భూతలంపై జీవజాలం మనుగడ సాగించాలన్నా, పచ్చదనం కనిపించాలన్నా, సుస్థిరాభివృద్ధి పథంలో దేశాలు పయనించాలన్నా- అన్నింటికీ నీరే ప్రాణాధారం. ప్రపంచవ్యాప్తంగా 210 కోట్లమంది రక్షిత మంచినీటి వసతికి నోచుకోని దశలో, 40శాతం జనావళికి నీటి కటకట అనుభవమవుతున్న వేళ ప్రభుత్వాలు మరే మాత్రం నీళ్లు నమలడం సరికాదంటూ 2018-28 నడుమ కాలాన్ని నీటిపై అంతర్జాతీయ కార్యాచరణ దశాబ్దిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మానవాళిలో 18 శాతానికి, జంతుజాలంలో 15 శాతానికి ఆవాసమైన ఇండియాలో అందుబాటులో ఉన్న మంచినీటి వనరులు పట్టుమని నాలుగు శాతమే. దేశీయంగా వార్షిక సగటు వర్షపాతం 1170 మిల్లీమీటర్లుగా ఉన్నా అందులో అయిదోవంతు కూడా ఒడిసిపట్టలేక పోతుండబట్టే ఎకాయెకి 60 కోట్లమంది ఏటా నీటి కొరతతో అలమటిస్తున్నారు.
అవసరాలు రెట్టింపు
2030నాటికి నీటి అవసరాలు రెట్టింపు కానున్నాయని, 2050నాటికి నీటి కొరత కారణంగానే స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతం కోత పడనుందనీ భయానక చిత్రాన్ని ఆవిష్కరించాయి నీతి ఆయోగ్ గణాంకాలు! ఈ నేపథ్యంలోనే- ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టే కార్యాచరణను వచ్చే నవంబరు ఆఖరు దాకా అందరి సహకారంతో పట్టాలకెక్కించేందుకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఆరు లక్షల గ్రామాల సమాహారమైన 734 జిల్లాల్లో వాన నీటి సంరక్షణోద్యమానికి గ్రామీణ ఉపాధి హామీ నిధుల సంపూర్ణ వినియోగానికి ప్రధాని మోదీ భరోసా ఇస్తున్నారు. 256 జిల్లాల్లోని 1592 బ్లాకుల్లో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు గుర్తించగా- వాటిలో తమిళనాడు, రాజస్థాన్, యూపీలతో పాటు తెలంగాణ సైతం ఉంది. రెండు అంచెల్లో వాననీటి సంరక్షణ, నీటి వనరుల పునరుద్ధరణ, వ్యర్థ జలాల శుద్ధి- పునర్వినియోగం, మొక్కల పెంపకం వంటివి- స్థానిక సంస్థలు ప్రజల భాగస్వామ్యంతో సాగాల్సిన పనులు. వ్యక్తికి బహువచనం శక్తిగా జనం కదిలితే కానిదేముంటుంది అసలు?
గతి తప్పుతున్న రుతువులు
'అశోకుడు చెరువులు తవ్వించెను' అని మనం చదువుకొన్నదంతా భూతకాలం. తాతలకాలంనాటి సువ్యవస్థిత నీటి వనరులన్నింటినీ చేజేతులా పాడు చేసుకొని, కబ్జాలతో కాలుష్య వ్యర్థాలతో వాటిని నామరూపాల్లేకుండా చేసిన వర్తమానమంతా- స్వార్థం బుసలు కొట్టే భూతాలకాలమే! దాదాపు 450నదులు ప్రవహిస్తున్న దేశంలో సగం జలరాశి తాగడానికి పనికిరానిదే! రోజూ సగటున 3600 కోట్ల లీటర్ల దాకా విష కాలుష్య వ్యర్థాలు నీటి వనరుల్ని కసిగా కాటేస్తున్న జాతి ద్రోహాన్ని ప్రజాప్రభుత్వాలు మరే మాత్రం ఉపేక్షించే వీల్లేదు. తెలంగాణ మాదిరిగా నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నిబద్ధమైతే- సంఘటిత శక్తితో తమవంతు చేయూతకు ప్రజలూ సంసిద్ధమవుతారనడంలో సందేహం లేదు. అయిదు దశాబ్దాల క్రితంతో పోలిస్తే వర్షపాతంలో 24శాతం తరుగుదల, భూతాపం కారణంగా రుతువులు గతి తప్పి పెరుగుతున్న అతివృష్టి అనావృష్టి పీడ భీతిల్ల చేస్తున్నాయి.
తగ్గుతున్న సగటు నీటి లభ్యత
తలసరి నీటి లభ్యతా అంతకంతకూ తెగ్గోసుకుపోయి, పర్యావరణ సవాళ్లు ముమ్మరిస్తున్న వేళ, దేశ జనావళికి మంచినీటి సరఫరాలో ఆత్మనిర్భరత సాధించాలంటే- కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, పౌరులు ఒక్కతాటి మీదకు రావాలి. ఏటా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు సాధించగలిగారో కచ్చితంగా మదింపు వేసి పారదర్శకంగా ఆ వివరాల్ని అందరికీ అందుబాటులో ఉంచడం, ఖర్చుపెట్టే మొత్తాలకు అధికార యంత్రాంగాన్ని జవాబుదారీ చెయ్యడం సక్రమంగా సాగాలి! ఏటా దేశంలో కురిసే 428 శతకోటి ఘనపుటడుగుల నీటిలో సగాన్ని అయినా శాస్త్రీయ జాతీయ ప్రణాళికతో ఒడిసి పట్టగలిగితే- ఇండియా ధీమాగా పురోగమించగలుగుతుంది. సమర్థ నీటి వినియోగంలో సింగపూర్, ఇజ్రాయెల్, 70శాతం దాకా వ్యర్థజలాల్ని శుద్ధి చేసి పునర్వినియోగానికి మళ్ళిస్తున్న అరబ్ దేశాల సాంకేతికతనూ అందిపుచ్చుకొంటే- ఊరుమ్మడి చొరవ జలసిరుల్ని సాక్షాత్కరింపజేస్తుంది!
ఇదీ చూడండి:'మేలు చేయాలంటే రిజర్వేషన్లేనా!'