ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగు చేసిన కొత్త పంటలు మార్కెట్లకు రావడం ఆరంభమైంది. భారతదేశంలో ఏటా అక్టోబరు నుంచి మరుసటి సెప్టెంబరు దాకా పంటల కొనుగోలు 'మార్కెటింగ్ ఏడాది'గా పరిగణిస్తారు. గత మార్కెటింగ్ ఏడాది ఆరంభం నుంచి కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. ఈ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా రైతులు వెనక్కి తగ్గలేదు. రైతు ఉద్యమం జరుగుతున్న పంజాబ్ రాష్ట్రం నుంచే రికార్డు స్థాయిలో బియ్యాన్ని మద్దతు ధరకు గత మార్కెటింగ్ ఏడాదిలో కేంద్రం నేరుగా కొనుగోలు చేసింది. దేశ ఆహార భద్రత పేరుతో బియ్యం, గోధుమలను మాత్రమే కోట్ల టన్నుల మేర కొనుగోలు చేస్తున్న కేంద్రం మిగతా పంటలను రాష్ట్రాలకు, వ్యాపారులకు వదిలేస్తోంది. ఇప్పుడిక కొత్త పంటలకు నూతన మార్కెటింగ్ ఏడాదిలో ప్రభుత్వాలు ఎంత ధర ఇచ్చి, ఎంతమేర కొనుగోలు చేస్తాయనేది కీలక ప్రశ్నగా మారింది.
స్పష్టత కరవు
పంటల దిగుబడులు పెంచాలని ప్రభుత్వాలు పదేపదే రైతులకు చెబుతున్నాయి. కానీ మద్దతు ధరకు కొనే విషయంలో మాత్రం సీజన్ ఆరంభంలో ఏమీ చెప్పడం లేదు. అక్టోబరు నుంచి కొత్త రబీ (యాసంగి) సీజన్ సాగుకు రైతు సిద్ధమవుతున్నా- ఇంతవరకు వరిధాన్యం, గోధుమలు తప్ప మిగతా పంటలను ఏ పరిమాణంలో మద్దతు ధరకు కొంటారనే విషయంలో ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వలేదు. పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో రాష్ట్ర దిగుబడిలో 25 శాతమే మద్దతు ధరకు కొంటామని కేంద్రం షరతు పెట్టింది. దీన్ని 50శాతానికి పెంచాలని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కోరుతున్నా కేంద్రం ససేమిరా అంటోంది. వ్యాపారులు ధరలు తగ్గించి కొనడంవల్ల రైతులు నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి.
ఉదాహరణకు గతేడాది 2020 అక్టోబరు నుంచి 2021 ఫిబ్రవరి మధ్య రైతుల నుంచి వేరుసెనగ పంటను ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లలో అమ్మిన తీరుపై అధ్యయనం చేస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అతి తక్కువగా కేవలం 15 రోజులు మాత్రమే మద్దతు ధర లభించినట్లు తేలిందని 'జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్'(సీఏసీపీ) తాజా అధికారిక నివేదికలో ఎండగట్టింది. దేశంలోనే మేలైన వేరుసెనగలు రాయలసీమ, తెలంగాణలో పండుతాయి. కానీ ధరలు ఇంత దారుణంగా తగ్గించి కొంటే ఇక రైతులకు మిగిలేది ఏముంటుంది? మరోవైపు, విదేశీ కంపెనీల నుంచి నారు కొనుగోలు చేసి ఆయిల్‌పామ్ సాగు పెంచాలని, ఆ పంటను కొనే ప్రైవేటు నూనె మిల్లులు మంచి ధర చెల్లించి రైతుల ఆదాయం పెంచుతాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రైవేటు మిల్లులు చెప్పినట్లు చెరకు పండిస్తున్న రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించకుండా జాప్యం చేస్తున్న సంగతి విస్మరించకూడదు.
రాష్ట్రానికో తీరు!
పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానాన్ని అనుసరించడం లేదు. ఈ సెప్టెంబరుతో ముగిసిన 2020-21 మార్కెటింగ్ ఏడాదిలో దేశవ్యాప్తంగా 5.98 కోట్ల టన్నుల బియ్యాన్ని కేంద్రం మద్దతు ధరకు కొంటే- అందులో పశ్చిమ్ బంగ వాటా 3.1 శాతం, ఉత్తర్ ప్రదేశ్ వాటా 7.4 శాతమే. ఈ రాష్ట్రాలే దేశంలోకెల్లా అత్యధికంగా వరి పండిస్తుంటే అక్కడి రైతుల నుంచి నామమాత్రంగా మద్దతు ధరకు ప్రభుత్వాలు కొంటున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఉద్యమిస్తున్న పంజాబ్ రైతుల నుంచి దేశచరిత్రలోనే అత్యధికంగా కోటీ 36 లక్షల టన్నులు, తెలంగాణలో 94.54 లక్షల టన్నులు, ఏపీలో 56 లక్షల టన్నులు కొన్నట్లు ‘భారత ఆహార సంస్థ’ తాజా నివేదికలో తెలిపింది. పంజాబ్, హరియాణా రైతులు పండించే వరి, గోధుమల్లో 90 శాతం కేంద్రమే నేరుగా కొంటోంది. ఇతర పంటలను, ఇతర రాష్ట్రాల రైతుల నుంచి ఇంత స్థాయిలో కొనడం లేదు.