తెలంగాణ

telangana

ETV Bharat / opinion

నేరగాళ్ల అభయారణ్యం- ఆగని అత్యాచారాలు! - ముంబయిలో అత్యాచారాలు

నిర్భయ ఘోర ఉదంతం తర్వాత పలు నిబంధనల్లో మార్పులు, చేర్పులు.. ఆసిఫా ఆర్డినెన్స్‌ తదితరాల జారీ, అత్యవసర ఆదేశాల స్థానే సవరణ బిల్లు ఆమోదం వంటివి జరిగాయి. ఐపీసీ సెక్షన్‌ 376, పోక్సో (లైంగిక దాడులనుంచి బాలల రక్షణ చట్టం) సెక్షన్‌ 42ను సవరించారు. లైంగిక నేరాలకు శిక్షల్ని కఠినతరం చేశారు. అయినా అటువంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరి లోపం ఎక్కడుంది?

rapes
అత్యాచారాలు

By

Published : Jul 3, 2021, 8:40 AM IST

'నిర్భయ ఉదంతం నుంచి ఇంకా సరైన పాఠాలు నేర్వలేదు..' పదేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణపై అరెస్టయిన పదిహేనేళ్ల బాలుడికి బెయిల్‌ నిరాకరిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలివి. పదహారేళ్ల లోపు పిల్లల హేయ నేరాల కట్టడిలో కౌమార వయస్కుల సంరక్షణ చట్టం (జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌) ఎందుకూ కొరగానిదవుతోందన్న మాన్య న్యాయమూర్తి జస్టిస్‌ అభయంకర్‌ ఆవేదన సహేతుకమైనది. నేర తీవ్రతతో నిమిత్తం లేకుండా కౌమార ప్రాయంలోని వారికి బెయిల్‌ ప్రసాదించేస్తే బాధితురాలికి రక్షణ ఎక్కడుంటుందన్న సూటిప్రశ్నకు జవాబిచ్చేదెవరు? ఈ కేసులో ఆ కుర్రవాడికి తొలుత జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌, దరిమిలా సెషన్స్‌ కోర్ట్‌, ఆపై ఉన్నత న్యాయస్థానం వరసగా బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించాయి. ఆరేళ్ల క్రితం మద్రాస్‌ హైకోర్టు, నిరుడు పంజాబ్‌ హరియాణా ఉన్నత న్యాయస్థానం వేర్వేరు కేసులలో- కౌమార వయస్కులకు బెయిల్‌ నిరాకరణ సముచితం కాదన్నట్లుగా తీర్పులిచ్చాయి. అది వారి హక్కుగా పరిగణించడం సరి కాదంటూ ఆమధ్య సూరత్‌ కోర్టు గిరిగీయడం సంచలనం సృష్టించింది.

ఇప్పుడు మధ్యప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానమూ అదే బాణీకి గట్టి మద్దతు పలకడమే కాదు- జేజే యాక్ట్‌ క్షాళన సాకారం కావడానికి మరెందరు నిర్భయల బలిదానం అవసరమని నిగ్గదీసింది. వాస్తవానికి 2015 నాటి ఆ చట్టానికి అయిదు నెలలక్రితమే కేంద్ర మంత్రిమండలి వివిధ సవరణలు ప్రతిపాదించింది. చిన్నారుల సంరక్షణకు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు, చట్టం అమలు బాధ్యతలు నిర్వర్తించే సంస్థల పనితీరును పర్యవేక్షించే అధికారాన్ని ఇకమీదట జిల్లా మేజిస్ట్రేట్‌కు లేదా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు దఖలు పరుస్తున్నట్లు అప్పట్లో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు స్మృతీ ఇరానీ వెల్లడించారు. ఆ కసరత్తులో అత్యంత కీలకాంశం మరుగున పడిందని ఇండోర్‌ బెంచ్‌ తాజా స్పందన స్పష్టీకరిస్తోంది!

చట్టాల్లో మార్పులు చేసిన..

మూడేళ్లక్రితం బాంబే ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు- 'అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన జీవితకాలం కొనసాగుతుంది.. హత్యకన్నా అత్యాచారమే దారుణమైన నేరం'! అటువంటి కిరాతకానికి ఒడిగడుతున్నవాళ్లలో మైనర్‌ బాలురు ఉండటం విషసంస్కృతి పెచ్చరిల్లుతున్నదనడానికి ప్రబల నిదర్శనం. నిర్భయ ఘోర ఉదంతం తరవాత పలు నిబంధనల్లో మార్పులూ చేర్పులు, ఆసిఫా ఆర్డినెన్స్‌ తదితరాల జారీ, అత్యవసర ఆదేశాల స్థానే సవరణ బిల్లు ఆమోదం.. చోటుచేసుకున్నాయి. ఐపీసీ సెక్షన్‌ 376కు, పోక్సో (లైంగిక దాడులనుంచి బాలల రక్షణ చట్టం) సెక్షన్‌ 42కు మార్పులు చేపట్టారు. లైంగిక నేరాలకు శిక్షల్ని కఠినతరం చేశారు. కథువా(జమ్మూకశ్మీర్‌)లో ఎనిమిదేళ్ల బాలికపై అమానుష దాడి నేపథ్యంలో పన్నెండేళ్లలోపు పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించే కామాంధులకు జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే నిబంధనావళిని క్రోడీకరించారు.

నేరన్యాయ చట్రాన్ని పరిపుష్టీకరించామంటున్నా మునుపటికన్నా అధికంగా అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఏమిటని గర్హించిన సుప్రీంకోర్టు ఏడాదిన్నర క్రితం సు మోటోగా విచారణ చేపట్టింది. చేశామన్న సంస్కరణలేవీ ఫలించలేదని అప్పట్లో చీఫ్‌జస్టిస్‌ బాబ్డే సారథ్యాన త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. 'నిర్భయ' శాసనం రూపశిల్పి జస్టిస్‌ జేఎస్‌వర్మ లోగడే కుండ బద్దలు కొట్టినట్లు- చట్టాలు చట్టుబండలైనందువల్లే దేశంలో అభద్ర వాతావరణం నెలకొంటోంది. చట్టాల పటిష్ఠ అమలు, కాలానుగుణంగా పకడ్బందీ సవరణలే నేరాల ప్రజ్వలనాన్ని శాయశక్తులా నియంత్రించగలిగేది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ ప్రభృత దేశాలు కౌమార ప్రాయాన్ని 9-16 ఏళ్లుగా పరిగణించి బాల నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడ ఉదారవైఖరి, మృగవాంఛల్ని రెచ్చగొట్టే అశ్లీల వెబ్‌సైట్ల ఉరవడి.. మైనర్లనూ హేయనేరాలకు పురిగొల్పుతున్నాయి. తప్పు చేస్తే ఎవరినీ కనికరించేది లేదన్న భీతి కలిగించడంతోపాటు- రేపటి తరానికి రుజువర్తన సభ్యత సంస్కారాలు అలవడేలా పాఠశాల స్థాయినుంచే నైతిక విద్యాబోధన చురుకందుకోవాలి!

ఇదీ చూడండి:'న్యాయవ్యవస్థను రక్షించే బాధ్యత లాయర్లదే'

ABOUT THE AUTHOR

...view details