తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి మరీ నేరగాళ్లతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఆ కారాగార సిబ్బందిని సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇటీవల అలాగని ఈసడించింది! వారిపై నమ్మకం కోల్పోయామంటూ ఆవేదన వెళ్లగక్కింది. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఊచలు లెక్కపెడుతున్న యూనిటెక్ స్థిరాస్తి సంస్థ మాజీ ప్రమోటర్లతో మిలాఖత్ అయినట్లు తేలడంతో ముప్ఫై మంది తిహార్ జైలు అధికారులపై తాజాగా సస్పెన్షన్ వేటుపడింది. మరో ఇద్దరు ఒప్పంద ఉద్యోగులను సర్వీసులోంచి పూర్తిగా తొలగించారు. నేరగాళ్లకు స్వర్గధామంగా ఆ కారాగారం అలరారుతోందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించి, విచారణకు ఆదేశించిన తరవాత చోటుచేసుకున్న పరిణామాలివి! దేశంలోనే అతిపెద్ద కారాగారమైన 'తిహార్'లో నేరగాళ్ల ఎంగిలి మెతుకులకు లొట్టలు వేసే అధికారులు, సిబ్బందికి లోటే లేదు! ఆ మాటకొస్తే- తరతమ భేదాలతో ఆసేతుహిమాచలం అధిక శాతం కారాగారాలు అలాగే వర్ధిల్లుతున్నాయి. డబ్బిస్తే చాలు.. ఉగ్రవాదులకైనా ఊడిగం చేసే ఇంటిదొంగలతో అవి లుకలుకలాడుతున్నాయి.
దిల్లీలోని రోహిణి జైలు నుంచి అక్రమ వసూళ్ల దందా నడిపించిన సుఖేష్ చంద్రశేఖర్ లీలలు రెండు నెలల క్రితమే బయటపడ్డాయి. మహా మాయగాడిగా, కోటీశ్వరుడైన మోసగాడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతగాడు- తాను కోరిందల్లా క్షణాల్లో అందించడానికి కారాగార అధికారులకు పక్షం రోజులకు రూ.65 లక్షలు చొప్పున ముట్టజెప్పినట్లు విచారణలో వెల్లడించాడు! సీసీ కెమెరాలకు దుప్పట్లు అడ్డంపెట్టి, ఐఫోన్‌తో వ్యవహారాలు నడిపించిన సుఖేష్- జైలులోంచే అనేక మందిని బెదిరించి కోట్లు దండుకున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సందేహిస్తోంది. ఆ ప్రబుద్ధుడి మోచేతినీళ్ల రుచిమరిగిన ఆరుగురు సిబ్బందిని ఇటీవల సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. సుఖ భోగ కేళీ విలాస లాలసుడైన సుఖేష్ మూడేళ్ల క్రితం తన పుట్టినరోజు నాడు ప్రేయసితో కలిసి జైలులోనే పార్టీ చేసుకున్నాడు. వాళ్లకు ఆ ఏకాంతవాసం కల్పించిన 'పుణ్యానికి' ఒక హెడ్‌వార్డర్ అప్పట్లోనే బలయ్యాడు. అయినా బుద్ధితెచ్చుకోని మిగిలిన సిబ్బంది నిర్లజ్జగా అతడి అడుగులకు మడుగులొత్తుతూ ఇన్నేళ్లుగా తరించిపోయారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాలు..
పశ్చిమ్ బంగ, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్‌లలో కారాగారాలు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాలుగా అవతరించాయని కేంద్రమే లోగడ కుండ బద్దలు కొట్టింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాస్తూ- జైళ్లలోని ముష్కరమూకలు, మాఫియా డాన్లకు రాచమర్యాదలు దక్కుతున్న తీరును తీవ్రంగా ఆక్షేపించింది. అక్రమార్కులైన కొంతమంది సిబ్బంది మూలంగా దేశభద్రతే పెను ప్రమాదంలో పడుతోందని, అటువంటి వాళ్లను తక్షణం కట్టడిచేయాలని హెచ్చరించింది. కారాగారాల్లో సెల్‌ఫోన్ల వినియోగంపై నిఘాపెట్టాలని, జామర్లను బిగించాలని సూచించింది. ఏమి లాభం? తిహార్ జైలులో యమదర్జాగా కాలం గడుపుతున్న ఇండియన్ ముజాహిదీన్ ముష్కరుడు తెహసీన్ అక్తర్ దగ్గర ఎన్‌ఐఏ అధికారులు ఇటీవలే ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. కరడుగట్టిన ఆ ఉగ్రవ్యాఘ్రానికి ఫోన్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు!