భారతదేశంలో బాలలకు, కౌమార ప్రాయంలోని వారికి త్వరలో కొవిడ్ టీకాల కార్యక్రమం మొదలు కాబోతోంది. ముందుగా ఈ నెల 20నుంచే 12-17 వయోవర్గంలోని వారికి జైకోవ్-డి టీకాలు వేస్తారని తెలుస్తోంది. సూది లేకుండా చర్మం ద్వారా ప్రతి డోసుకు మధ్య 28 రోజుల వ్యవధితో మొత్తం మూడు విడతలుగా ఈ టీకాను ఇస్తారు. తరవాత భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్, కోర్బి వ్యాక్స్ (బయోలాజికల్ ఇ) రూపొందిస్తున్న టీకాలూ బాలలకు అందుబాటులోకి రానున్నాయి. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ టీకాను 2-18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వడానికి ప్రభుత్వ నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. అన్ని అనుమతులు పొందిన తరవాత ఈ టీకా అందుబాటులోకి వస్తుంది.
రూపాంతరాలకు అడ్డుకట్ట
భారత్‌లో పాఠశాలలు, కళాశాలలు తిరిగి పనిచేయడం మొదలైనందువల్ల బాలల టీకా కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకొంది. బాలల్లో కొవిడ్ లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి, టీకాలు అవసరమా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల్లో కొవిడ్ లక్షణాలు బయటపడకపోయినా- వారి నుంచి ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. కొవిడ్ లక్షణాలతో పిల్లలు ఆస్పత్రుల్లో చేరిన ఘటనలు ఈమధ్య తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల బాలల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు, ఉదర కోశం వాపునకు (ఇన్‌ఫ్లమేషన్) గురికావడాన్ని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేషన్ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (ఎంఐఎస్-సి)గా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు టీకా వేసి బడులకు పంపడం- తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ భరోసా కల్పిస్తుంది. త్వరలో నెలకు కోటి డోసుల జైకోవ్-డి టీకాలు అందుబాటులోకి వస్తాయని, వాటిలో 25 లక్షల డోసులను నెలనెలా ప్రైవేటు ఆస్పత్రులు కోరితే అందించగలమని జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా బృందం (ఎన్టాగీ) అధ్యక్షుడు ఎన్‌కే అరోరా చెబుతున్నారు. టీకాలను కేంద్రం, ప్రైవేటు ఆస్పత్రులు 75:25 నిష్పత్తిలో పంచుకోవాలనే విధానానికి అనుగుణంగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
బాలలకు కొవిడ్ టీకా వేయడంలోని సాధకబాధకాలను ఎన్టాగీ బృందం అధ్యయనం చేసింది. 130 కోట్ల పైచిలుకు భారత జనాభాలో 41 శాతం 18 ఏళ్లలోపువారే. జూన్‌లో జరిగిన సీరో పాజిటివిటీ సర్వేలో ప్రజల రక్తంలో కొవిడ్ వైరస్ యాంటీబాడీలను పరిశీలించారు. 18 ఏళ్లలోపు వారిలో 55.7శాతంలో, పెద్దవయసు వారిలో 63.5శాతంలో కొవిడ్ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు అందులో తేలింది. పిన్న, పెద్ద వయస్కులనే తేడా లేకుండా జనాభాలో అత్యధికులకు టీకాలు వేస్తే, కరోనా వైరస్ ప్రమాదకర రూపాంతరాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే 12 ఏళ్లు పైబడిన బాలలకు కొవిడ్ టీకాలు వేయాలని వారు సిఫార్సు చేస్తున్నారు. పదేళ్లు, అయిదేళ్ల లోపువారికి టీకాలు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారికి అర డోసు లేదా పావు డోసు వేయవచ్చని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. బాలల్లో కొవిడ్ బాధితుల సంఖ్య తక్కువేనని అమెరికాతో సహా పలు దేశాల్లో జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నా, జన జీవనం వేగంగా సాధారణ స్థితికి తిరిగి రావాలంటే పిల్లలకు కొవిడ్ టీకాలు పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.