తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆశాభావంతోనే.. బంధాలు బలోపేతం - ఆశాభావంతోనే.. బంధాలు బలోపేతం

కరోనా కట్టడికి పాటిస్తున్న భౌతిక దూరం కారణంగా బంధాలు బలహీనపడుతున్నాయని పేర్కొంటున్నారు సామాజిక విశ్లేషకులు. బంధువులు, స్నేహితులు, పొరుగు వారుతో బంధాలు బీటలు పారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కుమారుల వద్ద ఉండి జీవనం సాగించాల్సిన వయస్సులో ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో ఉండటం.. దూరాన్ని మరింత పెంచుతోంది. ధైర్యం, మనో నిబ్బరంతోనే వాస్తవికంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అందుబాటులో ఉన్న అనేక మార్గాల్లో అందరితోనూ కలివిడిగా ఉంటూ.. సంబంధాలను సజీవంగా ఉంచుకోవాలి. మున్ముందు మంచి రోజులు వస్తాయనే ఆశావహ దృక్పథాన్ని పెంచుకోవడం వల్లే బంధాలు దృఢమవుతాయి.

social distancing
ఆశాభావంతోనే.. బంధాలు బలోపేతం

By

Published : Jun 19, 2020, 7:55 AM IST

గొలుసు కట్టును తెగ్గొట్టడమే కరోనా వ్యాప్తి నిరోధానికి సరైన పరిష్కారమని ఎంతోమంది నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకుగాను భౌతిక దూరం పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటించడం వల్లే దాని ఉద్ధృతి తగ్గింది. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు తగ్గించి ప్రజాజీవనం కాస్త తెరిపిన పడాలనే ఉద్దేశంతో కొన్ని సడలింపులు వచ్చాయి. ఆపై సడలింపుల ఫలితంగా కరోనా వ్యాప్తి అధికమైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడం తప్ప మరో మార్గంలేదు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే- భౌతిక దూరం వల్ల మానసికంగానూ ఎడం పెరిగి బంధాలు పలచనయ్యే పరిస్థితులు కనబడుతున్నాయని సామాజిక విశ్లేషకుల అభిప్రాయం. పెద్దలు, పిల్లలు, అన్నదమ్ములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్నేహితులు, ఇరుగు, పొరుగు వారు... ఇలా అందరి మధ్యా సంబంధాలు బలహీనపడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి.

మానసిక దూరం పెరగొద్దు..

ఇప్పటికే మనుషుల మధ్య మానసిక దూరం పెరిగిపోయింది. టీవీలు వచ్చిన తరవాత ఒకరిళ్ళకు మరొకరి రాకపోకలు, ఒకచోట కూర్చుని మాట్లాడుకోవడం వంటివి బాగా తగ్గాయి. ఆ తరవాత వచ్చిన స్మార్ట్‌ఫోన్లు సమస్యను మరింతగా పెంచాయి. అపార్టుమెంట్లలో నివసించే సంస్కృతితో మనుషుల మధ్య సహజంగానే దూరం పెరిగింది. వీటన్నింటికీతోడు ఉద్యోగాలలో ఒత్తిడి, జీవన సరళిలో వచ్చిన వేగం. వెరసి ఒకరితో మరొకరు కలిసి మెలిగే పరిస్థితులు మృగ్యమయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల దూరం మరింతగా పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాకపోకలు కొనసాగితేనే బంధుత్వాలు నిలబడతాయి. ప్రయాణ సాధనాల లేమితో రాకపోకలు తగ్గి దూరం పెరుగుతోంది. ఫలితంగా అదే అలవాటుగా మారిపోతే, మానసికంగా దూరం పెరిగి, రాకపోకలు సాగించడానికి సైతం ఇష్టపడని పరిస్థితులు నెలకొనే ప్రమాదం సైతం లేకపోలేదు.

అంతర్గత భయాలతోనే..

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్గత భయాలు కూడా దూరాల్ని పెంచుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ తనకుందో, లేదో, ఎదుటి వారి పరిస్థితి ఏమిటో తెలియని అయోమయ స్థితి అందరిదీ. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యగా ఇష్టమున్నా, లేకున్నా ఎవరికి వారే ఇతరులు నుంచి దూరంగా ఉండిపోతున్నారు. ఆప్యాయంగా పలకరించాలన్నా, అవసరమై ఓదార్చాలన్నా, అత్యవసరమై తాకాలన్నా సంశయమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎటునుంచి సమస్య వస్తుందోననే అనుమానంతో కొంతమంది ముఖ్య సంబంధీకులైన స్నేహితులు, బంధువులకు సైతం దూరంగా ఉండిపోతున్నారు. పలకరించినా, మాట్లాడినా అనుబంధం పెరిగి, మనసు వారి వైపు లాగి చేరువకు వెళ్సాల్సి వస్తుందేమోనని వాటినీ తగ్గించుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్న తమ సంతానాన్ని సైతం మనస్ఫూర్తిగా రమ్మనలేక, వీరు వారి దగ్గరకు వెళ్ళలేక తలిదండ్రులు, వారి పిల్లలు దూరాలను పెంచుకుంటున్నారు. పిల్లల నీడలో జీవనం వెళ్ళదీయాల్సి వచ్చే వృద్ధుల పాలిట ప్రస్తుత పరిస్థితి పెద్ద శాపంలా మారుతోంది. కుమారుల వద్ద వంతులవారీ పద్ధతిలో జీవించే వృద్ధుల బాగోగులను ఈ నెపంతో సరిగా చూడక పోవడంతో దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

యాంత్రిక జీవనం..

అనేక రకాల మనస్తత్వాలున్నవారు ఒకచోట నివసించే ప్రదేశాలు బహుళ అంతస్తుల భవనాలు. వీటిల్లో నివసించే వారంతా ముందు జాగ్రత్త చర్యగా సాధారణ సమయాల్లోనే కొన్ని నియమాలు, కట్టుబాట్లు విధించుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతరులను అనుమతించకపోడం అనేది తప్పని సరిగా చేసుకునే కట్టుబాటుగా మారింది. ఫలితంగా స్నేహితులు, బంధువులు సైతం వారిని కలవలేని దుస్థితి నెలకొంటోంది. ఇక- చిన్నపిల్లల్లో సైతం దూరం పెరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆటపాటలతో స్నేహ మాధుర్యాన్ని అనుభవించే వయసు బాల్యం. కానీ కరోనాకు భయపడి ఎవరికివారే తమ పిల్లల్ని ఇతరుల పిల్లలకు దూరంగా ఉంచుతున్నారు. ఫలితంగా బాల్యంలో సహజంగా ఏర్పడాల్సిన స్నేహ సంబంధాలు మృగ్యమవుతున్నాయి. మనుషుల జీవనం యాంత్రికంగా మారుతోంది. ఇలాంటి స్థితిలో రుగ్మతలు, అవాంఛనీయ పరిస్థితులూ చోటుచేసుకునే ప్రమాదాలు లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం దక్కాలంటే- కరోనాకి మందు తయారవ్వాలి. అది అందరికీ అందుబాటులోకి రావాలి. అప్పటికి పరిస్థితులు ఎలా మారతాయో ఊహించలేం. అందుకని, పరిస్థితులన్నీ చక్కబడే వరకు భౌతికంగా మాత్రమే దూరంగా ఉంటూ వీలైనంతమేర సామాజిక, మానసిక సంబంధాలను నిలబట్టుకునే ప్రయత్నాలు చేయడమే పరిష్కారం. ధైర్యం, మనోనిబ్బరం వాస్తవిక రీతిలో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అందుబాటులో ఉండే అనేక మార్గాల్లో అందరితోనూ కలివిడిగా ఉంటూ, తరచూ మాట్లాడుకోవడం ద్వారా సంబంధాలను సజీవంగా ఉంచుకోవాలి. మున్ముందు మంచి రోజులు వస్తాయనే ఆశావహ దృక్పథాన్ని పెంచుకోవాలి.

రచయిత: రమాశ్రీనివాస్

ఇదీ చూడండి:'భారత్​లోకి చొరబడేందుకు 300లకుపైగా ఉగ్రవాదులు రెడీ'

ABOUT THE AUTHOR

...view details