తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2021, 7:30 AM IST

ETV Bharat / opinion

దళాల ఉపసంహరణతో పేట్రేగుతున్న తాలిబన్లు

అమెరికా దళాలు వెనుదిరిగాక అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. దీంతో తమ దేశ భవిష్యత్తు గురించి అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో భీకర యుద్ధం చేసిన అగ్రరాజ్యం- ఆ అగ్నిగుండాన్ని అలాగే విడిచిపెట్టి ఎందుకు మరలిపోతోందో అంతుపట్టడం లేదు. ఈ పర్యవసానాలను నిశితంగా గమనిస్తున్న భారత్‌- అఫ్గాన్‌లో తన ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తుందన్నది ఆసక్తికరం.

taliban crisis afghanistan, తాలిబన్​ వార్తలు
అఫ్గానిస్థాన్​ సంక్షోభం

కీలక బాగ్రమ్‌ వైమానిక స్థావరం నుంచి అమెరికా దళాలు వెనుదిరిగాక అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కాగానే- దక్షిణ, తూర్పు ప్రావిన్సుల్లోని చాలా ప్రాంతాల్లో తాలిబన్ల దూకుడు పెరిగింది. అమెరికా, నాటో దళాల అండ లేకపోవడం వల్ల తాలిబన్లను వ్యతిరేకించే నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలపై తజకిస్థాన్‌కు పారిపోవాలని, లేదంటే ఆయుధాలు అప్పగించాలనే ఒత్తిడి పెరిగింది. దీన్నిబట్టి చూస్తే తాలిబన్లు తిరిగి అధికారాన్ని దక్కించుకోవడంలో తాము ఏమాత్రం అడ్డం రాబోమని, అలాగే తమ దళాలు సురక్షితంగా నిష్క్రమించేలా చూడాలని ముష్కర మూకలతో అమెరికా ఒప్పందం కుదుర్చుకున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు, తాలిబన్లు ఎక్కడికక్కడ పట్టుపెంచుకుంటూ చొచ్చుకొస్తున్నారు. వారిని అడ్డుకొనేందుకు నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు, ప్రభుత్వ సైనికులు శక్తిమేర యత్నిస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలతో అఫ్గాన్‌ మరోసారి రావణకాష్ఠంలా రగులుతోంది.

బాగ్రమ్​ను చేజిక్కించుకుని..

అల్‌ఖైదా అగ్రనేత ఒసామా బిన్‌ లాడెన్‌ను 2001లో అప్పగించేందుకు తాలిబన్లు నిరాకరించడం వల్ల అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లోకి అడుగుపెట్టాయి. దాదాపు 20 ఏళ్లపాటు దేశం మొత్తాన్ని నియంత్రణలో ఉంచుకున్నాయి. కాబూల్‌కు ఉత్తరాన పర్వాన్‌ ప్రావిన్సులో ఉండే బాగ్రమ్‌ వైమానిక స్థావరం గతంలో తాలిబన్లకు ప్రధాన కేంద్రంగా ఉండేది. తరవాత అమెరికా దళాలు దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు మొత్తం అఫ్గాన్‌ను మళ్ళీ తాలిబన్ల చేతిలో పెట్టినట్లు అమెరికా ఈ ప్రాంతాన్ని ఉన్నపళంగా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అమెరికా తాలిబన్లపై నిర్వహించిన కీలక దాడులన్నింటికీ బాగ్రమ్‌ స్థావరాన్నే ఉపయోగించుకోవడం వల్ల అది ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

అఫ్గాన్‌ ఉత్తర ప్రాంతం నుంచి తాలిబన్లను తరిమి కొట్టేందుకు అమెరికా సంకీర్ణ సేనలు తీవ్రస్థాయిలోనే దాడులు చేశాయి. దాంతో ముష్కర మూకలు తమకు గట్టిపట్టున్న దక్షిణ ప్రాంతాన్ని ప్రధాన స్థావరంగా చేసుకున్నాయి. అమెరికా సేనలు తాలిబన్లపై దాదాపు దశాబ్దం పాటు భారీయెత్తున విరుచుకుపడ్డాయి. కానీ, పెద్దగా సాధించిందేమీ లేదు. మరోవైపు అగ్రరాజ్య దాడులు తాలిబన్లకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలోని అమెరికా ప్రభుత్వం దోహాలో తాలిబన్లతో చర్చలకు ముందుకు రావడం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇరువర్గాల మధ్య విశ్వాసం కొరవడటం వల్ల ప్రారంభంలో వీటి సంగతి రహస్యంగా ఉంచారు. చర్చల్లో తమ ఖైదీలను విడుదల చేయాలని తాలిబన్లు స్పష్టం చేయగా, తన సేనలు క్షేమంగా, గౌరవంగా నిష్క్రమించేలా చూడాలని అమెరికా కోరింది. మరోవైపు అఫ్గాన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా దీర్ఘకాలికంగా తమతో కలిసి పని చేయడానికి చాలామందిని అమెరికా చేరదీసింది. అగ్రరాజ్యం నిష్క్రమణ నేపథ్యంలో వీరందరిలో అభద్రత నెలకొంది. తాలిబన్లు మరోసారి అధికారంలోకి వస్తే ఇలాంటివారి పరిస్థితి అగమ్యగోచరమే.

తజికిస్థాన్​ను ఆశ్రయించిన దళాలు..

ఇప్పటికే తజకిస్థాన్‌ సరిహద్దు ప్రావిన్సులోని చాలా జిల్లాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఫలితంగా నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు తజకిస్థాన్‌లోకి పారిపోవాల్సి వచ్చింది. ఉజ్బెకిస్థాన్‌ సరిహద్దు కుందజ్‌ ప్రావిన్సులోని ఇమామ్‌సాహెబ్‌ జిల్లా వంటి వ్యూహాత్మక ప్రాంతాలపై పట్టు కోసం తాలిబన్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. దీనివల్ల కీలక వాణిజ్య మార్గాలు వారి నియంత్రణలోకి వెళ్తాయి. మొత్తానికి దశాబ్దాల యుద్ధం అఫ్గాన్‌లో పెను విధ్వంసం సృష్టించింది. ప్రస్తుతం అమెరికా, నాటో దళాలు నిష్క్రమించిన తరవాత తమ దేశ భవిష్యత్తు గురించి అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికా రాకమునుపు తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు చదువులు, ఉద్యోగాలకు దూరమయ్యారు. మానవ హక్కులను తాము గౌరవిస్తామని, బాలికలను చదువుకోవడానికి అనుమతిస్తామని తాలిబన్లు బహిరంగంగా ప్రకటించినా ఆచరణలో జరిగింది వేరు. ఈ క్రమంలో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి వస్తే తమ అంతర్గత భద్రత ప్రమాదంలో పడుతుందని పొరుగు దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా, ఉగ్రవాదం నుంచి 'శాశ్వత స్వేచ్ఛ' కోసమంటూ అఫ్గాన్‌లో అడుగుపెట్టిన అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరుగుతోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్‌లో భీకర యుద్ధం చేసిన అగ్రరాజ్యం- ఆ అగ్నిగుండాన్ని అలాగే విడిచిపెట్టి ఎందుకు మరలిపోతోందో అంతుపట్టడం లేదు. ఈ పర్యవసానాలను నిశితంగా గమనిస్తున్న భారత్‌- అఫ్గాన్‌లో తన ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తుందన్నది ఆసక్తికరం.

- బిలాల్‌ భట్‌ (కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details