అమెరికాకు నాలుగేళ్లపాటు పీడకలగా సాగిన డొనాల్డ్ ట్రంప్ పాలన ఎట్టకేలకు అంతమైంది. రోమన్ సామ్రాజ్యాధినేత జూలియస్ సీజర్‌ను వెయ్యి కత్తిపోట్లతో హతమార్చారని షేక్‌స్పియర్ రాశారు. ట్రంప్ తనను తానే పొడుచుకుని ఆత్మహననానికి పాల్పడ్డారు. ఆయన అందరిలో శత్రువులను చూసినా, వాస్తవంలో తనకుతానే శత్రువు. గిట్టనివారిని బెదిరించడం, కోర్టుకు ఈడుస్తానంటూ వేధించడం, చిరకాల మిత్రులైన ఐరోపా దేశాలను దూరం చేసుకోవడం, వారితో అమెరికాకు ఉన్న మైత్రీ ఒప్పందాలను తుంగలో తొక్కడం, కళ్లెదుట కనబడుతున్న వాస్తవాలను అంగీరించడానికి నిరాకరించడం వంటి చేష్టలతో పొద్దుపుచ్చారు. ప్రస్తుతం అమెరికాలో రోజూ పెద్ద సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ స్వయంగా కరోనా బారిన పడ్డారు. అయినా అంతా బాగానే ఉందని, కరోనాను లెక్కచేయాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం సైన్స్‌ను బలిపెట్టారు. వాతావరణ మార్పులు బూటకమంటున్నారు. ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించడానికి నిరాకరించడంతో ప్రస్తుతం కరోనా విలయానికి అమెరికా ప్రజలు బలవుతున్నారు. అగ్రరాజ్య అధినేత హోదాలో కనబరచాల్సిన హుందాతనానికి నీళ్లొదిలి- జాతివిచక్షణను, స్త్రీ ద్వేషాన్ని, పరదేశీయులపై కక్షాకార్పణ్యాలను ప్రేరేపించారనే ఆరోపణలున్నాయి. సామాన్యుల్లో అభద్రతా భావనలను ప్రజ్వలింపజేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన బండారాన్ని బయటపెట్టే పుస్తకాలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిలో ఒకదాన్ని ట్రంప్ కుటుంబ సభ్యులే రాశారు. ఆయన పతనం అనంతరం మరిన్ని రాబోతున్నాయి.
కిందపడినా పైచేయి..
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా తన పేచీకోరు వ్యవహారాలతో- ఎన్నికల ఫలితాలు పచ్చి మోసమని, తన గెలుపును ప్రతిపక్షం దొంగిలించిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. కిందపడినా తనదే పైచేయి అంటూ అధ్యక్ష పదవిని వదలకుండా చూరు పట్టుకుని వేలాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబరు 14న ఎన్నికల అధికారులు ఫలితాలను సాధికారికంగా ప్రకటించి, 2021 జనవరి 20న బైడెన్ అధ్యక్ష సింహాసనం అధిరోహించాక ట్రంప్ నానాపాట్లు పడాల్సిందే. అమెరికాలో అతి ప్రాచీన రిపబ్లికన్ పార్టీ ట్రంప్ తోక పట్టుకుని ఈదాలనుకోవడం విడ్డూరం. ఆయన అప్రజాస్వామిక పనులకు ఆ పార్టీ వంతపాడటం విచారకరం. బైడెన్ పగ్గాలు చేపట్టిన తరవాత కూడా ఆయన ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించడానికి ట్రంప్, ఆయన పార్టీ నేతలు ప్రయత్నిస్తూనే ఉంటారనడంలో అనుమానమేమీ లేదు.
మరోవైపు, కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రజలకు ఐక్యతా సందేశం ఇస్తున్నారు. ఆశావహ భవిష్యత్తులోకి జాతిని, మిత్రదేశాలను నడిపిస్తానంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్థిత్వం కోసం తనతో పోటీ పడి, తీవ్ర విమర్శలు గుప్పించిన కమలా హ్యారిస్‌నే ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసుకోవడం ద్వారా బైడెన్ తనలోని ఉదాత్త సహన గుణాన్ని లోకానికి తెలిసేలా చేశారు. ట్రంప్ ఎన్నికల్లో ఓడినా తానే గెలిచానంటూ వీరంగం చేస్తుంటే, బైడెన్ అందర్నీ సంయమనం పాటించాలని కోరడం ఆయన ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టింది. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్ష అభ్యర్థికీ రానన్ని ఓట్లు సాధించినా, ఈ విజయం తనను మరింత వినమ్రుడిని చేసిందని ప్రకటించి అందరి మన్ననలూ పొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కమలా హ్యారిస్ అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలే కాదు- నల్లజాతికి, భారతీయ సంతతికి చెందిన ప్రప్రథమ ఉపాధ్యక్షురాలు కూడా. అమెరికాలో రెండో అత్యున్నత పదవిని ఆమె అధిష్ఠించడం స్త్రీ జాతికి గర్వకారణం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోయినప్పుడు అమెరికా ఒక స్త్రీని అధ్యక్ష పదవికి ఎన్నుకోవడానికి సిద్ధంగా లేదని చాలామంది వ్యాఖ్యానించారు. అది వట్టి అపోహ అని కమలా హ్యారిస్ నిరూపించారు.