UP Election 2022: ఉత్తర్ ప్రదేశ్ శాసనసభకు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో అయోధ్య రాముడితో పాటు కాశీ విశ్వనాథుడూ కీలక పాత్ర పోషించనున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 13న కాశీ విశ్వనాథ్ ఆలయ ధామ్(కారిడార్)ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు మోదీని లోక్‌సభకు పంపిన వారణాసి నియోజకవర్గంలో ఉండటం గమనార్హం. మరోవైపు అయోధ్య రామమందిరం 2023 డిసెంబరులో ప్రారంభం కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఈసారి అయోధ్య నుంచి శాసనసభకు పోటీ చేయించాలని భారతీయ జనతా పార్టీ ముఖ్యులు ప్రయత్నిస్తున్నారు. ఆయన అక్కడి నుంచి బరిలోకి దిగితే, అయోధ్య చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ భాజపా విజయావకాశాలు పెరుగుతాయని వారి అంచనా. 2017 మార్చిలో యూపీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆదిత్యనాథ్ 31 సార్లు అయోధ్యను సందర్శించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడానికి నెలన్నరకు పైగా వ్యవధి ఉన్నందువల్ల, ఆలోపే హిందూ ఓటర్ల అభిమానం చూరగొనడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.
మిగిలిన వారిదీ అదే బాట
నిరుడు అయోధ్యలో ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచి భాజపా రామనామ స్మరణతో తనదైన అజెండాను ముందుకు తీసుకెళ్తోంది. అలా అని రామబాణాన్ని పూర్తిగా ఆ పార్టీకే వదలివేయడానికి ప్రత్యర్థి పార్టీలు సిద్ధంగా లేవు. ఈసారి యూపీ, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ నుంచి అయోధ్యకు వెళ్ళే భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని ప్రకటించింది. తమ పార్టీని గెలిపిస్తే అయోధ్యలో 356 రోజులపాటు దీపావళి ఉత్సవాలు జరుపుతామని, మత స్థలాలను పన్నుల నుంచి మినహాయిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే అయోధ్య ప్రస్తావన తీసుకురాలేదు. ముస్లింల ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్, సమాజ్‌వాదీలకు ఉన్నమాట నిజం. బహుజన్ సమాజ్ పార్టీ అయితే అయోధ్య నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి తాము అధికారంలోకి వస్తే మధుర, కాశీలలోని వివాదాస్పద మత స్థలాల్లో నిర్మాణ పనులను నిలిపివేస్తామనే ఆందోళన అక్కర్లేదని భరోసా ఇచ్చారు.
మరోవైపు మోదీ ప్రారంభించనున్న కాశీ విశ్వనాథ్ ధామ్ (కేవీటీ) ప్రాజెక్టును రూ.700 కోట్ల వ్యయంతో 2019లో చేపట్టారు. అందులో భాగంగా గంగా నది స్నాన ఘట్టాలను విశ్వనాథ ఆలయంతో కలపడానికి 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో విశాలమైన నడవా నిర్మించారు. కోర్టు ఉత్తర్వు ప్రకారం కాశీలోని జ్ఞాన్ వాపీ మసీదు యాజమాన్యం వెయ్యి అడుగుల స్థలాన్ని కేవీటీ కంట్రోల్ టవర్ నిర్మాణానికి అప్పగించి, సమీపంలో మరో చోట అంతే స్థలాన్ని పొందింది. అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు సూచించిన సూత్రాన్ని కాశీలోనూ అనుసరించారు. కేవీటీ కింద మొత్తం అయిదు లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో ముముక్ష భవన్, మ్యూజియం, గ్రంథాలయం, యాత్రీ నివాస్ వంటి 23 భవనాల నిర్మాణాన్ని పూర్తిచేశారు. భవనాల గోడలపై వేద మంత్రాలు లిఖించారు.