దేశంలోని రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. వందల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యపూరిత రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 1.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీటిలో సగటున రోజుకు 328 మంది అసువులు బాశారు. రోడ్లపై వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా గడచిన మూడేళ్లలో దాదాపు 3.29 లక్షల మంది మరణించారు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొన్న (హిట్ అండ్ రన్) కేసులు భారత్‌లో 2018 నుంచి 1.35 లక్షలు నమోదయ్యాయి. గతేడాదే ఇవి 41వేలకు మించిపోయాయి. 2019లో భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లో 1.36 లక్షల మంది మృత్యువాతపడ్డారు. రెండేళ్ల కిందటితో పోలిస్తే నిరుడు ప్రమాదాలు దాదాపు 13శాతం తగ్గాయి. కరోనా లాక్‌డౌన్ల వల్ల చాలా రోజులు వాహనాలు రోడ్లపైకి రాకపోయినా గతేడాది అంత పెద్దమొత్తంలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళనకరమే! నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడిపి ఇతరులను గాయపరచిన ఘటనలు పోయిన సంవత్సరం 1.30 లక్షలు నమోదయ్యాయి. సగటున రోజూ 112 హిట్ అండ్ రన్ కేసులు వెలుగుచూశాయి.
అతివేగం ప్రధాన శత్రువు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఇండియాలో ఒక శాతమే తిరుగుతున్నా, రోడ్డు ప్రమాదాల్లో మాత్రం విశ్వవ్యాప్తంగా 11శాతం మరణాలు భారత్‌లోనే చోటుచేసుకుంటున్నట్లు గతంలో ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. రహదారులే ఆయువులను మింగేస్తున్న ఘటనల పరంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. సగటున ప్రతి గంటకు దేశంలో 53 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. వీటిలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. గత దశాబ్దంలో భారత్‌లో రోడ్డు ప్రమాదాల వల్ల 13 లక్షల మంది అసువులు బాయగా, మరో 50 లక్షల మంది గాయపడ్డారు. దీని వల్ల దేశార్థికానికి దాదాపు రూ.5.96 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. జీడీపీలో ఇది 3.14శాతానికి సమానం. కేంద్రం లెక్కల ప్రకారం రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్నవారు 75 శాతానికి పైగా 18-45 ఏళ్ల లోపు వారే. ఫలితంగా దేశం ఏటా విలువైన శ్రామిక శక్తిని కోల్పోతోంది.
సంపాదనపరులైన ఇంటి యజమానులు అకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. గాయపడిన వారి కుటుంబాలు వైద్య ఖర్చులతో అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు పాదచారులకు సైతం శాపంగా పరిణమిస్తున్నాయి. మృతుల్లో సుమారు 78శాతం ద్విచక్ర వాహనదారులు, పాదచారులే! అధిక శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, అడ్డదారుల్లో చొరబడటంవల్లే చోటుచేసుకొంటున్నాయి. 70శాతం మరణాలకు అతి వేగమే కారణం. దేశంలో కొవిడ్ కల్లోలం కన్నా రహదారి ప్రమాదాలు మరింత నష్టదాయకంగా మారాయని ఇటీవల కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి వైద్యానికి సగటున రూ.3.64 లక్షలు, కొద్దిపాటి గాయాలపాలైనవారికి రూ.77వేల వరకు ఖర్చవుతోంది. ఎన్‌సీఆర్‌బీ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 6,288 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో వీరి సంఖ్య 6,415. ఏపీలో 491 హిట్ అండ్ రన్ కేసులు నమోదవగా, తెలంగాణలో వాటి సంఖ్య 1332. ఏపీతో పోలిస్తే ఇవి రెండున్నర రెట్లు అధికం.