చైనా ఆధిపత్య ధోరణికి అంతు లేకుండా పోతోంది. వుహాన్‌లో పుట్టిన వైరస్‌తో ఓ పక్క మానవాళి పోరాటం చేస్తుంటే... దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా చైనా తన పొరుగు దేశాలతో ప్రాదేశిక వివాదాలను సృష్టించి, ప్రపంచ దేశాల సహనాన్ని పరీక్షిస్తోంది. భారత్ విషయంలో ఈ దూకుడు మరింత ఎక్కువగా ఉంది. లద్దాఖ్ ప్రాంతంలో భారత్‌తో సరిహద్దు వివాదాలకు తెరతీసి వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి గత 45 ఏళ్లలో ఎపుడు లేని విధంగా ప్రాణ నష్టం సంభవించేలా వైషమ్యాన్ని ప్రేరేపించింది చైనా. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళం ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. అగ్రరాజ్యం అంతే దీటుగా స్పందించింది. పారాసెల్ ద్వీపాలకు సమీపంలో అణుశక్తితో పనిచేసే మూడు విమాన వాహక నౌకలను దక్షిణ చైనా సముద్రం వైపు మోహరించింది.
భారతదేశం నుంచి దక్షిణ చైనా సముద్రం సహా వెలుపల ఉన్న ప్రాంతాలలో చైనా తాజా విస్తరణలపై అమెరికా రక్షణ మంత్రి మైక్ పాంపియో తీవ్రంగా స్పందించారు.
"హిమాలయాల నుంచి వియత్నాం ప్రత్యేక మండలి జలాలతో పాటు సెంకాకు దీవుల వరకు (జపాన్ సరిహద్దులో ఉన్న తూర్పు చైనా సముద్రం వద్ద) బీజింగ్ రెచ్చగొట్టే ధోరణిలో ప్రాదేశిక వివాదాలను ప్రేరేపిస్తోంది. చైనా బెదిరింపులను ప్రపంచం చూస్తూ ఊరుకోకూడదు."
-మైక్ పాంపియో, అమెరికా రక్షణ మంత్రి
ఆ తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక, అత్యంత ప్రభావవంతమైన ద గ్లోబల్ టైమ్స్ ఒక వార్తను ప్రచురించింది. ఐదు అమెరికా సైనిక నిఘా విమానాలు దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌పై వరుసగా మూడు రోజులు చక్కర్లు కొట్టాయని పేర్కొంది.
"అమెరికా రెచ్చగొట్టే చర్యలకు దీటుగా పీఎల్ఏ ప్రతిచర్యలకు సన్నద్ధమైంది. అమెరికా విమానాలను చైనా యుద్ధ విమానాలు తన గగనతలం నుంచి వెళ్లగొట్టాయి. అమెరికాకు దీటుగా పీఎల్ఏ జవాబివ్వగలదని రుజువు చేసింది"
-ద గ్లోబల్ టైమ్స్ కథనం
ఈ ఘటనపై స్పందించిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు అభిజిత్ సింగ్... అమెరికా తన యుద్ధనౌకలను దక్షిణ చైనా సముద్రానికి పంపడం బీజింగ్‌కు హెచ్చరిక లాంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదన్నది ఆ సందేశం వెనుక ముఖ్య ఉద్దేశం అని ఆయన వివరించారు. "ఇటీవలి కాలంలో, ఈ ప్రాంతంలో చైనా సముద్ర మిలీషియా(నావికాదళ సిబ్బంది) కార్యకలాపాలు పెరిగాయి" అని సింగ్ ఈటీవి భారత్‌తో వెల్లడించారు. అందువల్లే ఆసియాన్ దేశాలు అమెరికా, జపాన్ లాంటి దేశాల సహాయాన్ని కోరాయని పేర్కొన్నారు.
ఎప్పటినుంచో ఉన్నదే
చైనా ఇటీవల అనుసరిస్తున్న విస్తరణ ఆకాంక్ష అకస్మాత్తుగా ఇపుడు వచ్చింది కాదని, ఇది ఎప్పడి నుంచో ఉన్నదేనని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చైనా అధ్యయనాల విభాగాధిపతి ప్రొఫెసర్ బీఆర్ దీపక్ అన్నారు. 1979 నుంచి సంస్కరణలు, ఆర్థికాభివృద్ధి పైనే చైనా దృష్టి పెట్టిందని దీపక్ పేర్కొన్నారు. అయితే 2012లో జిన్‌పింగ్ అధ్యక్షుడయ్యాక చైనా.. ఆధిపత్య ధోరణితో కూడిన విధానాల వైపు మళ్లిందని వివరించారు. అదే సమయంలో భారత్‌తో వాస్తవాధీన రేఖ వద్ద పేచీకి కూడా జిన్‌పింగ్ మొగ్గు చూపినట్లు తెలిపారు. దక్షిణ చైనా సముద్ర ద్వీపాలపై కూడా ఎనలేని దృష్టి పెట్టి వివాదాస్పద విధానాలను ఎక్కుపెట్టారని చెప్పుకొచ్చారు.
"చైనా వ్యూహం చాల కుటిలంగా ఉంటుంది. వారు మొదట భూభాగంపై హక్కు మాదేనని చెబుతారు. అదే విషయాన్ని పదేపదే ఉటంకిస్తారు. ఆ తర్వాత సైన్యాన్ని దించి, దాని యథాతథ స్థితిని మార్చివేస్తారు. ఆ తర్వాత అంతర్జాతీయంగా తనకున్న పలుకుబడితో విశ్వవ్యాప్తంగా ఉన్న వివిధ వేదికలను ఆ భూభాగంపై తమకే సర్వ హక్కులు ఉన్నట్టు ఒప్పించే ప్రయత్నం చేస్తారు."
- ప్రొఫెసర్ బీఆర్ దీపక్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
ఫిలిప్పీన్స్ అండ!
లద్దాఖ్‌లో సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో నావిగేషన్ కార్యకలాపాలు చేపట్టాలని భారతదేశం యోచిస్తుందేమోనన్న అనుమానాలు చైనాకు పెరిగిపోయాయి. అదే సమయంలో.. దక్షిణ చైనా సముద్రం గుండా వెళ్లడానికి గానీ, అక్కడ నిర్వహించే కార్యకలాపాలకు గానీ ఎవరికీ అడ్డు చెప్పడం లేదని ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా పేర్కొన్నారు. యూకే, ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు ఈ ప్రాంతం గుండా వెళ్లాయని.. వారందరినీ రమ్మని మేం ఆహ్వానించలేదని అన్నారు. ఇదే విధంగా భారతదేశం కూడా దక్షిణ చైనా సముద్రం వైపు రావచ్చు అని లోరెంజానా స్పష్టం చేశారు.
పీఎల్ఏ నావికా దళం ఇటీవల నిర్వహించిన సైనిక విన్యాసాల విషయంలోనూ ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్టే మధ్య గత నెలలో జరిగిన ఫోన్ సంభాషణ తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఒక ముఖ్య భాగస్వామి అని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు.
భారత్ వైఖరి మారాలి
ఈ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయడానికి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు భారత్ సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో భారతదేశానికి ప్రత్యక్ష వాటా లేనప్పటికీ, ఈ ప్రాంతంలో చైనా "దూకుడు" ప్రవర్తన గురించి దిల్లీ ఆందోళన చెందుతోంది. "హిమాలయ ప్రాంతంలో చైనా దూకుడుగా కొనసాగితే భారతదేశం మరింత బలమైన వైఖరిని (దక్షిణ చైనా సముద్రంలో) తీసుకోవలసి వస్తుంది" అని అభిజిత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
గత నెల, ఆసియాన్ నాయకుల వర్చువల్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో, వియత్నాం ప్రధాన మంత్రి జూఎన్ జువాన్ ఫుక్ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రంలో చైనా పదేపదే సముద్ర చట్టాలను ఉల్లంఘించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
"కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రపంచం మొత్తం ఒక్కటిగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి బాధ్యతా రహితమైన చర్యలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇది మన ప్రాంతం సహా కొన్నిఇతర ప్రాంతాలలో భద్రత, స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. 1982 యుఎన్‌సీఎల్‌ఓఎస్ (సముద్ర చట్టంపై యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్) ఒప్పందం ఆధారంగానే సముద్ర జలాలపై సార్వభౌమ హక్కులు, అధికార పరిధి, చట్టబద్ధమైన ప్రయోజనాలను నిర్ణయించేందుకు కట్టుబడి ఉన్నామని మేం పునరుద్ఘాటిస్తున్నాం."
-జువాన్ ఫుక్, వియత్నాం ప్రధాని
ప్రపంచ మహాసముద్రాలను ఉపయోగించడం, వ్యాపారాలు, పర్యావరణం, సముద్ర సహజ వనరుల నిర్వహణ కోసం మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని దేశాల హక్కులు, బాధ్యతలను యుఎన్‌సీఎల్‌ఓఎస్ నిర్వచిస్తుంది. జాతీయ సరిహద్దులకు మించిన అన్ని జలాలను అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. అన్ని దేశాలకు సముద్ర జలాల విషయంలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. ఆ జలాలు వాటికి సొంతం కావు. యుఎన్‌సీఎల్‌ఓఎస్ ప్రకారం ఒక దేశానికి చెందిన తీరప్రాంత మూల రేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ప్రాదేశిక సముద్రంగా పరిగణిస్తారు.
దేశాల మధ్య రగడ
దక్షిణ చైనా సముద్రంలో స్ప్రాట్లీ, పారాసెల్ దీవుల విషయంలో చైనా వివాదాలు సృష్టిస్తోంది. ఈ భూభాగాలపై తమకు హక్కుందని ఆ ప్రాంతంలోని ఇతర దేశాలు సైతం చెబుతున్నాయి. బ్రూనై, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం దేశాలు స్ప్రాట్లీ ద్వీపాలపై తమకూ హక్కు ఉందని ఉద్ఘాటిస్తున్నాయి. మరోవైపు పారాసెల్ ద్వీపాలపై హక్కు విషయంలో వియత్నాం, తైవాన్ దేశాలు పట్టుబడుతున్నాయి.
1974లో వియాత్నం పరిధిలో ఉన్న పారాసెల్ దీవులను చైనా తన సైనిక చర్య ద్వారా విడదీసిందని దీపక్ చెబుతున్నారు. ఇప్పుడు, స్ప్రాట్లీ ద్వీపాలలో చాలావరకు(28 ద్వీపాలు) వియత్నాం అధీనంలో ఉన్నాయని.. కానీ చైనా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిందని తెలిపారు.
కోర్టు మొట్టికాయలు!
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా మనీలా హక్కులను ఉల్లంఘించిందని హేగ్ లోని మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానం 2016లోనే స్పష్టం చేసింది. ఫిలిప్పీన్స్ చేపల వేట, పెట్రోలియం వెలికితీత కార్యకలాపాల్లో చైనా కలగజేసుకుంటుందని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కృత్రిమ దీవులను సైతం నిర్మించి చైనా ఆ ప్రాంతాల్లో చొరబడుతున్న చైనీస్ మత్స్యకారులను నిలువరించడం లేదని వేలెత్తి చూపింది. దక్షిణ చైనా సముద్రంలో తమ సంప్రదాయ చేపల వేట వృత్తిని కొనసాగిస్తున్న ఫిలిప్పీన్స్ మత్స్యకారుల హక్కులను చైనా కాలరాస్తోందని ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది.
అంతా ఉల్లంఘనలే
తన పరిధిని దాటి చైనా అంతర్జాతీయ జలాల్లో నావికా విన్యాసాలు చేయడంపై ఆసియాన్ దేశాలు ముఖ్యంగా వియత్నాం, ఫిలిప్పీన్స్ ఆందోళన చెందుతున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాలపై వివాదాలు శాంతియుత పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని 2002లో బీజింగ్, ఆసియాన్ దేశాలు ఒక అంగీకారానికి వచ్చినా... ఆ ప్రవర్తన నియమావళిని చైనా ఉల్లంఘిచడం స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే చైనా అక్కడి వివాదాలను ఒక్కో దేశంతో ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని చూస్తోందని... ఆసియాన్ దేశాలు మాత్రం ఈ సమస్యను ఉమ్మడి దృక్పథంతోనే పరిష్కరించుకోవాలని చెబుతున్నాయని దీపక్ వివరించారు. 2019 లెక్కల ప్రకారం ఆసియాన్ దేశాలతో చైనా 600 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని నడుపుతోంది. అందువల్ల తీరానికి ఆవల ఉన్న అమెరికా అక్కడ నుండి తప్పుకోవాల్సిందే అని చైనా చెబుతోందని పేర్కొన్నారు.
మున్ముందుఎలా..?
మాజీ అధ్యక్షుడు హుజినాటో వివరించిన 'మలక్కా డైలమా' ఇపుడు చైనా మదిలో ఆందోళన కలిగిస్తోంది. చైనా ఇంధన వనరుల రవాణాకు చాల కీలకమైన మలక్కా అనే అతి సన్నటి జలసంధి మలేసియా-ఇండోనేసియా మధ్య ఉంటుంది. ఇది దక్షిణ చైనా సముద్రానికి చేరుకునే కీలకమైన జలమార్గం. ఈ జలసంధి ప్రస్తుతం అమెరికా అధీనంలో ఉంది. ఇక్కడ ఏ మాత్రం అలజడి రేగినా పశ్చిమాసియా, ఆఫ్రికా నుంచి చైనాకు వచ్చే ఇంధన సరఫరా స్తంభించిపోతుంది. ఇప్పుడు అమెరికా మళ్లీ దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ నౌకలను పంపుతుండటం వల్ల ఆ ప్రాంతంలో రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి.
(రచయిత-అరూనిమ్ భుయాన్)