తెలంగాణ

telangana

ETV Bharat / opinion

శివసేన.. ముంబయి ఎవరి జాగీరు? - kangana shivsena conflict

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బెదరగొట్టడానికి శివసేన మొరటు చేష్టలకు పాల్పడుతోంది. కంగన ఊళ్లో లేని సమయం చూసి ఆమె ఇంటిని కూలగొట్టింది. ప్రజాస్వామ్యం, న్యాయపాలనలను శివసేన ఇంతగా అపహాస్యం చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి శివసేన సొత్తు కాదని, ఆ నగరంలో ప్రవేశించడానికి సేన నుంచి ఎవరూ వీసాలు పొందనక్కర్లేదని ఘాటుగా తేల్చిచెప్పాలి. ముంబయి భారతదేశమంతటికీ చెందుతుందని స్పష్టం చేయాలి.

maha govt conflicts with kangana ranaut
శివసేన.. ముంబయి ఎవరి జాగీరు?

By

Published : Sep 20, 2020, 7:19 AM IST

జాతీయ అవార్డు విజేత, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను బెదరగొట్టడానికి శివసేన మొరటు చేష్టలకు పాల్పడటాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండిస్తున్నారు. కంగన ఊళ్లో లేని సమయం చూసి ఆమె ఇంటిని కూలగొట్టడం ఎందరినో దిగ్భ్రాంతపరచింది. ప్రజాస్వామ్యం, న్యాయపాలనలను శివసేన ఇంతగా అపహాస్యం చేయడం అత్యంత గర్హనీయం. ముంబయి శివసేన సొత్తు కాదని, ఆ నగరంలో ప్రవేశించడానికి సేన నుంచి ఎవరూ వీసాలు పొందనక్కర్లేదని ఘాటుగా తేల్చిచెప్పాలి. ముంబయి భారతదేశమంతటికీ చెందుతుందని స్పష్టం చేయాలి. ప్రస్తుతం స్వరాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న కంగనను ముంబయి తిరిగిరావద్దని శివసేన నాయకులు పదేపదే హెచ్చరిస్తూ వచ్చారు. మహా అసభ్యంగా దూషించారు. కంగనను బెదిరించినవారిలో సాక్షాత్తు మహారాష్ట్ర హోం మంత్రి కూడా ఒకరు. ఆపైన ఈ నెల తొమ్మిదిన ముంబయి పాలీ హిల్స్‌లో ఉన్న ఆమె నివాసాన్ని కూలగొట్టారు. భారతదేశం ఈ అఘాయిత్యాన్ని మౌనంగా చూస్తూ ఊరుకోవడమంటే ప్రజాస్వామ్యానికి నీళ్లు వదలి గూండా రాజ్యాన్ని నెత్తిన పెట్టుకోవడమే అవుతుంది.

హిమాచల్‌ పుత్రికకు మద్దతు

కంగనకు మద్దతుగా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ గట్టిగా నిలబడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరి గర్హనీయమని, అది కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. హిమాచల్‌ పుత్రికను ఇంత దారుణంగా అవమానించడాన్ని సహించబోమని స్పష్టీకరించారు. శివసేన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ గూండాగిరీకి పాల్పడటంతో హిమాచల్‌ ప్రభుత్వం కంగనకు ముంబయిలో వైప్లస్‌ భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మేల్కొలుపు కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి ముంబయికి వచ్చేవారి పట్ల శివసైనికుల ఆగడాలను దేశం సహించదని గ్రహించాలి. కంగన ఇల్లు కూల్చివేయడం గర్హనీయమని బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎమ్‌సీ)కి బాంబే హైకోర్టు అక్షింతలు వేసింది. బీఎమ్‌సీ అనధికారిక నిర్మాణంగా భావిస్తున్న కట్టడం రాత్రికి రాత్రి నిర్మితమైనది కాదని గుర్తుచేసింది. అయినా బీఎమ్‌సీ మొద్దు నిద్ర నుంచి మేల్కొని, కంగన ఊళ్లో లేని సమయం చూసి, ఆమెకు నోటీసు ఇచ్చిన 24 గంటల్లోనే ఇంటిని కూల్చేయడం దురుద్దేశపూరితమని న్యాయస్థానం విమర్శించింది. బీఎమ్‌సీ న్యాయవాది సకాలంలో కోర్టుకు రాకపోవడాన్ని, న్యాయస్థానం ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా మునిసిపల్‌ కమిషనర్‌ ఫోన్‌ స్విచాఫ్‌ చేసి కూర్చోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. న్యాయస్థానానికి జవాబివ్వకుండా కంగన ఇంటి కూల్చివేత కార్యక్రమాన్ని పూర్తిచేసిన బీఎమ్‌సీ, నగరంలోని ఇతర అక్రమ కట్టడాల పట్లా ఇంతే వేగంగా వ్యవహరిస్తుందా అని కోర్టు ప్రశ్నించింది.

కేంద్ర పాలిత ప్రాంతంగా ముంబయి!

ముంబయి శివసేన గుత్తసొత్తు కాదు. ఆ పార్టీ మాత్రం అలా తలపోస్తుంటుంది. మరాఠీ భాష మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఉద్యమం జరుగుతున్న రోజుల నుంచే శివసేనకు ఈ భ్రమ ఉంది. దీంతో నగరంలో నివసిస్తున్న గుజరాతీలు, ఇతర భాషా వర్గాలవారు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరేవారు. ముంబయి మహానగర నిర్మాణంలో వీరందరూ భాగస్వాములే. ఆ తరవాత శివసేన ఎంతగా ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొట్టినా నగరం తన సార్వజనీన తత్వాన్ని నిలబెట్టుకొంటూ వచ్చింది. నగరం వ్యూహపరంగా కీలక స్థానంలో ఉండటం వల్ల కూడా ముంబయిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే వాదం బలంగానే వినిపించసాగింది.

భాగ్యవిధాతలు

ముంబయి అందరికీ చెందుతుంది తప్ప, ఆ మహా నగరం కేవలం సంకుచిత శివసేన నాయకుల ఆస్తి కాదు. ముంబయి తమ గుత్తసొత్తు అని శివసేన భావించడం వల్ల కలుగుతున్న అనర్థాలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి. కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర అన్నా, మరాఠాలన్నా, ముంబయి అన్నా గిట్టదని చిత్రించడానికి శివసేన ప్రయత్నిస్తోంది. ఇది బొత్తిగా అసత్యం. కంగన విమర్శలన్నీ శివసేన సంకుచిత ధోరణుల మీదే. భారతదేశపు అత్యంత సంపన్న, ఉదార నగరమైన ముంబయిని విద్వేష కాసారంగా మార్చడానికి సేన చేస్తున్న ప్రయత్నాలను కంగన ఖండిస్తున్నారు తప్ప- ముంబయి మీద కాని, మహారాష్ట్ర మీద కాని, మరాఠీ ప్రజల మీద కాని ఆమె విద్వేషం వెళ్లగక్కలేదు. ఛత్రపతి శివాజీకి వారసులు శివసేన మాత్రమే కాదు- దేశదేశాల్లో ఉన్న భారతీయులు శివాజీని దేశానికి గర్వకారణమైన మహారాజుగా, జాతీయవాద ప్రతీకగా శిరసావహిస్తారు. శివాజీ శౌర్యాన్ని, భారతీయ నాగరికతా విలువల రక్షణకు ఆయన కృషిని గుండెల్లో నిలుపుకొంటూ ఆరాధిస్తారు. ఎందరో సినీ, టీవీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ముంబయి వల్లనే వెలుగులోకి వచ్చారని శివసేన వాదిస్తూ ఉంటుంది. వీరూ నగర అభివృద్ధిలో భాగస్వాములనే వాస్తవాన్ని మరుగుపరుస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల నుంచి వలసవచ్చినవారు ముంబయిలో తమ కలలు పండించుకున్నారు. దాన్నొక కలల నగరంగా తీర్చిదిద్దారు. శివసేన ఈ వాస్తవాలను గుర్తించి తీరు మార్చుకోవాలి. యావత్‌ దేశాన్నీ వ్యతిరేకం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. బాలాసాహెబ్‌ ఠాక్రే నాయకత్వంలో భారత జాతీయవాదాన్ని తలకెత్తుకున్న శివసేన- ఇప్పుడు సోనియా సేనగా మారి అభాసు పాలవడం విచారకరం!

(రచయిత- ఎ.సూర్యప్రకాశ్, ప్రసారభారతి మాజీ ఛైర్మన్)

ఇదీ చదవండి:వివాదాల నడుమ నేడు రాజ్యసభకు వ్యవసాయ బిల్లులు!

ABOUT THE AUTHOR

...view details