తెలంగాణ

telangana

ETV Bharat / opinion

తరుగుతున్న ప్రాణవాయువు- మానవ మనుగడకు ముప్పు - ఆక్సిజన్​ కొరత

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్​కు గిరాకీ పెరిగింది. దాని అవసరం అందరికీ తెలిసొచ్చింది. ఒకప్పుడు పుష్కలంగా లభించే ప్రాణవాయువు.. ఇప్పుడు తగ్గుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానవ మనుగడకు ముప్పు వాటిల్లక తప్పదని కొన్ని నివేదికలు బల్లగుద్ది చెబుతున్నాయి. దీంతో ఈ పరిస్థితి దాపరించడానికి కారణాలేంటో విశ్లేషించి.. చర్యలు చేపట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Oxygen
ఆక్సిజన్​

By

Published : Apr 30, 2021, 8:56 AM IST

సమస్త ప్రాణికోటి మనుగడకు మూలాధారం ఆక్సిజన్‌. మానవ శరీరం ఊపిరితిత్తుల ద్వారా పీల్చిన ప్రాణవాయువు ఎర్ర రక్త కణాలకు చేరి అక్కడి నుంచి శరీరంలోని ఇతర భాగాలకు నిరంతరం సరఫరా అవుతుంది. జీవకణాల్లోని లోటుపాట్లను సరిదిద్ది ప్రతికణం తన జీవక్రియలను సక్రమంగా నెరవేర్చడానికి తోడ్పడుతుంది.

భూమిపై చెట్ల ద్వారానే ప్రాణవాయువు లభిస్తుందని చాలామంది భావిస్తారు. వాస్తవానికి సముద్ర మొక్కలు, మొక్కల్లాంటి జీవుల నుంచి 70 శాతం, వర్షారణ్యాల ద్వారా 28 శాతం, మిగిలిన రెండు శాతం ఆక్సిజన్‌ ఇతర వనరుల నుంచి వాతావరణంలోకి విడుదలవుతుంది. అంటే, ఈ ధరాతలానికి సంద్రమే ప్రాణవాయువు దాత. మరోవైపు, భూవాతావరణంలో దాదాపు 78 శాతం నత్రజని, 21 శాతం ఆక్సిజన్‌, 0.93 శాతం ఆర్గాన్‌, 0.04 శాతం బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌) ఉంటే, 0.03 శాతం మేరకు నియాన్‌, హీలియం, మీథేన్‌, క్రిప్టాన్‌, హైడ్రోజన్‌, నీటిఆవిరి తదితరాలు ఉంటాయి. హవాయిలోని మౌనా లోవా పరిశోధనాలయం తాజా అధ్యయనం ప్రకారం, వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వాటా ప్రమాదకరంగా విస్తరిస్తోంది! 1900-50 మధ్య కాలంలో దీని పరిమాణం 295 నుంచి 310 పీపీఎంకు (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) పెరిగితే, 1960-2020 మధ్య 317 నుంచి 416 పీపీఎంకు చేరింది.

అంటే, మొదటి అర్ధశతాబ్దంలో 15 పీపీఎం మేరకే పెరిగిన బొగ్గుపులుసు వాయువు, ఆ తరవాత 60 ఏళ్లలో ఏకంగా 99 పీపీఎం దాకా అధికమైంది! వాతావరణంలో 400 పీపీఎం వరకే ఉండాల్సిన కార్బన్‌ డయాక్సైడ్‌, ఆ పరిమితిని దాటి మేటవేయడం 2015 నుంచి మొదలైంది. ఇది నిరుటికి ఇంకా అధికమై, 416 పీపీఎం దగ్గరికి వచ్చింది. 1960ల తరవాత ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ ఊపందుకోవడం, దానికి సమాంతరంగా శిలాజ ఇంధన దహనం పెరగడం.. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పరిమాణం పెంపునకు మూలకారణాలు. ఈ పరిస్థితి ఇలాగే సాగితే 2025-2100 మధ్య గాలిలో ఈ వాయువు వాటా 470 నుంచి 950 పీపీఎంకు చేరుతుందని అంచనా! భూవాతావరణం మరింత వేడెక్కడానికి, తద్వారా తీవ్ర పరిణామాలకు ఇది హేతువు కాబోతోంది.

అలాగైతే.. మానవ మనుగడే దుర్లభమే

వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరుతున్న బొగ్గుపులుసు వాయువు.. నత్రజని, ఆక్సిజన్‌ల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రాణవాయువును తగ్గిస్తుంది. అమెరికాలోని ప్రిన్స్‌స్టన్‌ విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం గడచిన పది లక్షల సంవత్సరాల్లో వాతావరణంలోని ఆక్సిజన్‌ పరిమాణం 0.7 శాతం తరిగిపోయింది. ఈ తగ్గుదల అంతకంతకూ అధికమవుతోందన్న విషయమూ వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఈ 0.7 శాతం క్షీణత, జీవజాలానికి అపాయకరం కాలేదు. కానీ, వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే ప్రాణవాయువు తరుగుదల వేగం పుంజుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అప్పుడు శ్వాస సమస్యలతో జీవకోటి అల్లాడిపోతుంది. గాలిలో ఆక్సిజన్‌ సాంద్రత 19.5 శాతం ఉంటేనే మానవ శ్వాస సాఫీగా సాగుతుంది. ఒకవేళ ఇది 16 శాతానికి పడిపోతే- జీవకణాలు ప్రాణవాయువును స్వీకరించడంలో విఫలమవుతాయి కాబట్టి అధిక శారీరక శ్రమ చేయడానికి వీలుపడదు. అదే 14 నుంచి 10 శాతానికి తగ్గితే ఎలాంటి శ్రమనూ శరీరం తట్టుకోలేదు. మానసిక సమస్యలూ ముప్పిరిగొంటాయి. ఆక్సిజన్‌ సాంద్రత ఆరు శాతం కంటే దిగువకు చేరితే మానవ మనుగడే దుర్లభమవుతుంది.

వివిధ కారణాల రీత్యా కడలి ఉష్ణోగ్రతలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. ఫలితంగా సముద్ర మొక్కలు క్షీణిస్తున్నాయి. కెనడాలోని డల్హౌసీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం 1950ల తరవాత ఈ మొక్కలు 40 శాతం తగ్గిపోయాయి. ఫలితంగా వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువు అలాగే ఉండిపోతుండటంతో భూఉపరితల ఉష్ణోగ్రతలు మరీ వేడెక్కుతున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సముద్ర మొక్కలను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను విచ్చలవిడిగా పారేయడం నుంచి అనేక కాలుష్యకారక చర్యలను అరికట్టకపోతే బొగ్గుపులుసు వాయువును గ్రహించే సముద్ర మొక్కల పరిమాణం ఇంకా దిగజారిపోవచ్చు. ఈ ముప్పును తప్పించాలంటే కార్బన్‌ డయాక్సైడ్‌ను అధికంగా విడుదల చేసే శిలాజ ఇంధన దహనాలు, శుద్ధి చేయని పరిశ్రమల వ్యర్థాల పారబోతనూ కఠినంగా నియంత్రించాలి. ప్రతి ప్రాంతంలోనూ 33 శాతం విస్తీర్ణం మేర పచ్చదనం పరచుకునేలా చూడాలి. యుద్ధప్రాతిపదికన ఈ కృషి ప్రారంభించకపోతే భవిష్యత్తులో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు ఇంకా పెరిగి, ప్రాణవాయువు తరిగిపోతుంది. పీల్చే గాలి సైతం విషతుల్యమయ్యే ఆ పెనుప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వాలు సత్వరం సన్నద్ధం కావాలి! ప్రజలూ తమవంతుగా కాలుష్య నియంత్రణకు నడుంకట్టాలి!

రచయిత - ఆచార్య నందిపాటి సుబ్బారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు

ABOUT THE AUTHOR

...view details