కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గెలుపోటముల్లో కులానిది ఎప్పుడూ కీలక పాత్రే. ముఖ్యంగా ఆ రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న లింగాయత్‌లు మొత్తం 224 నియోజక వర్గాల్లోని దాదాపు వంద నియోజకవర్గాల్లో ఫలితాలను శాసిస్తారు. కర్ణాటక సామాజిక చరిత్రలో లింగాయత్‌లకు ముఖ్యమైన స్థానముంది. మిగిలిన సామాజిక వర్గాలను పరిశీలిస్తే వక్కలిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం, ముస్లింలు 12.92 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. ఐతే 2013 నుంచి 2018 వరకు కర్ణాటకలో నిర్వహించిన కులాల వారీ జనాభా లెక్కల ప్రకారం లింగాయత్‌లు 9 శాతం, వక్కలిగలు 8 శాతానికి పరిమితమైనట్లు సమాచారం. ఈ నివేదిక ఇంకా బయటకు రాలేదు.
ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 37 మంది భాజపాకు చెందినవారే. 1952 నుంచి కర్ణాటకను పాలించిన 23 మంది ముఖ్యమంత్రుల్లో 10 మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. వక్కలిగలకు చెందిన ఆరుగురు, ఓబీసీలకు చెందిన ఐదుగురు, ఇద్దరు బ్రాహ్మణులు కర్ణాటక సీఎంలుగా పని చేశారు. ఇంత ముఖ్యమైన భూమిక పోషించే లింగాయత్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రస్తుతం అన్ని పార్టీలూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
వాస్తవానికి 1989 వరకు లింగాయత్‌లు కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉండేవారు. లింగాయత్ వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 స్థానాలకు గాను 178 చోట్ల విజయఢంకా మోగించింది. అయితే 1990లో పాటిల్ అనారోగ్యానికి గురై కోలుకుంటున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నేత బంగారప్పను వీరేంద్ర పాటిల్ స్థానంలో సీఎంగా నియమించారు. కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు.
ఈ పరిణామం కాంగ్రెస్‌కు లింగాయత్‌లు దూరమవడానికి కారణమైంది. ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 34 స్థానాలకే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీలో లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడియూరప్ప అగ్రనేతగా ఎదగడం వల్ల లింగాయత్‌ల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ నుంచి కమలదళంవైపు మళ్లింది. భాజపా, జేడీఎస్ మధ్య కుదిరిన అధికార పంపిణీ ఒప్పందాన్ని ఉల్లంఘించి 2007లో సీఎం పదవిని యడియూరప్పకు అప్పగించేందుకు మాజీ సీఎం ఎచ్డీ కుమార స్వామి నిరాకరించడం వల్ల అప్పటి ప్రభుత్వం కుప్పకూలింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప నేతృత్వంలో 110 స్థానాల్లో గెలుపొందిన భాజపా కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐతే ఆ తర్వాత జరిగిన 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం 40 స్థానాలకే పరిమితమైంది. అప్పట్లో భాజపా నుంచి దూరంగా జరిగిన యడియూరప్ప.. కర్ణాటక జనతా పక్ష పేరిట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ ఎన్నికల్లో 6 స్థానాలకే పరిమితమైనా10 శాతం ఓట్లు సాధించింది.
బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప యడియూరప్ప పార్టీ వల్ల భాజపాకు భారీ ఎత్తున ఓట్లు తగ్గి కమలదళం విజయావకాశాలను దెబ్బతీసింది. ఐతే 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు యడియూరప్ప తిరిగి భాజపా గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 104 స్థానాల్లో నెగ్గింది. మరోసారి యడియూరప్ప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. 75 ఏళ్లు దాటిన వారు కీలక పదవుల్లో ఉండరాదనే పార్టీ విధానం కారణంగా 2021లో సీఎం పదవి నుంచి యడియూరప్ప దిగిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ లింగాయత్ వర్గానికే చెందిన మరోనేత బసవరాజ్ బొమ్మైని భాజపా కర్ణాటక సీఎంను చేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని యడియూరప్ప ప్రకటించినప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఆయన్నే ప్రధాన రథసారథిగా భాజపా ముందుంచింది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని యడియూరప్ప కూడా ప్రకటించారు. యడియూరప్పను భాజపా పక్కన పెట్టిందని కాంగ్రెస్ విమర్శిస్తున్న వేళ.. భాజపా ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది.
మరోవైపు కర్ణాటకలో రెండో అతిపెద్ద సామాజిక వర్గమైన వక్కలిగలలో ఆదరణ పొందిన జనతాదళ్ ఎస్.. పాత మైసూర్ ప్రాంతానికే ఎక్కువగా పరిమితమైంది. ఈ నేపథ్యంలో గతంలో తమకు ప్రధాన ఓటు బ్యాంక్‌గా ఉన్న లింగాయత్‌లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. లింగాయత్‌లను మతపరమైన మైనార్టీలుగా గుర్తించాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కేంద్రానికి ప్రతిపాదించినప్పటికీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరలేదు. లింగాయత్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. లింగాయత్ వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో మాస్ లీడర్ ఎవరూ లేదు. లింగాయత్ ఎమ్మెల్యే ఎం.బి.పాటిల్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ నియమించింది. మరో లింగాయత్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రేను కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.
లింగాయత్ సామాజిక వర్గంలో మఠాలది కూడా కీలక పాత్ర. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న పలు లింగాయత్ మఠాలు రాజకీయంగా ప్రభావితం చేస్తాయి. లింగాయత్‌లలో ఉండే ఉప కులాలదీ ముఖ్య భూమికే. యడియూరప్ప బనాజిగ ఉప కులానికి, బొమ్మై సదర్ ఉపకులానికి చెందిన వారు. లింగాయత్‌లలో అధిక సంఖ్యలో ఉండే ఉప కులం పంచమసాలీలు.. దర్శి బసవ జయ మృత్యుంజయ స్వామీజీ నాయకత్వంలో ఉంటారు. విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లను పెంచాలని కోరుతూ ఇటీవల వారు ఆందోళన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆందోళనకు దిగొచ్చిన భాజపా సర్కారు రాష్ట్ర ఓబీసీ జాబితాలో లింగాయత్‌లకు ఉన్న రిజర్వేషన్‌ను మరో 2 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి లింగాయత్‌లు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.