ఇండియాకు కావాల్సిన ఆయుధాలు సైనిక సామగ్రిని తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి సమకూర్చుకొన్నా, మునుముందు సొంతంగానే రూపొందించుకోవాలని తొలి ప్రధాని పండిత నెహ్రూ దిశానిర్దేశం చేశారు. తాత్కాలికమంటే అర్థంకాని, దిగుమతులే దిక్కు అయితే వాటిల్లే అనర్థంగాని, సొంతంగా రూపొందించుకోవాలనడంలోని పరమార్థంగాని తెలియని పాలకుల హ్రస్వదృష్టి కారణంగా కీలక రక్షణ రంగంలో పరాధీనత దశాబ్దాలుగా కొనసాగుతోంది.
గత రెండు దశాబ్దాల్లో దేశీయంగా రక్షణ ఉపకరణాల ఉత్పత్తి, స్వావలంబన సహా దేశ రక్షణ రంగంపై ఎనిమిది కమిటీలు, టాస్క్‌ఫోర్స్‌లు నివేదికలు అందించినా దీటైన కార్యాచరణే కొరవడి ఎక్కడి గొంగడి అక్కడే ఉంది! ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారతావని) పేరిట కేంద్ర విత్తమంత్రి వెలువరించిన వ్యూహపత్రం- రక్షణ రంగంలోనూ ఇండియా స్వశక్తిని కూడగట్టుకొనే విధాన ప్రకటనలకు చోటుపెట్టింది. దాని వెన్నంటి వెలువడిన రక్షణ ఉత్పతులు ఎగుమతుల అభివృద్ధి విధాన ముసాయిదా- 2025నాటికి దేశీయంగా రూ.లక్షా 75 వేలకోట్ల టర్నోవరు, రూ.35వేలకోట్ల ఎగుమతుల్ని లక్షించింది. దేశీయంగా నేడు రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ.80 వేలకోట్లు; అందులో ప్రభుత్వరంగ సంస్థలు, ఆయుధ కర్మాగారాల వాటా రూ.63వేలకోట్లు!
స్వదేశీ కొనుగోళ్లకు రూ.52 వేలకోట్లు
2001 నుంచి ప్రైవేటు సంస్థలకు లైసెన్సులు ఇచ్చి రక్షణ ఉత్పత్తులకు ఊతమిస్తున్నామంటున్నా- వాటి టర్నోవర్ రూ.17 వేలకోట్లకే పరిమితమైన తీరు కేంద్ర ప్రభుత్వ విధానపర వైఫల్యాలకు నిలువుటద్దం. ఆ దురవస్థను చెదరగొట్టి దేశీయ రక్షణ పరిశ్రమలకు కొత్త ఊపిరులూదేలా ఈ ఏడాదే రూ.52 వేలకోట్ల మొత్తాన్ని స్వదేశీ కొనుగోళ్లకు మళ్లిస్తున్నట్లు రక్షణమంత్రి ప్రకటించారు. 101 రక్షణ ఉత్పాదనల దిగుమతులపై నిషేధం విధించి, వచ్చే ఆరేడు సంవత్సరాల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్డర్లను దేశీయ పరిశ్రమలకే ఇవ్వనున్నారు. ఆత్మనిర్భర్ లక్ష్యసాధనకు ఆ తరహా ప్రోత్సాహమే కావాలిప్పుడు!
అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు