Analysis on Artificial Intelligence :కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పటికే మానవాళిపై అమిత ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలతో పాటు, ప్రైవేటు రంగ సంస్థలు సైతం ఏఐపై తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ ఆధారిత డిజిటల్ సాంకేతికతల ఆవిష్కరణలో అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయి. యునైడెట్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాలు దీనికి సంబంధించి భారీ ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రభుత్వం పాత్ర కీలకం..
యూఏఈ, సౌదీ వంటి గల్ఫ్ దేశాలూ ఈ పరుగులో భాగం అవుతున్నాయి. భారత్ సైతం డిజిటల్ సాంకేతికతలను విరివిగా అమలులోకి తేవడానికి మూడు నాలుగేళ్లుగా పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కృషి సరిపోదనే చెప్పాలి. వాటికి అధిక ప్రాధాన్యమిస్తూ, పెద్దయెత్తున పెట్టుబడులను సమీకరించాలి. విస్తృత పరిశోధనలు చేపట్టి నూతన సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి. ఈ విషయంలో ప్రభుత్వం పాత్ర ఎంతో కీలకం. సర్కారు దారి చూపితే, అందులో ప్రైవేటు రంగ సంస్థలు సైతం ముందుకు సాగి, ఐటీ రంగంలో మాదిరిగా ఘన విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
దేశీయంగా ప్రైవేటు రంగంలో రిలయన్స్ గ్రూపు సంస్థ అయిన జియో భారత్‌కు అనువైన ఏఐ మోడళ్లను ఆవిష్కరించడానికి కృషి చేస్తోంది. రెండు వేల మెగావాట్ల ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం కలిగిన క్యాంపస్‌ను సిద్ధం చేసే పనిలో అది నిమగ్నమైంది. భారతీయ భాషలకు సంబంధించి టెక్ మహీంద్రా, ఐఐటీ మద్రాస్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టింది. వైద్య సేవలు, విద్య, ఈ-గవర్నెన్స్ విభాగాల్లోనూ నూతన ఏఐ అనువర్తనాలను తేవడానికి ప్రైవేటు రంగ సంస్థలు పెద్దయెత్తున ముందుకు రావాలి. అందుకు ప్రభుత్వం తగిన చొరవ చూపాలి.
వేగంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి..
'కృత్రిమ మేధ' ఆధారిత అనువర్తనాలను అధికంగా వినియోగిస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. నేర పరిశోధన, వ్యాధుల తీరుతెన్నులు, వాటి తీవ్రత గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో లొసుగుల నివారణ తదితరాల్లో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగపూర్‌లో ఆర్థిక నేరాలను కనుగొనడానికి ఏఐని విరివిగా వినియోగిస్తున్నారు. క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సీటీ స్కాన్, వీడియో చిత్రాలను పరీక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఏఐ పరిజ్ఞానాన్ని వాడుతోంది.
కృత్రిమ మేధ విషయంలో భారత్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని, దానిపై అభివృద్ధి చేసిన అనువర్తనాలను వినియోగించడానికే ఇండియా పరిమితమైంది. పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ద్వారా నూతన అప్లికేషన్లను ఆవిష్కరించే స్థితికి ఇంకా చేరలేదు. ఈ విభాగంలో అగ్రగామి కావాలంటే సొంతంగా నూతన అప్లికేషన్లను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు అందించగలిగే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. పలు దేశాలతో పోలిస్తే భిన్నమైన సమస్యలు ఇండియాలో ఉన్నాయి. అందువల్ల ఆయా దేశాలు ఆవిష్కరించే డిజిటల్ సాంకేతికత పరిష్కారాలన్నీ మన దేశానికి సరిపోకపోవచ్చు. ఈ క్రమంలో మన సమస్యలకు అనువైన రీతిలో సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి. అందుకోసం ఆర్‌అండ్‌డీకి పెద్దపీట వేయాలి. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.