తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'స్టార్స్​'తో బడి చదువుకు పదును..! - vocational courses in India

మన విద్యా వ్యవస్థలో విద్యకు, ఉపాధి అవకాశాలకు సారూప్యత తక్కువగా ఉందని.. వృత్తివిద్యను విస్తరించి విద్యార్థి దశలోనే వివిధ వృత్తులలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. తదనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, పాఠ్యాంశాల దిశగా నూతన జాతీయ విద్యావిధానంలో భారీస్థాయి కసరత్తు జరిగింది. అందరిలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న నూతన జాతీయ విద్యావిధానం-2020 అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. అయితే ఈ చట్టం అమలులో సమస్యలు ఉన్నాయా?

An Analysis story on new education policy implementation
బడి చదువుకు పదును- 'స్టార్స్‌'తో లక్ష్య సాధనకు శ్రీకారం

By

Published : Nov 16, 2020, 11:20 AM IST

అందరిలో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న నూతన జాతీయ విద్యావిధానం-2020 అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టగా, తదుపరి దశలో పాఠశాల విద్యపై కసరత్తు ప్రారంభించింది. భారతీయ మూలాలను గుర్తెరిగి, ప్రపంచీకరణను అనుసంధానం చేస్తూ మానవ విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవడేందుకు- పాఠశాల విద్య దశలోనే పిల్లల్లో ప్రజ్ఞాపాటవాల్ని పెంచి, వివేకవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బోధన అభ్యసన ఫలితాలను బలోపేతం చేసే దిశగా 'స్ట్రెంతెనింగ్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ అండ్‌ రిజల్ట్స్‌ ఫర్‌ స్టేట్స్‌(స్టార్స్‌)' అనే ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 'స్టార్స్‌' ప్రాజెక్టుకు రూ.5,718 కోట్లు అంచనా వ్యయం కాగా ప్రపంచబ్యాంకు ఈ కార్యక్రమానికి రూ.3,700 కోట్లమేర సహాయం అందించనుంది. బట్టీపట్టి చదివి పరీక్షలు రాయడం కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం/అభ్యసించడం అనే ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి జావడేకర్‌ ఇటీవల పేర్కొన్నారు. ఇందులో విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేని విద్యా బోధన పద్ధతులతో సమూల మార్పులు తీసుకురానున్నట్లు వివరించారు. ప్రస్తుత విద్యావిధానంలో విద్యార్థులు అందుకుంటున్నవి మార్కుల షీట్లు కావని, అవి ప్రెషర్‌ షీట్లని ఇటీవల '21వ శతాబ్దం పాఠశాల విద్య'పై సదస్సులో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకగా ఈ స్టార్స్‌ నిలుస్తుంది.

ఒత్తిడి తగ్గించడమే ముఖ్యం

విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో కొంతకాలంగా ఆనందకర బోధన పద్ధతులపై దృష్టిపెట్టిన ఉపాధ్యాయులు, మనస్తత్వ నిపుణులు, మేధావులు నూతన జాతీయ విద్యావిధానానికి పలు సూచనలు చేశారు. చదువుకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక చిన్న సమస్యలకే మానసిక స్థిరత్వం కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య దశాబ్దికాలంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థి తరగతి గదికి బందీ అయి సృజనాత్మక, విమర్శనాత్మక అభ్యసనాన్ని కోల్పోతున్నాడు. సరైన శారీరక ఆరోగ్యం లేకపోతే దాని ప్రభావం పిల్లల అభ్యసన సామర్థ్యంపై పడుతుందని మనస్తత్వ నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా మన విద్యాలయాల్లో ఆటస్థలాలు/మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయుల కొరత వెంటాడుతూనే ఉంది.

మన విద్యా వ్యవస్థలో విద్యకు, ఉపాధి అవకాశాలకు సారూప్యత తక్కువగా ఉందని... వృత్తివిద్యను విస్తరించి విద్యార్థి దశలోనే వివిధ వృత్తులలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. తదనుగుణంగా పాఠ్య ప్రణాళికలు, పాఠ్యాంశాల దిశగా నూతన జాతీయ విద్యావిధానంలో భారీస్థాయి కసరత్తు జరిగింది. సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, అభ్యసనను పరిశ్రమలకు అనుసంధానం చేయడం, ప్రాథమిక విద్య మాతృభాషా బోధన వంటి అంశాలపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి 15 లక్షలకుపైగా సూచనలు అందడం దేశ ప్రజలకు విద్యావ్యవస్థపై నిబద్ధతను తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2030 తరవాత సమగ్ర శిక్షణ పొందినవారు మాత్రమే ఉపాధ్యాయ నియామకాలకు అర్హులని స్పష్టం చేసింది. 'స్టార్స్‌' కార్యక్రమంలో భాగమైన స్వయంప్రతిపత్తిగల 'సమగ్ర అభివృద్ధి కోసం సామర్థ్య అంచనా సమీక్ష, జ్ఞాన విశ్లేషణ’ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, బోర్డులకు విద్యార్థుల పనితీరు అంచనా, మూల్యాంకన కోసం నిబంధనలు నిర్దేశిస్తుంది. మొదట హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో పాఠశాలల పరివర్తన వ్యూహాలు మెరుగు పరచడం, తమ అనుభవాలను ఇతర రాష్ట్రాలతో పంచుకునేలా ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.

సవాళ్లు ఎదుర్కోవాల్సిందే..

సరైన రహదారులు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో పాఠశాలల మూసివేత, ఉపాధ్యాయ, మౌలిక సదుపాయాల కొరత వంటివి అధిగమించడం నూతన విద్యావిధానం ముందున్న సవాలు. ఈ సమస్యను సమర్థంగా అధిగమించడం కోసం సాంకేతికతను వినియోగించి 'రిమోట్‌ లెర్నింగ్‌' ప్రక్రియను సులభతరం చేయడం, డిజిటల్‌, వర్చువల్‌ బోధనను క్రమేపీ సమర్థంగా విస్తరించే డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు లక్ష్యాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా ‘స్టార్స్‌’ పథకం/వ్యవస్థ ప్రధాని ఈ-విద్య, జాతీయ పాఠ్యాంశాల బోధన, తృతీయ భాష- ఆంగ్లంలో కనీస నైపుణ్యాలు సాధించడంపై దృష్టి పెడుతుంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉండడంతో ఒక దేశం ఒకే విద్యావ్యవస్థను తీసుకొచ్చే విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. భిన్న సంస్కృతులు, విభిన్న భాషలుగల మనదేశంలో భాషకు సంస్కృతి ముడివడి ఉన్నందువల్ల ప్రపంచీకరణతో పోటీ పడాలంటే కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ మహమ్మారి విద్యా ప్రణాళికను అస్తవ్యస్తం చేసిన ప్రస్తుత తరుణంలో జాతీయ నూతన విద్యావిధానం మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య విద్యావ్యవస్థలో సమూల మార్పులు తేవాలంటే దేశవ్యాప్తంగా అన్ని బోర్డులు, విద్యాసంస్థలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరస్పర అవగాహనతో సమష్టి ప్రణాళికతో ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలి. అప్పుడే జాతీయ నూతన విద్యావిధానం మంచి ఫలితాలు అందుకోవడంతోపాటు, ఐక్యరాజ్య సమితి లక్ష్యమైన 2030 నాటికి శతశాతం అక్షరాస్యతను సాధించడం సాధ్యమవుతుంది!

రచయిత- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం

ABOUT THE AUTHOR

...view details