దేశంలో నగర జనాభా నానాటికీ పెరుగుతున్న తరుణంలో ఘన వ్యర్థాల నిర్వహణ ప్రభుత్వాలకు పెను సవాలుగా మారుతోంది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వేల టన్నుల చెత్త పోగుపడుతుండటం వల్ల వ్యర్థాలు కొండల్ని తలపిస్తూ ప్రజారోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 3,159 డంపింగ్ యార్డులు ఉన్నాయి. 2020 జనవరి నాటికి రోజుకు రమారమి 1.47 లక్షల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో గణనీయమైన భాగాన్ని రీసైక్లింగ్ చేసే వీలుంది. పాలకులు, స్థానిక సంస్థల నిర్లక్ష్యంతో అది సాధ్యపడటం లేదు. ఈ ఘన వ్యర్థాలు మట్టిలో కూరుకుపోతూ మానవాళికి అనర్థాలను తెచ్చిపెడుతున్నాయి. ఒక చెత్తకుప్పలో లక్ష టన్నుల వ్యర్థాల నుంచి ఏటా 2,770 టన్నుల మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుందని, ఇది 69,250 టన్నుల బొగ్గు పులుసు ఉద్గారాలకు సమానమని అంచనా.
ప్రభుత్వాలు సఫలీకృతం కావడం లేదు
చెత్త కుప్పలను అశాస్త్రీయంగా దహనం చేయడంతో వాటి నుంచి మంటలు, పొగ వెలువడుతున్నాయి. పరిసరాల్లో కిలోమీటర్ల కొద్దీ గాలి, ఉపరితల, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఇది భూతాపం పెరిగేందుకూ కారణమవుతోంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం మన దేశంలో 77 శాతం వ్యర్థాలను ఆయా నగర, పట్టణపాలక సంస్థలు బహిరంగ చెత్త కుప్పల్లోనే పారవేస్తున్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నా- చాలాచోట్ల తడి, పొడి చెత్తను నగర శివార్లలో పారబోసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే క్రమంలో 'బయో మైనింగ్' ప్రక్రియ తెరపైకి వచ్చింది. నిధుల లేమి తదితర కారణాలతో ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సఫలీకృతం కావడం లేదు.
వ్యర్థాల స్థానంలో ఉద్యానవనాలు
బయోమైనింగ్ ప్రక్రియతో చెత్త కుప్పల రూపం మార్చి పచ్చటి ఉద్యానవనాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇందుకు దేశ, విదేశీ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతతో ముందుకొస్తున్నాయి. ఎన్నో అంకుర సంస్థలూ ఆసక్తి చూపుతున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త నుంచి భూమిలో కరిగిపోయే సేంద్రియ పదార్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి అదే చెత్త కుప్ప ఉన్న చోట అనేక పొరలుగా నేలను చదును చేసి మొక్కలను పెంచడమే బయో మైనింగ్ లక్ష్యం. ఇందుకోసం నిధులు భారీగానే వెచ్చించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చెత్త కుప్పగా ఘనతకెక్కిన ముంబయిలోని దీనార్ డంప్‌సైట్ ప్రక్షాళనకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ రూ.571 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ చెత్త కుప్ప నుంచి విద్యుదుత్పత్తి చేపట్టే ప్రతిపాదనలు ఉన్నా, అంతులేని తాత్సారం జరుగుతోంది. దిల్లీలోని ఘాజిపూర్ డంపింగ్ యార్డులో చెత్త ఎత్తు కుతుబ్‌మినార్‌తో పోటీ పడుతోంది. తెలుగు రాష్ట్రాల విషయంలో ఇక్కడి నగరాల్లోనూ చెత్త కుప్పలు గుట్టలుగా పేరుకుపోవడం వల్ల స్థానిక సంస్థలు నిబంధనల్ని తుంగలో తొక్కి చెత్తను దహనం చేస్తున్నాయి. తెలంగాణలోని నగరాల్లో చెత్త కుప్పల సమస్య తీవ్రతరమైందని వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ 2019లో జాతీయ హరిత ట్రైబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డును బయో మైనింగ్ విధానంలో ఉద్యానవనంలా మార్చే ప్రక్రియ పట్టాలకెక్కింది.
ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా బయోమైనింగ్ విధానం ద్వారా చెత్తకుప్పలను రీసైక్లింగ్ చేయాలని ప్రతిపాదనలు ఉన్నా నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు. వరంగల్ నగర శివారులోని మడికొండ డంపింగ్ యార్డులో బయోమైనింగ్ చేపట్టేందుకు రూ.32 కోట్లతో అంచనాలు రూపొందించినా ఆచరణ అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లోనూ చెత్తకుప్పల నిర్వహణ అరకొరగానే సాగుతోంది. విజయవాడలోని బయోమైనింగ్ ప్రాజెక్టు 2017లో మొదలైంది. 2.5 లక్షల టన్నుల చెత్తను శుద్ధి చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని అనేక నగరాల్లో చెత్తకుప్పలు నిర్వహణ లోపంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఇటీవలే ఏపీ ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని భుజానికెత్తుకుంది. వందరోజుల కార్యాచరణతో రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు శ్రీకారం చుట్టిన ఈ క్రతువులో బయోమైనింగ్ కూడా ఒక భాగమే.
సాంకేతికత తోడుగా...
అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో సరికొత్త సాంకేతికతతోపాటు, పాలకుల చిత్తశుద్ధితో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. అలాంటి విధానాలకు మన దేశంలో అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో పలు డంపుయార్డులు పూదోటలుగా రూపాంతరం చెందడానికి ఆయా నగర పాలక సంస్థల కృషే కారణం. తెలుగు రాష్ట్రాల్లోనూ దీర్ఘకాలిక దృష్టితో చెత్త కుప్పల సమస్యను పరిష్కరిస్తే అటు పర్యావరణ పరిరక్షణతోపాటు, ఇటు ప్రజల ప్రాణాలకూ రక్షణ కలుగుతుంది.
- గుండు పాండురంగశర్మ