కొవిడ్ పూర్వయుగంలో అస్పష్టంగా కనిపించిన ప్రపంచశక్తుల పునరేకీకరణ రూపురేఖలు.. ఇప్పుడు స్పష్టత సంతరించుకున్నాయి. మన ప్రపంచం భిన్న ధ్రువాలుగా విభాజితం అవుతోందన్న బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం.. అంటే 1991 చివరి రోజుల్లో యూఎస్‌ఎస్‌ఆర్ విచ్ఛిన్నమైంది. రెండు అధికార కూటముల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ఐరోపా ఇతర మిత్ర దేశాల మద్దతుతో అమెరికా నాయకత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఆవిష్కృతమైంది. బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా ఎదిగే శైశవదశలో ఉంది ఆనాటి చైనా. ఇక, భారత్ విషయానికి వద్దాం... ప్రపంచీకరణతో మమేకమవుతూ అది ఈ ఆధునిక ప్రపంచంలో తన స్థానాన్ని పునరావిష్కరించుకుంటోంది. సోవియట్ అనంతర కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. తొలినాళ్లలో, అప్పుడే కళ్లు తెరచిన బహుళ ధ్రువ ప్రపంచం ముందు అద్భుత అవకాశాలు తళుక్కుమన్నాయి. చైనా, రష్యా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు నవోజ్జ్వల ధరిత్రి చరిత్రను తిరగరాస్తాయన్న ఆశలు చిగురించాయి. ఇవి అంతర్జాతీయ పాలన సంస్థలను సంస్కరించి ప్రపంచ వ్యవహారాల్లో గణనీయ పాత్ర పోషిస్తాయని, తద్వారా వర్ధమాన దేశాలకు, ఆర్థిక వ్యవస్థలకు ప్రపంచ విపణిలో సమఉజ్జీలుగా పోటీపడే అవకాశం కల్పిస్తాయని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. ప్రపంచం తద్విరుద్ధ మార్గం పట్టినట్టుగా కనబడుతోంది. ఈ పరిణామానికి దారితీసిన కారణాలు చాలానే ఉన్నాయి.
చైనా-రష్యా... బలపడుతున్న బంధం
రష్యా చైనాలు కొద్దికొద్దిగా దగ్గరవుతూ 2019 నాటికి ‘నూతన శకానికి సమగ్ర సహకార భాగస్వామ్య’ ఒప్పందం కుదుర్చుకునేంత చేరువయ్యాయి. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికే ఇది పరిమితం కాదు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని కూడా ఉభయదేశాలూ అంగీకారానికి వచ్చాయి. ఇంధనం పరస్పర ప్రయోజనకారిగా ఆవిర్భవించింది. ద్వైపాక్షిక వాణిజ్యం 2018లో 100 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించి 108 బిలియన్లకు చేరింది. వాణిజ్య లోటుపరంగానూ ఎలాంటి పెద్ద సమస్యలూ లేవు. రక్షణ రంగ సహకారం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిహద్దు వివాదాలు దాదాపు అన్నీ పరిష్కారం అయ్యాయి. ఉభయ దేశాల సంబంధాలు పరస్పర పూరకంగా, పరిపూరకంగా బలీయమవుతున్నాయి.
2018 మేలో యూఎస్ ‘ఇరాన్ అణు ఒప్పందం’ నుంచి వైదొలగి అత్యంత కఠినమైన ఆంక్షలు విధించడం- ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అశనిపాతమైంది. అంతకు మునుపు 2017 ఆగస్టులో కాట్సా (కౌంటరింగ్ అమెరికాస్ ఆడ్వర్సరీస్ త్రూ శాంక్షనన్ యాక్ట్) శాసనం తెచ్చి ఇరాన్, రష్యా, ఉత్తర కొరియాలపై ఆంక్షలు వర్తింపజేసింది. అమెరికా వ్యతిరేకులతో సంబంధాలు నెరిపే ఇతర దేశాల మీదా ఆంక్షలు విధించడానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా చైనా ఇరాన్ ఆర్థిక, రక్షణ రంగాల్లో 400 బిలియన్ డాలర్ల సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అణుపాటవం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరాన్‌ను ఒంటరి చేసి శిక్షించాలన్న యూఎస్‌కు అది ఎదురుదెబ్భ
చైనా రష్యా ఇరాన్ దేశాలు క్రమేణా ఒక అక్షసౌలభ్యం (యాక్సిస్ ఆఫ్ కన్వీనియన్స్)లో చేరువ అయ్యేందుకు అనువుగా ప్రపంచ కాలమాన పరిస్థితులు రూపుదిద్దుకున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, ఉత్తర కొరియాలు దాదాపు చైనా ఖాతాదారు దేశాలుగా మారాయి. ఇటీవలే నేపాల్, శ్రీలంకలూ చైనా శిబిరంలోకి చేరిపోయినట్లు కనబడుతోంది. భారత్ భూభాగాలను నేపాల్ తనవిగా భౌగోళికపటంలో చేర్చేసుకుంది. శ్రీలంక-భారత్-జపాన్ ఉమ్మడిగా చేపట్టిన ఈస్ట్ కంటెయినర్ టర్మినల్ ప్రాజెక్టును పునస్సమీక్షించాలని శ్రీలంక నిర్ణయించుకుంది. ఈ రెండు పరిణామాలూ నిస్సంశయంగా చైనా ప్రోద్బలంతో చోటుచేసుకున్నవే. ఆఫ్రికాలోనూ ఇతరత్రా ప్రాంతాల్లోనూ ఉన్న కొన్ని చిన్న దేశాలనూ చైనా తన పంచన చేర్చుకుంటోంది.
అమెరికా సారథ్యంలో కొత్త కూటమి!