తెలంగాణ

telangana

ETV Bharat / opinion

న్యాయస్థానాల్లో పెండింగుల్లోనే లక్షల కేసులు! - pending cases latest news

దేశంలోని న్యాయస్థానాల్లో కొన్నేళ్లుగా 43లక్షలకు పైగా కేసులు పెండింగులో మూలుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఏడాది క్రితం రాజ్యసభకు సమర్పించిన నివేదిక తెలియజేస్తుంది. అయితే సత్వర న్యాయం మానవ హక్కుల్లో అంతర్భాగమని, నేర విచారణను వేగిరం చేయకపోవడం వ్యక్తిస్వేచ్ఛను హరించడమేనని సుప్రీంకోర్టే స్పష్టీకరించినా..సత్వర న్యాయం ఎండమావిని తలపిస్తోందన్నది వాస్తవం.

An analysis story on pending cases in high courts
న్యాయస్థానాల్లో పెండింగుల్లో 43లక్షల కేసులు!

By

Published : Jul 1, 2020, 8:29 AM IST

భారత న్యాయ వ్యవస్థ కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు సమస్య- అపరిష్కృత వ్యాజ్యాలు భారీయెత్తున పోగుపడుతుండటం. పర్యవసానంగా, దేశంలో నేర న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు విశ్వసనీయతకు నిలువెల్లా తూట్లు పడుతూ, సత్వర న్యాయం ఎండమావిని తలపిస్తోందన్నది నిష్ఠుర సత్యం. కేంద్ర న్యాయమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఏడాది క్రితం రాజ్యసభకు నివేదించిన సమాచారం ప్రకారం- 25 హైకోర్టుల్లో సుమారు 43 లక్షల కేసులు పెండింగులో పడి మూలుగుతున్నాయి. అందులో పదేళ్లకుపైగా మోక్షం కోసం నిరీక్షిస్తున్నవి ఎనిమిది లక్షల పైమాటే.

ఏడాదిలో 47లక్షలకు..

ఏడాది వ్యవధిలో 25 ఉన్నత న్యాయస్థానాల్లో అపరిష్కృత వ్యాజ్యాల సంఖ్య 47లక్షలకు ఎగబాకిందని, వాటిలో దశాబ్దానికిపైగా ఎదురుతెన్నులకే పరిమితమైనవి 9.2లక్షలకు విస్తరించాయని జాతీయ న్యాయ సమాచార గ్రిడ్‌ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సమగ్ర చిత్రం మరింతగా ఆందోళన పరుస్తోంది. దేశవ్యాప్తంగా హైకోర్టులు, జిల్లా, తాలూకా న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల రాశి 3.77కోట్లకు పెరిగింది. పదేళ్లుగా నలుగుతున్న వ్యాజ్యాలు 37 లక్షలు (10శాతం). ఇరవై ఏళ్లకు పైబడినవి ఆరు లక్షల అరవై వేల కేసులు. మూడు దశాబ్దాలకు మించి అపరిష్కృతంగా ఉన్నవే లక్షా 31వేలు.

ముందుకు రావాలి!

పరిస్థితి తీవ్రతను గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం పెండింగ్‌ క్రిమినల్‌ అప్పీళ్లపై వివరణాత్మక కార్యాచరణతో ముందుకు రావాలని అలహాబాద్‌, బాంబే, మధ్యప్రదేశ్‌, పట్నా, ఒరిస్సా, రాజస్థాన్‌ హైకోర్టుల్ని ఆదేశించింది. వాస్తవానికిది కొన్ని ఉన్నత న్యాయస్థానాల పరిధిలోని అంశం కాదు. దిగువస్థాయి నుంచీ పైదాకా పెండింగ్‌ కేసుల జాడ్యం పెచ్చరిల్లడానికి అనేక అంశాలు పుణ్యం కట్టుకుంటున్నాయి. వాయిదాలపై వాయిదాలు, కాలం చెల్లిన విచారణ పద్ధతులు, న్యాయమూర్తుల కొరత, రికార్డుల కంప్యూటరీకరణలో విపరీత జాప్యం... సత్వర న్యాయానికి ప్రతిబంధకాలవుతున్నాయి!

ఇతర దేశాల్లో అలా..

ఆధునిక న్యాయవిద్యా పితామహుడిగా పేరొందిన ఎన్‌ఆర్‌ మాధవ మీనన్‌- పౌరుల ధనమాన ప్రాణాల భద్రతకు పూచీ పడాల్సిన నేర న్యాయ వ్యవస్థ లక్షిత ప్రయోజనాల సాధనలో విఫలమవుతోందని నాలుగేళ్ల క్రితం సూటిగా తప్పుపట్టారు. నేరగాళ్ల ఉరవడిని అడ్డుకునేలా- జర్మనీ, ఫ్రాన్స్‌ తరహాలో జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నేర దర్యాప్తుల్ని పర్యవేక్షించే అధికారాలు కలిగి ఉండాలని జస్టిస్‌ మలీమత్‌ కమిటీ సూచించినా చెవొగ్గిందెవరు? దోషులు కొరమీనుల్లా చేజారిపోయే వీల్లేకుండా, నేర పరిశోధనలో అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో తిరుగులేని రుజువుల సమీకరణకు బ్రిటన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ వంటివి ప్రాధాన్యమిస్తున్నాయి.

బ్రిటన్​ తనదైనా ఒరవడితో..

27 ఏళ్లక్రితం మన్‌హటన్‌ మిడ్‌టౌన్‌లో ఆవిష్కృతమైన కమ్యూనిటీ కోర్టు భావన అమెరికాలో న్యాయ వివాదాల ముఖచిత్రాన్నే మార్చేసింది. మధ్యవర్తిత్వానికి పెద్దపీట వేసి కోర్టులపై వ్యాజ్యాల ఒత్తిడిని అమెరికా నియంత్రించగా, పౌరశ్రేయస్సాధకంగా సివిల్‌ ప్రొసీజర్‌ చట్టం రూపొందించి అవసరార్థులకు న్యాయసేవల ప్రదానంలో బ్రిటన్‌ తనదైన ఒరవడి దిద్దింది. దశాబ్దాలుగా ప్రజాన్యాయస్థానాల స్ఫూర్తికి అగణిత ప్రాధాన్యమిస్తున్న చైనా, ఆధునిక సవాళ్లకు దీటుగా వివిధ అంచెల కోర్టుల్ని అనుసంధానించి నెలల వ్యవధిలో శిక్షలు ఖరారు చేసి అమలు పరుస్తోంది!

సత్వర న్యాయం మానవ హక్కుల్లో అంతర్భాగమని, నేర విచారణను వేగిరం పూర్తి చేయకపోవడం వ్యక్తిస్వేచ్ఛను హరించడమేనని సాక్షాత్తు సుప్రీంకోర్టే స్పష్టీకరించినా- వ్యవస్థాగతమై వర్ధిల్లుతున్న అలసత్వం న్యాయార్థుల్ని చెండుకు తింటోంది. విచారణ ప్రక్రియ ఏళ్లూపూళ్లూ కొనసాగకుండా నిర్దిష్ట గడువులో కేసులు ఒక కొలిక్కి వచ్చేలా చట్టాల్ని, సమస్త విధివిధానాల్ని ప్రక్షాళించే వరకు... దేశంలో న్యాయార్థుల దీనావస్థ అంతులేని కథే!

ఇదీ చూడండి:బలగాలు వెనక్కి తీసుకోవాలని చైనాకు భారత్ స్పష్టం

ABOUT THE AUTHOR

...view details