తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'అలా చేస్తే వ్యవసాయం కార్పొరేట్​పరమే!'

రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదన సమంజసమేనా? విధాన పరంగా ఆలోచిస్తే ఈ ప్రతిపాదన వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏంటి? వీటి వల్ల రైతులకు మేలు జరగడానికి బదులు.. వ్యవసాయ రంగం కార్పొరేట్​ చేతుల్లోకి వెళ్లిపోతుందా? భారత్​లోని మార్కెట్​ను మరో ఈస్టిండియా కంపెనీ వశపర్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

agriculture
'కార్పొరేట్ సంస్థలపై వ్యవసాయం ఆధారపడాల్సి వస్తుంది'

By

Published : May 25, 2020, 4:27 PM IST

'అన్ని రంగాలూ తమ ఉత్పత్తులను దేశమంతటా అమ్ముకుంటున్నప్పుడు, రైతులను మాత్రం ఎందుకు అనుమతించకూడదు? అందుకే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎం​సీ) చట్టాన్ని సవరిస్తాం.'

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

ఆత్మనిర్భర భారత్​ యోజన కింద రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో భాగంగా విత్త మంత్రి చేసిన వ్యాఖ్యలివి. ఈ ప్రతిపాదన సమంజసమేనా? అనే ప్రశ్నకు సవివర సమాధానం కావాలంటే మనం భారత రాజ్యాంగానికి పునాదులు పడిన కాలానికి వెళ్లాలి.

ఆంగ్లేయులతో ఆరంభం

దాదాపు 350 సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ అరాచకత్వాన్ని, దోపిడీని అప్పటి రైతులు అనుభవించారు. ప్రపంచంలోనే తొలి వ్యవసాయ బహుళ జాతి సంస్థగా పేరుగాంచిన ఈస్టిండియా కంపెనీ వల్ల భారతదేశంలోని కర్షకుల పరిస్థితి బానిసల స్థాయికి దిగజారిపోయింది. తమ ఉనికిని కాపాడుకోవడానికి బ్రిటన్ ప్రధాని విలియం చర్చిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల బంగాల్​ తీవ్రమైన కరవు బారిన పడింది. దేశంలోని మిగిలిన రైతుల పరిస్థితీ దౌర్భాగ్యంగా మారింది.

ఈస్టిండియా కంపెనీతో పాటు వ్యవసాయ రంగ సంస్థల దోపిడీలను దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగ సృష్టికర్తలు పంటపొలాలపై పూర్తి అధికారాలను రాష్ట్రాలకే కట్టబెట్టారు. రాజ్యాంగంలో వ్యవసాయాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చారు. ఏడో షెడ్యూల్(ఆర్టికల్ 246) 14వ ఎంట్రీలోని వ్యవసాయం, 'మార్కెట్ అండ్ ఫెయిర్స్​'ను జాబితాలోని 28వ ఎంట్రీలో పొందుపరిచారు.

వ్యవసాయ అనుకూల పరిస్థితులు, ప్రాంతాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. సామాజిక ఆర్థిక పద్ధతుల ఆధారంగా వ్యవసాయ విధానాలు రూపొందుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ అనేది విధానపరమైన తప్పిదమే కాక, నిరంకుశం కూడా.

ఏపీఎంసీ

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) చట్టం ప్రకారం దేశంలోని ఏమూలనో ఉన్న రైతులకు కూడా తమ ఉత్పత్తులు విక్రయించుకోవడానికి సమాన అవకాశాలు లభిస్తాయి. అటు వ్యాపారికీ, ఇటు రైతులకూ అన్యాయం జరగకుండా ఈ చట్టం ఉపయోగపడుతోంది. దీని ద్వారా ఉత్పత్తుల నాణ్యత పరిశీలించడానికి రిటైలర్లు, ట్రేడర్లకూ అవకాశం లభిస్తుంది.

దేశవ్యాప్తం చేస్తే..

రైతులు, వ్యాపారులతో పాటు స్థానిక ప్రతినిధుల ద్వారా ఏపీఎంసీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. కానీ ఈ విధానంలోని లోటుపాట్ల వల్ల ఒక్కోసారి వ్యాపారుల ఒత్తిళ్లకు తలొగ్గి రైతులు ఉత్పత్తులను విక్రయించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి లోపాలును సరిదిద్దడానికి శాసనకర్తలు ఏపీఎంసీను అంతర్​ రాష్ట్రాలకు విస్తరించారు.

ప్రతీ ఒక్క రైతుకు కనీస మద్దతు ధర లభించేలా చట్టంలో మార్పులు చేశారు. అయితే వ్యవసాయ మార్కెట్లు లేకుండా రైతులకు కనీస మద్దతు ధర అందించడం దాదాపు అసాధ్యమే. రైతులకు ప్రైవేటు రంగం మద్దతు ధరలు కల్పిస్తాయన్న నమ్మకం ఇప్పటికీ కలగడం లేదు.

కార్పొరేట్​ కేంద్రీకృతం

ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వల్ల అమెరికాలోని కార్గిల్, లూయిస్ డ్రెఫ్యూస్ వంటి వ్యవసాయ సంబంధిత వ్యాపార సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు సమున్నత స్థితికి చేరాయి. వ్యవసాయ సహకార సంఘాలు ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమయ్యాయి. అమెరికాలోని మార్కెట్ శక్తులన్నీ కలిసి వ్యవసాయ బానిసత్వంలో కొత్త శకానికి తెరతీశాయి. ఫలితంగా అమెరికాలో 2020నాటికి వ్యవసాయ రంగ రుణాలు 425 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచంలోని ధాన్యం సరఫరాలో 70 శాతం కేవలం నాలుగు కంపెనీల చేతిల్లో కేంద్రీకృతమైంది.

బిహార్​లోనూ...

2006లో బిహార్ ఎపీఎంసీ చట్టాన్ని ఉపసంహరించుకుంది. సరఫరా గొలుసులు, వ్యవసాయ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రైవేటు రంగాన్ని రాష్ట్రంలోకి ఆహ్వానించడానికి ఈ చట్టాన్ని రద్దు చేసింది. కానీ ఫలితం మాత్రం పూర్తి ప్రతికూలంగా వచ్చింది.

అగ్రి-బిజినెస్​ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోగా.. తిరిగి రైతుల పాలిట శాపంగా మారాయి. ఏపీఎంసీ చట్టం లేకపోవడం వల్ల అతి తక్కువ ధరలకే ఉత్పత్తులు కొనుగోలు చేశారు. వాటిని పంజాబ్, హరియాణాలోని మండీలలో అమ్ముతూ సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఈ అక్రమ వ్యాపారం, చట్టబద్ధంగా మారింది. రైతులు మరింత నిరాశకు గురవుతున్నారు.

50 వేలకు ఏడు వేలే

నిజానికి భారత్​లో 50 వేల వరకు వ్యవసాయ మార్కెట్లు అవసరం. కానీ ఇప్పటివరకు 7 వేల నియంత్రిత మండీలనే ఏర్పాటు చేయగలిగాం. ఓ నివేదిక ప్రకారం 94 శాతం మంది రైతులకు ఇప్పటికీ ఈ మార్కెట్లు అందుబాటులో లేవు. దీనికి తోడు అవినీతి సైతం వీరి పాలిట శాపంగా మారింది.

దురాశ సహజమే!

మానవాధారిత వ్యవస్థలో ప్రతి చోట దురాశ, అవినీతి సహజం. వీటికి ప్రజాస్వామ్య ప్రభుత్వాలే అతిపెద్ద బాధితులుగా చెప్పుకోవచ్చు. అయితే అవినీతి అక్రమాలు ఉన్నాయని ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసుకుంటామా? కాదు కదా. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ అభిప్రాయాన్ని అనుసరిస్తూనే అగ్రి-బిజినెస్, 'అగ్రి-డాలర్ల' కోసం రైతులను బలి చేస్తున్నాయి.

దగ్గర్లోని మండీల్లో అనుమతించాలి

నిజానికి ప్రభుత్వం పూర్తి విరుద్ధంగా చేయాల్సింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ వెలకు దేశవ్యాప్తంగా అమ్మకానికి అనుమతించే బదులు.. రైతులు తమ ఉత్పత్తులను దగ్గర్లోని మండీలలోనే కనీస మద్దతు ధరకు అమ్ముకునే వెలుసుబాటు కల్పించాల్సింది. వ్యవస్థను సంస్కరించాలి కానీ విశృంఖల స్వేచ్ఛ ఇచ్చి విడిచిపెట్టకూడదు.

ఆర్థిక కోణంలో ఉండొద్దు

కేంద్ర ఆర్థికమంత్రి చెప్పినట్లు వ్యవసాయాన్ని ఇతర రంగాలతో పోల్చుకొని చూడటం తగదు. వ్యవసాయ భూముల అమ్మకాలపై హిమాచల్ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో ఆంక్షలు ఉన్నాయి. ల్యాండ్​ సీలింగ్​తో పాటు వీటిని కూడా తొలగించాలా? అందుకే... ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కేవలం ఆర్థిక కోణంలోనే ఉండకూడదు. కొన్ని నిర్ణయాలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి.

మరింత వినాశకరం!

ఆర్థిక మంత్రులు అసంపూర్తి చర్యలు తీసుకోకూడదు. లేదంటే అన్ని విషయాల్లో సరళీకృత విధానాలు అవలంబించాలి. ప్రణాళికాబద్ధంగా ఒకేసారి పూర్తి చేయకుండా సమస్య పరిష్కారానికి ఒక్కోదశలో ఒక్కో విధానాన్ని అవలంబించడం వల్ల ఇప్పటికే నిరాశనిస్పృహలో ఉన్న వ్యవసాయ రంగం మరింత వినాశకర పరిస్థితులు ఎదుర్కొంటుంది.

స్వయం సమృద్ధి అటుంచితే...

ఒకవేళ మరికొన్నేళ్లలో బిహార్​ వంటి పరిస్థితులే దేశవ్యాప్తంగా ఏర్పడి.. అధిక ఉత్పత్తి వ్యయాలు, తక్కువ ఆదాయ వనరులతో రైతులు సతమతమైతే వ్యవసాయ రంగం​ 'స్వయం సమృద్ధి' సాధించడం కాదు, అగ్రి-బిజినెస్​పై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

దేశంలోని రైతులను మరో ఈస్టిండియా కంపెనీ పాలనలో పడకుండా చేయాలంటే అమెరికా వంటి దేశాల వద్దకు వెళ్లి వారికి ప్రయోజనం చేకూర్చేలా భారత్​లోని వ్యవసాయ రంగ ద్వారాలు తెరవకుండా ఉండాలి.

(రచయిత-ఇంద్ర శేఖర్ సింగ్, భారత జాతీయ విత్తన సంఘం డైరెక్టర్(పాలసీ అండ్ అవుట్​రీచ్))

ABOUT THE AUTHOR

...view details