తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనాకు కోరలు తొడిగిందెవరు? - corona virus

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే మూడున్నర లక్షల మందికిపైగా ఈ వైరస్​కు బలయ్యారు. 55లక్షలమందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి పుట్టుకపై పలు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా.. ల్యాబ్​లో పుట్టిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ పుట్టుకపై విశ్లేషణాత్మక కథనం.

corona
కరోనాకు కోరలు తొడిగిందెవరు?

By

Published : May 26, 2020, 9:58 AM IST

మృత్యుపాశాలు విసురుతూ రెచ్చిపోతున్న కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 54 లక్షలమందికి సోకి మూడున్నర లక్షలమంది అభాగ్యుల ఉసురు తీసేసింది. ఎకాయెకి 17 లక్షలకేసులు, లక్షకు చేరువైన మరణాలతో అమెరికా కిందుమీదులవుతుంటే, కొవిడ్‌ తాకిడి తీవ్రంగా ఉన్న తొలి పది దేశాల జాబితాలోకి చేరి ఇండియా కళవళపడుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌ మానవాళి పుట్టి ముంచేంతగా అన్ని ఖండాల్నీ చుట్టుముట్టేయడం- ప్రకృతి శాపమా, మానవ ప్రేరేపితమా అన్న సందేహాలకు తావిచ్చింది. 2002లో చైనాలోనే వెలుగు చూసిన సార్స్‌, 2014 నాటి ఎబోలా వైరస్‌ల ఉరవడికి ఎన్నో రెట్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా- వుహాన్‌లోని వైరాలజీ సంస్థనుంచి బయటికొచ్చిన జీవాయుధమనే వాదనను డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టిగా వినిపిస్తున్నారు. వైరస్‌ను మనిషి తయారు చేయలేడంటూ ఆ అభియోగాన్ని నెల రోజుల క్రితం వైరాలజీ సంస్థ తోసిపుచ్చగా- గబ్బిలాలనుంచి వేరు చేసి సేకరించిన సజీవ వైరస్‌లు మూడు ఉన్నాయని ఆ సంస్థ డైరెక్టర్‌ తాజాగా అంగీకరించారు. కొవిడ్‌ కారక వైరస్‌తో అవి 79.8 శాతమే సరిపోతున్నాయన్న ఆమె- తమ ల్యాబ్‌లో అసలు లేనిదాన్ని ఎలా ‘లీక్‌’ చెయ్యగలమని ప్రశ్నిస్తున్నారు.

వుహాన్ వైరాలజీ సంస్థపై అనుమానాలు!

వుహాన్‌ వైరాలజీ సంస్థలోనే ‘కుట్ర’ జరిగిందంటున్న అమెరికా వాదనకు వత్తాసుగా పలు దేశాలు నిలవడంతో- ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కీలక తీర్మానం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమన్వయ కర్తగా కొవిడ్‌ మీద పోరులో నేర్చుకొన్న పాఠాలు, పొందిన అనుభవాలను సమీక్షించేలా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సమగ్ర మూల్యాంకనం జరగాలన్నదే తీర్మాన సారాంశమని చైనా చెబుతోంది. అది కూడా కొవిడ్‌ సద్దుమణిగాకే జరగాలంటున్న బీజింగ్‌- ఆరోగ్య సంస్థ ప్రమేయం లేని స్వతంత్ర దర్యాప్తును అంగీకరించబోమంటోంది. ఈ ‘ప్రచ్ఛన్న యుద్ధ’ వైరస్‌ మరింత ప్రమాదకరమైనది!

పరిశోధకులదీ అదే మాట!

ప్రాణాంతక కరోనా వైరస్‌ మూలాల్ని నిర్ధారించడమూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానంలో కీలకాంశం. కరోనా ఎవరైనా రూపొందించిందో, జన్యు పరివర్తితమో కాదని అమెరికా నిఘా వర్గాలే స్పష్టీకరిస్తున్నా, అది జీవాయుధమేనని ‘బయోలాజికల్‌ వెపన్స్‌ యాంటీ టెర్రరిజం యాక్ట్‌’ రూపకర్త, విఖ్యాత అమెరికన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ బోయల్‌ కరాఖండీగా చెబుతున్నారు! గబ్బిలాలనుంచి వేరే జీవాలకు పాకి వాటినుంచి మనుషులకు సోకిందని ఒక వర్గం, జలచర (సీఫుడ్‌) మార్కెట్‌నుంచి బయటకు రావడానికి ముందే మనుషుల ద్వారా అది అక్కడికి చేరిందని మరో వర్గం గట్టిగా విశ్వసిస్తున్న నేపథ్యంలో- అనూహ్య ఉత్పరివర్తనాల (మ్యుటేషన్స్‌)తో కరోనా వైరస్‌ భయానకంగా కోరసాచి విస్తరిస్తోంది.

చైనా ధోరణిపై విమర్శలు

సార్స్‌ విరుచుకుపడ్డప్పుడూ స్వీయ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతో అతి గోప్యంగా వ్యవహరించిన చైనా, ఈసారీ అదే ధోరణి కొనసాగించడం, వారాల తరబడి డబ్ల్యూహెచ్‌ఓ ప్రేక్షక పాత్ర వహించడం- మానవాళి పాలిట మృత్యుఘాతాలయ్యాయి. అత్యంత ప్రమాదకర వైరస్‌లనుంచి రక్షణ కల్పించే ప్రయోగాలకు నెలవై బిఎస్‌ఎల్‌ 4 (జీవ భద్రతా ప్రమాణ స్థాయి)గా గుర్తింపు పొందిన వుహాన్‌ సంస్థపైనే అనుమాన మేఘాలు కమ్ముకొంటున్నాయి. జీవాయుధాల వల్ల పొంచి ఉన్న పెనుముప్పును తప్పించాలన్న లక్ష్యంతో వాటి నిషేధంపై 1975లోనే అంతర్జాతీయ ఒడంబడిక రూపుదాల్చింది. దానికి పూచిక పుల్లపాటి విలువ ఇవ్వకుండా అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, కెనడా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌, ఉత్తర కొరియా ప్రభృత దేశాలన్నీ దారుణ మారణ జీవాయుధాల సృష్టిలో నిమగ్నమయ్యాయి. ఆ ఒప్పందానికి గట్టిగా కట్టుబడాలని ఇండియా మొత్తుకొంటున్నా చెవినపెడుతున్నవారే లేరు. అలాంటప్పుడు కరోనా పుట్టుక, విజృంభణలో ఎవరి బాధ్యత ఎంతో నిష్కర్షగా నిగ్గుతేల్చేవారెవరు?

ఇదీ చూడండి:భారత్‌ నుంచి చైనా పౌరులు వెనక్కి

ABOUT THE AUTHOR

...view details