తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సమస్యల్లోంచి సుడిగుండంలోకి నేపాల్​ రాజకీయాలు! - nepal prime minister oli

పార్లమెంటు రద్దుతో నేపాల్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ చర్య రాజ్యాంగ విరుద్ధం. రాచరిక శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఇప్పుడు నేపాల్​ భవిష్యత్తు ఏమిటి?

nepal, political crisis
నేపాల్‌లో దారితప్పిన రాజకీయం

By

Published : Jan 28, 2021, 7:20 AM IST

Updated : Jan 28, 2021, 7:30 AM IST

హిమాలయ రాజ్యంలో రాజకీయం సెగలు పొగలు కక్కుతోంది. దాదాపు దశాబ్దకాలం క్రితం రాచరికాన్ని వదిలించుకొని సమాఖ్య ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిర్భవించింది మొదలు నేపాల్‌ ప్రస్థానం ఒడుదొడుకులమయంగానే సాగుతోంది. బొత్తిగా అధికారమే కాంక్షగాగల రాజకీయ పక్షాలు ఆ దేశానికి గుదిబండగా మారాయి. అక్కడ ప్రస్తుతం నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ దుందుడుకు వైఖరే కారణం. నెలక్రితం ఉన్నఫళంగా పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళాలంటూ ఆయన ప్రకటించిన నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.

నేపాల్‌లో 2015లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో పార్లమెంటును అర్ధాంతరంగా రద్దు చేయవచ్చునన్న వెసులుబాటు లేదు. పార్టీలోని సీనియర్‌ సహచరులు సహకరించడం లేదని, పాలన సజావుగా సాగకుండా వారు అడ్డం తగులుతున్నారన్న మిషతో పార్లమెంటును ఓలీ రద్దు చేశారు. ఓలీ వైఖరితో నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ నిలువునా చీలిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక వర్గం కేపీ శర్మ ఓలీకి, మరో వర్గం ప్రచండకు మద్దతు తెలుపుతున్నాయి. రెండు వర్గాల్లో పార్టీ చిహ్నమైన ‘సూర్యుడి’ గుర్తు దేనికి దక్కాలో తేల్చాల్సిన ఎన్నికల సంఘమూ ప్రస్తుతం అయోమయంలో పడింది.

ఎన్నికలు.. రాజ్యాంగ విరుద్ధం!

ఒప్పందానికి కట్టుబడి అధికార పంపిణీకి ఓలీ అంగీకరించనందువల్లే ఈ సంక్షోభం తలెత్తిందని ప్రచండతోపాటు పార్టీలోని మరో సీనియర్‌ నాయకుడు మాధవ్‌ కుమార్‌ గట్టిగా విమర్శిస్తున్నారు. అసమర్థ, అవినీతి పాలనకు ఆవాహన పలికిన కేపీ శర్మ- రాజ్యాంగ వ్యవస్థలను, కీలకమైన నిర్ణయాధికార పదవులను గుప్పిటపట్టారు. పాలన వివిధ స్థాయుల్లో అవినీతి పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్‌లో ఎన్నికలు వాయిదా పడవచ్చునన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

దేశంలో ఆత్యయిక స్థితి విధించే అవకాశాలూ ఉన్నాయన్న వార్తా కథనాలు మరోవంక చక్కర్లు కొడుతున్నాయి. ఏ వర్గానికి ఎన్నికల గుర్తు కేటాయించాలో తేల్చేందుకు చట్టాలూ, నిబంధనలతో కుస్తీలు పడుతున్న ఎలెక్షన్‌ కమిషన్‌ చివరికి ఏదో ఒక నిర్ణయానికి వస్తే రావచ్చుగానీ.. అసలు ఎన్నికల నిర్వహణే రాజ్యాంగ విరుద్ధమైన ఈ పరిస్థితుల్లో నేపాల్‌ను పూర్తిగా అస్థిరత అలుముకుందనే చెప్పాలి. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీనుంచి బహిష్కరణకు గురైన ఓలీ మద్దతు కొరవడి ఇప్పుడు సొంత పార్టీలోనే మైనారిటీలో పడ్డారు. అంతర్గత సమస్యల్లో మునిగిపోయిన ప్రధాన విపక్షం నేపాల్‌ కాంగ్రెస్‌ సైతం రాజ్యాంగ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంలో ఉంది.

రాచరిక శక్తుల ప్రయత్నం

ఈ గందరగోళాన్ని అవకాశంగా మలుచుకొని బలమైన భూస్వామ్య వర్గాల దన్నుతో రాచరిక శక్తులు ఒక్కటయ్యేందుకు నేపాల్‌లో ప్రయత్నాలు మొదలయ్యాయి. హిందూ రాజ్యస్థాపన నినాదంతో ఆ వర్గాలు పక్కా మతవాద పంథాను ప్రబోధిస్తున్నాయి. తలోదిక్కుగా చెదిరిపోయిన ‘మదేశీ’ వర్గాలు సైతం మారిన పరిస్థితుల్లో అవకాశాలు వెదుక్కునే పనిలో పడ్డాయి. ఈ తరుణంలో కమ్యూనిస్టు పార్టీలోని వైరి వర్గాన్ని ఎదుర్కోవాలంటే నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీలోని అసమ్మతి గ్రూపులతోనో లేక హిందూత్వ వర్గాలతోనో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటువైపు ఓలీ అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది సాధ్యంకాని పక్షంలో ప్రత్యర్థి ప్రచండ వర్గాన్ని చీల్చేందుకూ ఓలీ పావులు కదిపినా ఆశ్చర్యం లేదు!

చైనాకు చెంపపెట్టు

నేపాల్‌ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న ప్రతి కదలికనూ భారత్‌, చైనాలు నిశితంగా గమనిస్తున్నాయి. నేపాల్‌లో ప్రాబల్యం చాటుకునేందుకు చైనా ఇప్పటికే భారీగా ఖర్చుపెట్టింది. ప్రచండ అధికార కాంక్షలను తనకు అనుకూలంగా ఉపయోగించుకొని నేపాల్‌లో అనాదిగా వైరి పక్షాలుగా ఉన్న మావోయిస్టులను, సమైక్య మార్క్సిస్టు లెనినిస్టులను ఒకేతాటిమీదకు తీసుకువచ్చి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీగా మార్చే క్రమంలో చైనా పెద్ద కసరత్తే చేసింది.

బీజింగ్‌ సర్కారు పనిగట్టుకుని నేపాల్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలడం భారత్‌కు ఓ కోణంలో ఊరట కలిగించే పరిణామమే! సంక్షోభానంతరం నేపాల్‌ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయన్నదే అతి పెద్ద ప్రశ్న. హిమాలయ రాజ్యంలో హిందూత్వ, రాచరిక శక్తులు ఉమ్మడిగా అధికారంలోకి వస్తే బాగుంటుందని భారత్‌లోని కొన్ని వర్గాలు భావిస్తూ ఉండవచ్చు. నేపాల్‌లోని దేవుడిని విశ్వసించని కమ్యూనిస్టులకు, దారితప్పిన ప్రజాస్వామ్య వర్గాలకు- హిందూత్వ శక్తులే సరైన ప్రత్యామ్నాయమన్నది భారత్‌లో కొందరి అభిప్రాయం.

కానీ, నేపాల్‌ రాచరిక వ్యవస్థగా ఉన్నప్పుడు భారత్‌కు ఒరిగిందేమీ లేదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. పాకిస్థాన్‌, చైనాల ప్రాబల్య విస్తరణకు అడ్డుకట్టవేసే విషయంలో దశాబ్దకాలం క్రితం నేపాల్‌లోని రాచరిక శక్తులు పూర్తిగా విఫలమయ్యాయి. కాబట్టి, ఇప్పుడే తొందరపడి ఏదో ఒకవైపు మొగ్గు చూపకుండా- అక్కడ రాజకీయ పరిణామాలు కీలక మలుపు తిరిగేవరకూ భారత్‌ సంయమనంతో వ్యవహరించడమే మేలు!

- ఎస్‌.డి.ముని (లావోస్​లో భారత మాజీ రాయబారి)

ఇదీ చదవండి :కొత్త లాక్​డౌన్​ మార్గదర్శకాలు- స్విమ్మింగ్ ​పూల్స్​ ఫుల్​

Last Updated : Jan 28, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details