తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రణాళికతోనే ఆహార భద్రత సాధ్యం - Causes of price raised essential goods

సారవంతమైన నేలలున్న భారత్​... ఆహార ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు, ద్రవ్యోల్బణం ధాటికి తట్టుకోలేక వినియోగదారులు విలవిల్లాడటానికి, ఏ ప్రాంతంలో ఏ పంట ఏ మాత్రం దెబ్బతిన్నా దిగుమతులే దిక్కు అన్నట్లుగా ఉంది. దీంతో అటు వినియోగదారుడు, ఇటు రైతులూ నష్టపోతున్నారు. మరి ఈ పరిస్థితికి ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేకపోవడమే కారణమా?

An analysis story on food security with Government plans
ప్రణాళికాబద్ధమైతేనే ఆహారం భద్రత

By

Published : Nov 2, 2020, 7:00 AM IST

Updated : Nov 2, 2020, 7:46 AM IST

ఏం కొనేట్టు, తినేట్టు లేదన్న జన సామాన్యం నిట్టూర్పుల సాక్షిగా రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొంటోంది. నిత్యావసరాల చిల్లర ధరలు సగటు జీవికి ఠారెత్తించేలా పెరిగి పోతున్న తీరు కేంద్ర ప్రభుత్వాన్నీ తీవ్రాందోళన పరుస్తోంది. నిరుడు ఇవే రోజులతో పోలిస్తే, కిలో ఆలు ధర ఎకాయెకి 93 శాతం, ఉల్లిపాయలు 44 శాతం, మినప్పప్పు 27, పామాయిల్‌ 24, ఎర్రకందిపప్పు 22 శాతం పెరిగి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల్ని కసిగా కబళించిన కరోనా కాలంలో వ్యవసాయోత్పత్తులు దండిగా పండటం ఎంతో ఊరటనిచ్చే పరిణామమే అయినా, కొనబోతే కొరివిగా మారిన వాతావరణం బీదాబిక్కీని బెంబేలెత్తిస్తోంది. ఈ ధరాఘాతాల నుంచి సామాన్య జనాన్ని ఆదుకొనేందుకు కస్టమ్స్‌ సుంకాన్ని 30 నుంచి 10 శాతానికి తగ్గించి మరీ 10 లక్షల టన్నుల ఆలుగడ్డల్ని దిగుమతి చేసుకోవాలని కేంద్ర సర్కారు సంకల్పించింది.

ఉల్లి ధరల ఘాటు గూబలదరగొడుతున్న వేళ ఇప్పటికే 'నాఫెడ్‌' సేకరించిన 7000 టన్నులకు అదనంగా దీపావళిలోగా మరో 25 వేల టన్నుల ఉల్లి దిగుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. పనిలోపనిగా లక్షన్నర టన్నుల మినప్పప్పు దిగుమతులకూ లైసెన్సులు జారీ చేసింది. ఏటా రెండు లక్షల టన్నుల కందిపప్పు దిగుమతుల ఒప్పందాన్ని మొజాంబిక్‌తో మరో అయిదేళ్లు పొడిగించేందుకు, ఏటా రెండున్నర లక్షల టన్నుల మినప్పప్పును మరో అయిదేళ్లు సరఫరా చేసే కాంట్రాక్టును మయన్మార్‌తో కుదుర్చుకొనేందుకు కేంద్రం నిర్ణయించింది. భూటాన్‌ నుంచి ఆలుగడ్డలు, టర్కీ, ఈజిప్టు, అఫ్గానిస్థాన్ల నుంచి ఉల్లిపాయల దిగుమతులకు ఇండియా అర్రులు చాస్తున్న వైనం- 14 కోట్ల హెక్టార్లకు పైగా సేద్య యోగ్య భూములుగల భారతావనికే అవమానం!

ప్రణాళిక లేమి కారణమా?

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న అచ్చ తెనుగు సామెత దేశ వ్యవసాయ రంగానికి సరిగ్గా నప్పుతుంది. సుక్షేత్రాల విస్తీర్ణం పరంగా ఇండియాతో సరితూగని జనచైనా ఆహార రంగంలో 95 శాతం స్వావలంబన సాధించగా, ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో భాగంగా వ్యవసాయ మెలకువలు ఆకళింపు చేసుకొంటున్న మొజాంబిక్‌ పప్పు దినుసుల్ని భారత్‌కే ఎగుమతి చేస్తోంది! సేద్యానికి స్వేదాన్ని ముడుపు కట్టిన దాదాపు 10 కోట్ల కుటుంబాలు, నాగలితో నమస్కరిస్తే పంట సిరులతో ఆశీర్వదించే మాగాణులు, కేంద్రం, రాష్ట్రాల స్థాయుల్లో వ్యవసాయ మంత్రిత్వ శాఖలు, పదుల కొద్దీ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, రైతుల పేరిట ఖర్చు చూపే వేల కోట్ల రాయితీలు- 130 కోట్ల భరత జాతి ఆహార భద్రతకు పూచీ పడాల్సి ఉంది. పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు, ధరోల్బణం ధాటికి తట్టుకోలేక వినియోగదారులు విలవిలలాడటానికి, ఏ ప్రాంతంలో ఏ పంట ఏ మాత్రం దెబ్బతిన్నా దిగుమతులే దిక్కు అన్నట్లుగా ప్రభుత్వాలు వెంపర్లాడుతుండటానికి- సరైన ప్రణాళికల లేమి కారణమవుతోంది.

టొమాటో, ఉల్లి, ఆలు మార్కెట్లలో ఏటా తప్పని సంక్షోభాన్ని పరిష్కరించేందుకు 2018-19 కేంద్ర బడ్జెట్లో రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తే- మొన్న జనవరిదాకా ఖర్చు చేసింది రూ.5.77 కోట్లు! ఆహారోత్పత్తుల సక్రమ నిల్వ కోసం అయిదేళ్లలో 253 సమీకృత శీతల గిడ్డంగుల్ని ప్రతిపాదిస్తే- 87 పూర్తికాగా, 60 రద్దు అయ్యాయి. తక్కినవి కొనసాగుతున్నాయి! పంటల వృథా రూపేణా ఇండియా ఏటా రూ.44 వేల కోట్లు నష్టపోతుంటే, దిగుమతుల పద్దు కింద మరెన్నో వేల కోట్ల మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాలు ఒక్కతాటిపైకి వచ్చి, జాతి ఆహార భద్రత ఎగుమతి అవకాశాల్ని విశ్లేషించి ప్రాంతాల వారీగా పటుతర సేద్య ప్రణాళికల్ని పట్టాలకెక్కించాలి. కూరగాయల రైతులకు కొంతైనా సాంత్వన కలిగించిన కేరళ ఆదర్శాన్ని గౌరవిస్తూ రైతుకు ప్రభుత్వాలు పూర్తి దన్నుగా నిలిస్తేనే ఆహార రంగంలో స్వావలంబన సాధ్యపడుతుంది!

ఇదీ చూడండి:బలగాల అతిపెద్ద విజయం- హిజ్బుల్‌ చీఫ్‌ హతం

Last Updated : Nov 2, 2020, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details