తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సైన్యంలో యువతరం.. తగ్గనున్న ఆర్థిక భారం

సైన్యంలో మూడేళ్ల స్వల్పకాలిక కాలావధి కోసం పనిచేసేందుకు యువతను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ నియామకాలు చేపట్టాలని చూస్తోంది. అయితే ఇప్పటికే ఈ తరహా విధానంలో అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మెరుగైన ఫలితాలనే సాధిస్తున్నాయి. ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా ఆర్థిక భారం తగ్గడమే కాక.. సైన్యంలో సేవలు ముగిసిన అనంతరం యువత దేశం పట్ల, విధుల పట్ల బాధ్యతగా మెలిగే అవకాశం ఉంది.

youth in defence
సైన్యంలో యువతరం.. స్వల్పకాలిక నియామకాలకు సమాలోచనలు

By

Published : May 27, 2020, 7:48 AM IST

రేపటి యుద్ధాలు సైనికులతోకన్నా రోబోలు, డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలతోనే ఎక్కువగా జరగబోతున్నాయి. అందుకే అమెరికా, చైనా తదితర దేశాలు సైనిక బలగాల్ని తగ్గించుకుంటూ, దానివల్ల ఆదా అయ్యే నిధులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. 21వ శతాబ్ది యుద్ధాల్లో పోరాడే సైనికులు సహజంగానే సాంకేతికంగా దిట్టలై ఉండాలి. ఇజ్రాయెల్‌ ఒకవైపు ఆధునిక ఆయుధాలు సమకూర్చుకొంటూనే మరోవైపు యావత్‌ జనాభాకు సాయుధ శిక్షణ ఇస్తూ అధునాతన సైన్యాన్ని, బృహత్తర రిజర్వు పోరాట దళాన్ని ఏర్పాటు చేసుకొంది. ఆ దేశంలో పురుషులకు మూడేళ్లు, మహిళలకు 21 నెలల సైనిక శిక్షణ తప్పనిసరి. ఇజ్రాయెల్‌ సైన్యానికి చెందిన సాంకేతిక విభాగాల్లో పనిచేసినవారు తరవాత ఆ దేశ శాస్త్రసాంకేతిక విభాగాలకు అమూల్య సేవలు అందిస్తున్నారు. టెక్నాలజీ ఎగుమతితో విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు తోడ్పడుతున్నారు. సైనిక శిక్షణ పొందినవారు బయటికొచ్చిన తరవాత వ్యాపార, పారిశ్రామిక, పాలనా రంగాల్లో మేనేజర్లుగా రాణిస్తున్నారు.

తగ్గనున్న ఆర్థిక భారం

కొత్త నియామక పద్ధతి వల్ల ఉన్నత విద్యార్హతలున్న యువతను సైన్యాధికారుల పదవుల్లోకి ఆకర్షించవచ్ఛు వారి మూడేళ్ల సర్వీసు వల్ల సైన్యానికి పింఛను భారమూ తగ్గుతుంది. ఒకే ర్యాంకు, ఒకే పింఛను విధానం వల్ల సాయుధ దళాలపై ఆర్థిక భారం అధికమైన సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన కానీ, 14 ఏళ్ల స్వల్పకాలిక సర్వీసుకు కానీ సైన్యంలో చేరే పద్ధతి ఉంది. మొదటిదాన్ని ‘పర్మనెంట్‌ కమిషన్‌’గా, రెండోదాన్ని ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’గా వ్యవహరిస్తున్నారు. ఇవికాకుండా ఇప్పుడు కొత్తగా మూడేళ్ల ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’ని ప్రతిపాదిస్తున్నారు. కొత్త పద్ధతిలో ప్రయోగాత్మక ప్రాతిపదికపై 100 మంది అధికారులను, 1,000 మంది జవాన్లను తీసుకోవాలని యోచిస్తున్నారు. వీరికి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చి- మిగతా రెండేళ్లు సైన్య సేవలో వినియోగిస్తారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో మూడేళ్లకన్నా తక్కువ సర్వీసు ఉన్న సైనికులు, సైన్యాధికారులు గొప్ప పోరాట పటిమ, శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. ఇటువంటి స్వల్పకాలిక సర్వీసుతోనే ఇజ్రాయెల్‌ వంటి దేశాలు గణనీయ ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ అనుభవాలే భారత సైన్య మూడేళ్ల ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)’ ప్రతిపాదనకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

క్రమశిక్షణతో ఉద్యోగంలో రాణింపు..

మూడేళ్ల టీఓడీ పూర్తి చేసుకున్న యువత సైన్యం నుంచి బయటికొచ్చాక, వారికి ప్రభుత్వ, కార్పొరేట్‌ ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభించవచ్ఛు ప్రభుత్వంలో పాలనా నిర్వహణ ఉద్యోగాలు, భద్రతా సంబంధ ఉద్యోగ నియామకాల్లో టీఓడీ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని సర్కారు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఇలాంటివారికి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమని ఇప్పటికే మహింద్రా గ్రూప్‌ ప్రకటించింది. టీఓడీ పూర్తిచేసినవారికి ఎంబీఏ తదితర పీజీ కోర్సుల ప్రవేశాల్లోనూ ప్రాధాన్యం లభిస్తుంది. సైన్యంలో ఉండగా వారు అలవర్చుకున్న క్రమశిక్షణ, సమస్యా పరిష్కార శక్తి కార్పొరేట్‌ రంగంలో మేనేజర్లుగా రాణించడానికి పునాదిగా ఉపయోగపడతాయి. టీఓడీ అభ్యర్థులకు సైన్యంలో ఉన్నంతకాలం, ఆ తరవాతా- బయటి రంగాల్లో లభించే జీతభత్యాలు, పింఛన్లు, ఇతర సౌకర్యాలకు దీటైన పారితోషికాలు లభిస్తాయి.

సైన్యానికీ ప్రయోజనకరం

టీఓడీ జవాన్లు, అధికారులు సైన్యంలో ఉన్నప్పుడు పోరాటంలో గాయపడినా, మరణించినా సాధారణ సిబ్బంది మాదిరే కుటుంబ పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగి హోదా లభిస్తాయి. మూడేళ్ల సర్వీసుకు సైనికులను, అధికారులనూ తీసుకోవడం వల్ల సైన్యమూ ఆర్థికంగా లబ్ధిపొందుతుంది. గడచిన అయిదేళ్లలో రక్షణ బడ్జెట్‌ 68శాతం, జీతభత్యాల ఖర్చులు 75శాతం చొప్పున పెరిగాయి. పింఛను బిల్లు ఏకంగా 146శాతం ఎగబాకిందని టీఓడీ ప్రతిపాదనల ముసాయిదా పేర్కొంది. ఒక అధికారి పదేళ్లకు సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేస్తే అతడు లేక ఆమె శిక్షణకు, జీతభత్యాలకు, గ్రాట్యుటీ, ఇతర రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలకు, సెలవుల నగదీకరణ ఇతర సౌకర్యాలకు కలిపి సైన్యానికి రూ.5.12 కోట్లు ఖర్చవుతుంది. అదే 14 ఏళ్ల తరవాత రిటైరైతే మొత్తం ఖర్చు రూ.6.83 కోట్లకు పెరుగుతుంది. మూడేళ్ల సర్వీసు (టీఓడీ) తరవాత ఉద్యోగ విరమణ చేసేవారిపై ఖర్చు కేవలం రూ.85లక్షలు. 17 ఏళ్ల తరవాత రిటైరయ్యే సిపాయితో పోలిస్తే మూడేళ్ల సర్వీసు తరవాత రిటైరయ్యే జవాను వల్ల సైన్యానికి రూ.11.5 కోట్లు ఆదా అవుతాయని అంచనా. ఈ లెక్కన కేవలం 1,000 మంది జవాన్లను మూడేళ్ల సర్వీసుకు తీసుకుంటే సైన్యానికి రూ.11,000 కోట్లు ఆదా అవుతాయి. టీఓడీ వల్ల ఆదా అయ్యే భారీ మొత్తాలను మనత్రివిధ సాయుధ బలగాల ఆధునికీకరణకు వెచ్చించవచ్చని ముసాయిదా పేర్కొంటోంది. అందుకే భారత సైన్య అధిష్ఠానం దీన్ని పరిగణిస్తోంది. అలాగని అందరు అధికారులు, సైనికులను మూడేళ్ల సర్వీసుకే రిక్రూట్‌ చేసుకుంటారని కాదు. ఇప్పుడున్న మాదిరిగా ‘పర్మనెంట్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ నియామకాలు జరుగుతూనే ఉంటాయి. మూడేళ్ల సర్వీసు మూలంగా దేశంలో విశాల రిజర్వు పోరాట యోధులు సిద్ధంగా ఉంటారు.

పెరగనున్న ఉత్పాదకత

సైనిక క్రమశిక్షణ పౌర ఉద్యోగాలనూ మరింత ఉత్పాదకంగా మారుస్తుంది. ప్రస్తుతం కంపెనీలు గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సులు పూర్తిచేసిన 22-23 ఏళ్ల యువతను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. వీరు కనుక మూడేళ్ల సైన్య సర్వీసు పూర్తిచేస్తే 26 లేదా 27 ఏళ్లకు బయటికొస్తారు. సైన్యంలో ఉన్నప్పుడు కఠిన శిక్షణతో వారు ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. జట్టు సభ్యుడిగా బాధ్యత, క్రమశిక్షణలతో పనిచేయడం, చొరవగా ముందుకెళ్లడం, నవ్యరీతుల్లో సమస్యను పరిష్కరించడం, మానసిక, శారీరక ఒత్తిళ్లను అధిగమించడం నేర్చుకుంటారు. ఈ గుణాలు రేపు కార్పొరేట్‌ ఉద్యోగాల్లో రాణించడానికీ తోడ్పడతాయి.

పౌరులకు మహదవకాశం

తాజాగా భారత సైన్యం కూడా మూడేళ్ల సైనిక శిక్షణకు ఓటు వేస్తోంది. మున్ముందు రెండు విధాలుగా సైనికుల, అధికారుల నియామకాలు జరపాలని సైన్య ప్రధాన కార్యాలయం రూపొందించిన ముసాయిదా ప్రతిపాదించింది. ఒకటి- యువజనులు స్వచ్ఛందంగా మూడేళ్ల స్వల్పకాలిక సర్వీసులో చేరడం. దీన్ని టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ) అంటున్నారు. రెండు- బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపిఎఫ్‌) రిక్రూట్‌ చేసుకున్న సిబ్బందిని సైన్యంలోకి తీసుకుని ఏడేళ్ల సర్వీసు తరవాత తిరిగి మాతృ బలగాలకు పంపడం. దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి మూడేళ్ల సైన్య నియామకాలు కొంతవరకు తోడ్పడతాయి. దేశభక్తి ఉప్పొంగుతున్నా సైన్యంలో దీర్ఘకాలిక సర్వీసుకు వెనుకాడుతున్న యువజనులకు మూడేళ్ల సర్వీసు ఆకర్షణీయంగా ఉంటుంది. వారి సాహస ప్రవృత్తి, త్యాగ నిరతులను సైన్య సర్వీసు ద్వారా దేశానికి అంకితం చేయగలుగుతారు. సైన్యంలో మూడేళ్ల సర్వీసుకు ప్రభుత్వం సమ్మతిస్తే వైమానిక, నౌకాదళాలూ దాన్ని చేపట్టడానికి సిద్ధమంటున్నాయి.

రచయిత: ఆర్య

ఇదీ చూడండి:'భారత్​ను ప్రపంచం ప్రశంసిస్తుంటే.. కాంగ్రెస్​ తప్పుపడుతోంది'

ABOUT THE AUTHOR

...view details