమయ్యాయి.

చట్టబద్ధ తోడ్పాటు

గ్రామాల్లో ప్రాథమిక వైద్య అవసరాలకు క్లినిక్‌లున్నట్లే న్యాయసేవలందించడానికి ‘లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌’లను న్యాయసేవాధికార సంస్థలు ఏర్పాటు చేశాయి. అక్కడ ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చు. దేశవ్యాప్తంగా 2020లో 475 లీగల్‌ క్లినిక్‌లుండగా 30 వేల మంది న్యాయసేవలు పొందారు. తెలంగాణలో 28, ఏపీలో 42 క్లినిక్‌లున్నాయి. ఆపన్నులను ఆదుకోవడానికి న్యాయసేవాధికార సంస్థ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వరదలు, అగ్నిప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల వంటి విపత్తుల్లో సంభవించే నష్టాలను భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండగా అవి అమలుకావడంలేదు.

న్యాయసేవల చట్టంలోని సెక్షన్‌ 12(ఇ) కింద బాధితులు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చు. బాధితులకు బీమాతో సహా అన్ని రకాల సాయం అందించడానికి న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుంది. బాధితులకు తోడ్పాటుగా నిలిచి వారికి చట్టప్రకారం దక్కాల్సిన సాయం అందించడానికి పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా అక్రమ మానవ రవాణాతో వ్యభిచార కూపంలో కూరుకుపోయిన మహిళలను ఆదుకోవడానికి, అసంఘటిత కార్మికులకు, బాలల హక్కుల రక్షణకు, మానసిక అంగవైకల్య, మాదకద్రవ్య వాడకందారులు, వృద్ధులు, యాసిడ్‌ దాడుల బాధితుల నిమిత్తం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చింది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల అమలుకు ఇవి అండగా నిలుస్తున్నాయి.

2010 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా 12,423 మంది బాధితులకు రూ.215.31 కోట్ల పరిహారాన్ని అందజేసింది. ‘టెలీ లీగల్‌ ఎయిడ్‌’ పథకాలను సైతం కొన్ని రాష్ట్రాలు మొదలుపెట్టాయి. ఫోన్‌లో సమస్యను వివరించి న్యాయ సలహాలు పొందడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను వినియోగించుకుని న్యాయసేవలను అందించడానికి ఇవి కృషి చేస్తున్నాయి. కొవిడ్‌ తీవ్రత నేపథ్యంలో గత మార్చి నుంచి లోక్‌అదాలత్‌ కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ‘వీడియో కాన్ఫరెన్స్‌’ ద్వారా ఈనెల 7న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో లోక్‌అదాలత్‌లు నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీలో ఒక్క రోజే 4,174 కేసులు, తెలంగాణలో 5,469 కేసులు పరిష్కారమయ్యాయి. 1987లో న్యాయసేవల చట్టం రూపొందించేనాటికి ఉన్న చట్టాలు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎన్నో కొత్త చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. ఈ చట్టాలకు అనుగుణంగా న్యాయసేవలందించేలా న్యాయసేవాధికార సంస్థలు చొరవ తీసుకుంటే సామాన్యులకు సత్వర న్యాయం అందడానికి అవకాశం ఉంది.

(రచయిత- దండు నారాయణరెడ్డి)

ABOUT THE AUTHOR

...view details