సమానత్వానికి సమాధి కట్టే వైయక్తిక చట్టాల స్థానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులోకి రావాలని భారత రాజ్యాంగ నిర్మాతలు ఏనాడో అభిలషించారు. కుల, మత, లింగ దుర్విచక్షణలకు తావివ్వకుండా భారతీయులందరికీ సమన్యాయ ఫలాలు అందాలని ఆకాంక్షించారు. సమష్టి స్మృతిని రూపొందించే మహత్తర బాధ్యతను జాతినేతల భుజస్కంధాలపై మోపుతూ 44వ అధికరణకు ఆయువుపోశారు. దశాబ్దాలుగా తీరని కలగా మిగిలిపోయిన ఆ రాజ్యాంగ ఆదర్శాన్ని సాధించడానికి సత్వరం నడుంకట్టాలని దిల్లీ ఉన్నత న్యాయస్థానం తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సంప్రదాయ అడ్డుగోడలను అధిగమించి కులాంతర, మతాంతర వివాహాలతో ఏకమవుతున్న యువతరానికి వ్యక్తిగత చట్టాల్లోని వైరుధ్యాల చిక్కుముళ్లను తప్పించడమన్నది ఉమ్మడి పౌరస్మృతితోనే సాధ్యమని స్పష్టీకరించింది. మానవ హక్కుల పరిరక్షణే ప్రాతిపదికగా పురుడుపోసుకోవాల్సిన చట్టాలకు మారుగా విశ్వాసాలే ఆలంబనలైన మత శాసనాలు రాజ్యంచేయడం ఆధునిక సమాజానికి అవమానకరం. వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తతలకు సంబంధించి ఒకదానితో మరొక దానికి పొత్తు కలవని వైయక్తిక చట్టాలతో న్యాయమే నవ్వులపాలవుతున్నా- ఉమ్మడి పౌరస్మృతిని నేటికీ పట్టాలెక్కించలేకపోవడం అక్షరాలా ప్రభుత్వాల చేతకానితనం!
అంతరాలకు అతీతంగా అందరినీ ఏక చట్ట ఛత్రఛాయలోకి తీసుకురావడంలో రాజకీయ సంకల్పమే కీలకమని మూడున్నర దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. యావద్దేశం దృష్టిని ఆకర్షించిన ఆనాటి షాబానో కేసుతో పాటు సరళా ముద్గల్(1995), జాన్‌వల్లమట్టం(2003) కేసుల్లో సైతం సమష్టి శాసనావసరాన్ని ఏలికలకు న్యాయపాలిక గుర్తుచేసింది. పౌరులందరికీ వర్తించే యూసీసీపై పలుమార్లు ములుగర్ర పెట్టి పొడిచినా పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని రెండేళ్ల క్రితమూ ఆక్షేపించింది. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కట్టుబడి ఉన్నామని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన మోదీ సర్కారు- విస్తృత సంప్రదింపుల తరవాతే దానిపై ముందడుగేస్తామంటోంది. యూసీసీ అంశాన్ని 22వ న్యాయ సంఘం పరిశీలనకు పంపుతామని నాలుగు నెలల క్రితం లోక్‌సభలో ప్రకటించింది. నూతన లా కమిషన్ ఏర్పాటుకు నిరుడు ఫిబ్రవరిలోనే అనుమతించిన కేంద్రం- అధ్యక్ష, సభ్యులెవరో ఇంకా తేల్చనేలేదు! సంప్రదింపుల పేరిట కాలహరణ వ్యూహాలతో పొద్దుపుచ్చుతున్న పాలకుల ధోరణి సహేతుకం కాదు!