తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా కట్టడికి విస్తృత పరీక్షలే శరణ్యం - India standard test kits

మహమ్మరి కరోనా వ్యాప్తి నివారణకు విస్తృత స్థాయిలో పరీక్షలు చేయడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ఉద్బోధ చేసింది. అయితే భారత్​లో మాత్రం వైరస్​ నిర్ధరణ పరీక్షలు జనాభాతో పోలిస్తే అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు ఇతర వ్యాధులతో పోరాడుతున్న వారికి మెడమీద కత్తిలా వేలాడుతుంది కరోనా. ఈ క్రమంలో రాపిడ్​ టెస్టింగ్​ కిట్లను తగిన స్థాయిలో సమకూర్చుకుని.. పరీక్షల వేగం పెంచాల్సి ఉంది. కొవిడ్​ ల్యాబ్​ల సంఖ్య పెంచి ఆసుపత్రులపై భారం తగ్గించాలి.

An analysis Story on Coronavirus confirm testings in India
కరోనా కట్టడికి విస్తృత పరీక్షలే శరణ్యం!

By

Published : Jun 17, 2020, 9:20 AM IST

కొవిడ్‌ మహమ్మారి కట్టడికి విస్తృత పరీక్షలొక్కటే మార్గమని డబ్ల్యూహెచ్‌ఓ ఉద్బోధించి సరిగ్గా మూడునెలలైంది. దరిమిలా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఇండియా ప్రామాణిక టెస్ట్‌ కిట్ల సేకరణ, అభివృద్ధిపై దృష్టి సారించినా- ఇప్పటికీ రోజుకు లక్షన్నర రోగ నిర్ధారణ పరీక్షలే చెయ్యగలుగుతోంది. కొవిడ్‌ రోగులు కోలుకొంటున్న రేటు 52.47 శాతానికి చేరడం ఊరట కలిగిస్తున్నా- రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తుల నడినెత్తిన ఎత్తిన కత్తిలా కరోనా ఉరుముతున్న నేపథ్యంలో వారికి పరీక్షలు జరపకపోవడం నిర్వేదం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా రోగాలతో బాధపడుతున్న 170 కోట్ల మంది (20శాతానికిపైగా) కొవిడ్‌నుంచి పెనుముప్పు ఎదుర్కొంటున్నట్లు 'లాన్సెట్‌' అధ్యయనం ఎలుగెత్తుతున్న తరుణంలో ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ డైరెక్టర్‌ సూచనలు ఎంతో విలువైనవి.

యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు అవసరం

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో విస్తృత పరీక్షల ద్వారానే కరోనా అదుపులోకి వచ్చిందంటూ ఇండియా రోజుకు పదిలక్షల పరీక్షలు జరపాల్సిన అవసరాన్ని సీసీఎంబీ సంచాలకులు రాకేశ్‌ మిశ్రా ప్రస్తావించారు. ప్రస్తుతం కొవిడ్‌ నిర్ధారణకు ఉపయోగిస్తున్న ఖరీదైన ఆర్‌టీ- పీసీఆర్‌ యంత్రాలు పరిమిత సంఖ్యలో ఉండటం, పరీక్షలకు ఉపయోగించే ప్రోబ్స్‌ను విదేశాలనుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని, దానికి చౌకైన ప్రత్యామ్నాయంగా సీసీఎంబీ- నెస్టెడ్‌ పీసీఆర్‌ యంత్రాల్ని అభివృద్ధి చేసినా ఐసీఎంఆర్‌ వాటిని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందనీ చెబుతున్నారు. మరోవంక నిమ్స్‌, ఈఎస్‌ఐ, టాటా శాస్త్రవేత్తలు ఆర్‌టీ-ల్యాంప్‌ పేరిట అరగంటలోనే ఫలితాన్ని తేల్చే మరో ప్రామాణిక ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. దక్షిణ కొరియా సంస్థ సారథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే న్యూ యాంటిజెన్‌ టెస్టింగ్‌ కిట్‌కు ఐసీఎంఆర్‌ తాజాగా ఆమోదం తెలిపింది. కొవిడ్‌పై పోరు గెలవాలంటే మేలిమి స్థానిక పరీక్షా విధానాల్ని విస్తృతంగా వినియోగించి యుద్ధ ప్రాతిపదికన కదలడం తప్పనిసరి!

ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేలా..

కనపడని శత్రువుగా మృత్యుదాడి చేస్తున్న కరోనా ఆట కట్టించడంలో న్యూజిలాండ్‌ సాధించిన విజయం ఆశారేఖ లాంటిది. ఇండియాలో కొవిడ్‌ బారినపడ్డవారి సంఖ్య 3.5 లక్షలకు చేరువవుతున్న వేళ- తలా పదివేలకుపైగా కేసులతో ఎనిమిది రాష్ట్రాలు పు'రోగ'మిస్తున్నాయి! ఇప్పటికే తీవ్రంగా ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు, ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిపోయిన సమయంలో ఖరీదైన టెస్టులకు మొహం చాటేస్తున్నాయి. దానివల్ల కరోనా నిశ్శబ్ద హంతకిగా మరింతగా జూలు విదిలిస్తోంది. కరోనా దుష్ప్రభావాలు తక్కువగా ఉన్న కేసుల్ని ఎక్కడికక్కడ చికిత్స చేయడం ద్వారా పెద్ద ఆసుపత్రులపై మితిమీరిన భారం పడకుండా జర్మనీ కాచుకోగలిగింది. చౌకైన ప్రామాణిక పరీక్షా పద్ధతులతో ప్రాథమిక దశలోనే రోగాన్ని నిర్ధారించడం ద్వారా బాధితులకు వైద్యసేవలందించడంలో ఇండియా సైతం అనుసరించదగ్గ మార్గమిది.

ఇతర వ్యాధులూ దాడి చేయొచ్చు!

కొవిడ్‌ చికిత్స ఖర్చులు మోయలేని భారంగా పరిణమించినందువల్ల- ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన మాదిరిగానే ఆరోగ్య శ్రీ ద్వారానూ నిరుపేదలకు ఆరోగ్య బీమా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రుతుపవనాలు రావడం వల్ల కొవిడ్‌తోపాటు స్వైన్‌ఫ్లూ కూడా కలసి ఉమ్మడిగా దాడి చేసే ప్రమాదం ఉందని, ఆ పరిస్థితుల్లో రోగ నిర్ధారణే కష్టతరమవుతుందన్న వైద్యుల భయాందోళనలు తోసిపుచ్చలేనివి. పులిమీద పుట్రలాంటి ఈ ఉత్పాతాన్ని సమర్థంగా కాచుకోవాలంటే, దేశవ్యాప్తంగా గుర్తించిన కొవిడ్‌ ల్యాబ్‌ల సంఖ్యను 907నుంచి గణనీయంగా విస్తరించి, చౌకైన సరళతర ప్రత్యామ్నాయాలకు చోటుపెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొవిడ్‌ పరీక్షల ద్వారా రక్షణ ఛత్రం పట్టాలి. కొవిడ్‌ మారణహోమాన్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేసే చొరవతోనే యావత్‌ జాతి తెరిపిన పడగలిగేది!

ఇదీ చూడండి:గాల్వన్​ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details