తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చైనా కట్టడికి ఉమ్మడి వ్యూహం

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాను కట్డడి చేసే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. చైనా పోకడలపై ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పీన్స్‌ వరకు పలు ఇండో-పసిఫిక్‌ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన జీ7 సదస్సులోనూ.. చైనాకు పగ్గాలేసే విషయంపై చర్చలు జరిగాయి.

g7 countries on china, indo china relations
చైనా

By

Published : May 10, 2021, 7:13 AM IST

డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా మీద ఎత్తిన కత్తి దించకుండా ఎడాపెడా నిషేధాలు, ఆంక్షలు విధించేవారు. చైనాను దారికి తీసుకురావడానికి అందర్నీ కలుపుకొని పోకుండా ఒంటెత్తు పోకడలు అనుసరించేవారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను కట్టడి చేయడానికి భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసినా, ట్రంప్‌లో ఆవేశమే తప్ప ఆలోచన లేదన్న అభిప్రాయం నెలకొంది. చైనాపై ఒకవైపు కత్తి ఝళిపిస్తూ, రెండో వైపు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నడచుకునేలా చేయడానికి పకడ్బందీ వ్యూహమేదీ ట్రంప్‌ సర్కారు రచించలేదు. అందుకే భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు అప్పట్లో చైనాతో ముఖాముఖి ఘర్షణ పంథా అనుసరించడానికి ఇష్టపడలేదు.

ఎప్పుడైతే బీజింగ్‌ తన కబ్జాకోరు, గిల్లికజ్జా వైఖరిని దక్షిణ చైనా సముద్రం నుంచి హిమాలయాలకు విస్తరించి భారత్‌తో ఘర్షణలకు దిగిందో, అప్పటి నుంచి క్వాడ్‌ వ్యూహం కూడా కరకు తేలడం మొదలైంది. చైనా పన్నాగాలను బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా ప్రమాదకరమైనవిగా పరిగణించసాగాయి. కానీ, ఈయూలో ఆర్థిక అగ్రగామి అయిన జర్మనీకి చైనాతో పటిష్ఠ వ్యాపార బంధం ఉండటంతో, ట్రంప్‌ దురుసు పంథాలో నడవడానికి ఆ దేశం ముందుకు రాలేదు. పైగా చైనాతో భారీ పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకోవడానికి జర్మనీ ప్రేరణతో ఈయూ సన్నాహాలు ప్రారంభించింది. ఇతర దేశాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకుంటూ చైనాకు పగ్గాలు వేయాలనే లౌక్యం ట్రంప్‌లో లోపించడమే దీనికి కారణం.

మారిన పరిస్థితులు

ట్రంప్‌ తరవాత జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పరిస్థితులు మారసాగాయి. క్వాడ్‌తోపాటు ఈయూను కూడా కలుపుకొనిపోయే వ్యూహాన్ని బైడెన్‌ చేపట్టారు. ఫలితంగా చైనాతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకొనే యత్నాలను ఐరోపా కమిషన్‌ నిలిపివేసింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై తమ వ్యూహాన్ని ఈయూలోని 27 సభ్యదేశాలు గత నెలలో ప్రకటించినా, ఆ వ్యూహం మరీ మెతకగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా పోకడలపై ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పీన్స్‌ వరకు పలు ఇండో-పసిఫిక్‌ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నా, ఈయూ వ్యూహం చైనా పట్ల తమలపాకుతో ఒకటి అంటా అన్నట్లు సాగింది. చైనా మాత్రం తలుపు చెక్కతో నేనొకటి అంటా అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఈయూ ఇండో-పసిఫిక్‌ వ్యూహ ప్రకటనలో దౌత్యపరమైన పరిభాష, విశాల సూత్రాల పునరుద్ఘాటన తప్ప వ్యూహపరమైన స్పష్టత కనిపించలేదు.

బెల్ట్‌, రోడ్‌ పథకం పేరిట ప్రపంచమంతటా ప్రాబల్యం పెంచుకోవడానికి, దక్షిణ చైనా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు పెత్తందారుగా వ్యవహరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఈయూ ప్రత్యేక ప్రణాళిక ఏదీ ప్రకటించలేదు. ప్రపంచ ఎగుమతి, దిగుమతుల్లో పెద్ద భాగం ఇండో-పసిఫిక్‌ జలాల గుండానే జరుగుతున్నాయి. ఇక్కడ సముద్ర గర్భంలో వేస్తున్న ఇంటర్నెట్‌, కమ్యూనికేషన్‌ తీగలు ఆర్థికంగా, వ్యూహపరంగా అమిత ప్రాధాన్యం సంతరించుకొంటున్నాయి. ఈ రెండింటిపై ఎవరి ఆధిపత్యం లేకుండా ఈయూతో పాటు అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉంచాలని క్వాడ్‌ లక్షిస్తోంది. పరిస్థితిని అవగాహన చేసుకున్న ఫ్రాన్స్‌ 2018లో సొంత ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని ప్రకటించింది. జర్మనీ, నెదర్లాండ్స్‌లు గతేడాది ఆ పని చేశాయి. ఆపైన గత నెలలో ఈయూ సమష్టి వ్యూహ ప్రకటన వెలువడింది.

నిర్మాణాత్మక సహకారం

ఈ దిశలో పడిన ముందడుగుగా ఇటీవలి జీ-7 సమావేశాన్ని ప్రస్తావించవచ్చు. జీ-7లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌లతోపాటు ఐరోపాలో అగ్రదేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ కూడా సభ్యులుగా ఉన్నాయి. సంపన్న ప్రజాస్వామ్య దేశాల కూటమి అయిన జీ-7- చైనా దూకుడుకు పగ్గాలు వేయడానికి ఉమ్మడి వ్యూహం అనుసరించాలని నిర్ణయించింది. ఈ కూటమి విదేశాంగ మంత్రులు లండన్‌లో ముఖాముఖి సమావేశమయ్యారు. గత రెండేళ్లుగా వర్చువల్‌ సమావేశాలు జరుపుకొంటున్న నాయకులు ఈసారి ప్రత్యక్ష సమావేశం జరపడం విశేషం. జీ-7 భేటీకి ఆతిథ్యమిచ్చిన బ్రిటన్‌ మూడు రోజులపాటు జరిగిన చర్చలకు భారత్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను కూడా ఆహ్వానించింది. చైనా ప్రగతిని అడ్డుకోవడం కానీ, ఆ దేశాన్ని చక్రబంధంలో ఇరికించడం కానీ తమ ఉద్దేశం కాదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్‌ స్పష్టంచేస్తున్నారు. కానీ, దశాబ్దాలుగా అన్ని దేశాలూ గౌరవిస్తున్న అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలను చైనా బేఖాతరు చేస్తోందని ఇండో-పసిఫిక్‌ దేశాలు భావిస్తున్నాయి. ఈ నియమ నిబంధనలను చైనాతో సహా అందరూ గౌరవించేలా చూడాలన్నది జీ-7 అభిమతమని బ్లింకెన్‌ అభిప్రాయపడుతున్నారు.

చైనా విషయంలోకానీ, ఇతర అంశాలపై కానీ జీ-7 దేశాల్లో ఎటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. తన దారికి అడ్డువచ్చే దేశాలపై చైనా ఆర్థిక ఆంక్షలు విధించడం, స్వదేశంలో వీగర్‌ ముస్లిములపై దమననీతి అనుసరించడం ఆందోళనకరమని జీ-7 పేర్కొంది. బీజింగ్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల నుంచి దిగుమతులపై వేటు వేసి జపాన్‌కు అరుదైన లోహాల ఎగుమతికి కోత పెట్టడం ఈ సందర్భంగా గమనార్హం. తన ఏలుబడిలో ఉన్న హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించేటప్పుడు, హాంకాంగ్‌కు సొంత పాలనా వ్యవస్థను కొనసాగించేలా బీజింగ్‌ నుంచి బ్రిటన్‌ వాగ్దానం తీసుకుంది. తీరా ఇప్పుడు చైనా తన మాట నిలబెట్టుకోవడం లేదని బ్రిటన్‌ ఆగ్రహిస్తోంది. అలాగని చైనాపై అతివాద పంథా అనుసరించడం లేదు. బీజింగ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అంతర్జాతీయ నిబంధనల చట్రాన్ని గౌరవించాలని లండన్‌ కోరుతోంది. జీ-7 ఆశిస్తున్నదీ అదే. వాతావరణ మార్పులు మొదలుకొని వాణిజ్యం వరకు అన్ని అంశాల్లో చైనాతో నిర్మాణాత్మక సహకారం నెరపాలని భావిస్తోంది. ఇందుకు చైనా కలిసివచ్చేలా చూడటానికి అన్ని విధాలుగా ఒత్తిడి పెంచడం జీ-7 వ్యూహం.

బ్రిటన్‌ గట్టి వైఖరి

బ్రిటన్‌ తక్కిన ఐరోపా దేశాలకన్నా ముందే ఇండో-పసిఫిక్‌ దేశాల భాగస్వామ్యంతో జాతీయ ప్రయోజనాలను సంరక్షించుకొంటానని ఉద్ఘాటించింది. ఈయూ వ్యూహం విశాల ప్రయోజనాల గురించి పేర్కొన్నా, దానికి కోరలు లోపించాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా నిరంకుశ విధానాలను బ్రిటన్‌ గట్టిగా వ్యతిరేకిస్తుండగా, ఈయూ సమష్టిగా కరకు వైఖరిని ప్రకటించకపోవడం దీనికి కారణం. సముద్ర జలాలగుండా సరకుల రవాణాకు భద్రత కల్పించడానికి, ఇతర విధాలుగా రక్షణ చర్యలు తీసుకోవడానికీ బ్రిటన్‌ ఇండో-పసిఫిక్‌లో యుద్ధ నౌకల మోహరింపునకు సన్నద్ధత ప్రకటించింది. ఈయూ మాత్రం ఈ ప్రాంతంలో తమ సభ్యదేశాల నౌకలు 'అర్థవంతమైన రీతిలో సంచరించాలి' అని ఉద్బోధించింది. ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ఐరోపా కమిషన్‌ మరింత స్పష్టమైన వ్యూహంతో వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

(రచయిత- కైజర్ అడపా)

ఇదీ చదవండి :'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details