తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మానసిక రోగుల వేదన ప్రభుత్వాలకు పట్టదా?

సగటు వ్యక్తి జీవితంలో శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండు కీలకమే. మానసిక ఆరోగ్యం దారితప్పితే జీవితం గాడితప్పినట్లే. ప్రస్తుతం కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా మానసికంగా కుంగుపోయి... మత్తుకు బానిసలుగా మారడం సహా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఇంతలా బాధిస్తున్న మానసిక ఆరోగ్య సమస్యలపై భారత్​ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

An analysis story on mental health of Indian people
మానసిక రోగుల వేదన ప్రభుత్వాలకు పట్టదా!

By

Published : Dec 4, 2020, 8:11 AM IST

జీవితం సరైన దారిలో నడవాలంటే శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ అవసరమే. ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా జీవనం కుంటువడినట్లే. వ్యక్తి మానసిక దృఢత్వం- శారీరక అనారోగ్యాన్ని జయించేందుకు తోడ్పడుతుంది. కానీ, మానసికంగా అవకరానికి గురైతే జీవనం క్లిష్టతరమవుతుంది. మన దేశంలో మానసికారోగ్యానికి సరైన ప్రాధాన్యం లభించడంలేదు. మానసిక రుగ్మతల్లో సగం- వ్యక్తికి 14 ఏళ్ల వయసు వచ్చే ముందే తొలి సంకేతాలను చూపుతాయి. మూడొంతుల రుగ్మతలు 24 ఏళ్లకు ముందే ప్రారంభమవుతాయి. కౌమార దశలో 20శాతం కంటే తక్కువ, పెద్దల్లో 44శాతం వరకు మాత్రమే ప్రజలకు అవసరమైన చికిత్స లభిస్తోంది. వైద్యపరంగా ఎంతో పురోగతిలో ఉన్న అమెరికాలో ప్రతి అయిదుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతి 25 మందిలో ఒకరు స్కిజోఫ్రెనియా, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి తీవ్రమైన మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు.

ప్రాధాన్యమివ్వని రాష్ట్రాలు

భారతదేశంలో ప్రతి 20 మందిలో ఒకరు 'కుంగుబాటు'తో బాధపడుతున్నారని జాతీయ మానసికారోగ్య వ్యూహం (ఎన్‌ఎంహెచ్‌ఎస్‌) 2015-16 అధ్యయనంలో రుజువైంది. మానసిక సమస్యలతో మత్తు పదార్థాల వాడకమూ పెరుగుతోంది. తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉన్నవారిలో మూడు నుంచి అయిదు శాతం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నట్లు అంచనా. 'లాన్‌సెట్‌ సైకియాట్రీ' 2017లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశ జనాభాలో 14.3శాతం మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం- 2019లో 1,39,123 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి 3.4శాతం పెరిగాయి. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్హాన్స్‌)’ 2015-16 దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనం ప్రకారం 15 కోట్లమంది భారతీయులకు చురుకైన మానసిక ఆరోగ్యం అవసరం. ఇందులో చికిత్స పొందుతున్నవారు మూడు కోట్ల మంది కంటే తక్కువే.

తక్కువ బడ్జెట్ కేటాయింపులు

భారత్​ ప్రస్తుతం తన మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో మానసికారోగ్యం కోసం వెచ్చిస్తున్నది అతి స్వల్పం. అది కూడా పూర్తిగా వ్యయం కావడంలేదు. గత ఏడాది రూ.62,398 కోట్ల ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌లో, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాలకు నిధుల కేటాయింపు రూ.50 కోట్ల నుంచి రూ.40 కోట్లకు తగ్గింది. అంటే దేశ ఆరోగ్య బడ్జెట్‌లో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం కేటాయిస్తున్నది 0.06శాతం. మానసిక రుగ్మతలకు చికిత్స చేసే నిపుణుల కొరత చాలా ఉంది. దేశంలో ప్రతి కోటిమంది మానసిక రోగులకు 30 మంది మానసిక వైద్యులు, 17 మంది నర్సులు, అయిదుగురు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఉన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం- దేశంలో కనీసం 13,500 మంది మానసిక వైద్యనిపుణు(సైకియాట్రిస్ట్‌)ల అవసరం ఉంటే, 3,800 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. భారతదేశానికి 20,250 క్లినికల్‌ సైకాలజిస్టులు అవసరమైతే, కేవలం 900 మందే ఉన్నారు.

మానసికారోగ్యంపై రాష్ట్రాలూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఉదాహరణకు, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలోని సెక్షన్‌ 73 ప్రకారం- 'పాక్షిక-న్యాయ మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డు'లను ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్రాలపై ఉంది. మానసిక ఆరోగ్య సంరక్షణ-సేవల్లో లోపాలకు సంబంధించిన ఫిర్యాదులపై తీర్పు చెప్పే అధికారం ఈ బోర్డులకు ఉంటుంది. మానసిక రుగ్మతలకు చికిత్సనందించే సంస్థలను పర్యవేక్షించడం, ఏవైనా అక్రమాలు చేస్తున్నట్లు రుజువైతే లైసెన్సులు రద్దు చేయడం, జరిమానాలు విధించడం వంటి అధికారాలూ ఉంటాయి. కానీ, చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు దాటినా- అనేక రాష్ట్రాలు ఈ బోర్డులను ఏర్పాటు చేయలేదు. భారతదేశంలో 19 రాష్ట్రాలు మాత్రమే 2019 ఆగస్టు నాటికి కొంతవరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు అంచనా.

అవగాహన ఏదీ?

ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం లోపించి ప్రస్తుతం 20శాతం జనాభా బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేసింది. కొవిడ్‌ సంక్షోభం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. మానసిక ఆరోగ్య కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ సౌమిత్రా పథారే ఒక అధ్యయనంలో 2018లో 1,34,000 మంది భారతీయులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, యువకులేనని తెలిపారు. భారతదేశంలో రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో మానసిక ఆరోగ్యం ప్రస్తావన అరుదు. పౌరులకు మంచి ఆరోగ్యాన్ని అందించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. జీవన నాణ్యత సైతం దేశ ఆరోగ్య ప్రగతిని నిర్దేశిస్తుంది. భారతదేశంలోని ప్రతి జిల్లాలో మానసిక ఆరోగ్య సేవలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించడం అవసరం. ఈ సేవలు 'సెంట్రల్‌ మెంటల్‌ హెల్త్‌ అథారిటీ' సూత్రాలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం.

సామాజిక వేత్తలు, వైద్య విద్యారంగంలోని వారు మాత్రమే కాకుండా- స్నేహితులు, బంధువులు సైతం మానసిక సమస్యలతో బాధపడేవారిని గుర్తించి, సాంత్వననివ్వడం అవసరం. గందరగోళం, మతిమరుపు, కోపం, కలత చెందడంవంటివి తీవ్రంగా ఉన్నా.. కుంగుబాటు, విపరీతమైన భయం తదితర లక్షణాలున్నా తక్షణమే బాధితులకు కుటుంబ, సామాజిక స్థాయిలో తగిన సహాయ సహకారాలు అందాలి. ఇందుకోసం అందరిలో మానసికారోగ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా చేపట్టాలి.

రచయిత్రి- షణ్మితా రాణి, బెంగళూరులోని నిమ్హాన్స్‌లో సైకాలజీ కౌన్సెలర్‌

ABOUT THE AUTHOR

...view details