భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు రసకందాయంలో పడ్డాయి. ఎస్-400 క్షిపణి వ్యవస్థలను మన దేశం కొనుగోలు చేస్తుండటమే ఇందుకు కారణం. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి ఈ ఆయుధ సంపత్తిని సముపార్జించుకుంటుండటంపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతర దేశాలపై ప్రయోగించేందుకు తయారు చేసుకున్న ఆంక్షల ద్వారా అమెరికా ప్రత్యర్థుల్ని నిరోధించే చట్టం (సీఏఏటీఎస్‌ఏ-కాట్సా) అస్త్రాన్ని మనపై ప్రయోగించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. తమ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నందుకు ఇండియాపై కొరడా ఝళిపించాల్సిందేనని కొందరు అమెరికన్లు వాదిస్తుండగా, వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్నారు.
మెరుగైన రక్షణ కోసమే..
ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్-400 ట్రయంఫ్ ఒకటి. డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో పాటు యుద్ధ విమానాల దాడుల నుంచి అది రక్షణ కల్పిస్తుంది. తనవైపు దూసుకొచ్చే శత్రు దేశాల ఆయుధాలను క్షిపణుల ప్రయోగంతో కూల్చివేస్తుంది. ప్రధానంగా చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణ ఛత్రంగా పని చేస్తుందన్న ఉద్దేశంతో భారత్ దీని కొనుగోలుకు నిర్ణయించింది. అయిదు ఎస్-400 వ్యవస్థల సముపార్జన కోసం 2018 అక్టోబరులో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, వాటికి బదులు అమెరికాకు చెందిన ఎంఐఎం-104 పేట్రియాట్ వ్యవస్థలను ఇండియా కొనుగోలు చేయాల్సిందన్నది కొందరి వాదన. కానీ- పేట్రియాట్ వ్యవస్థ ప్రధానంగా క్షిపణుల నుంచి రక్షణ కోసం రూపొందించినది. యుద్ధ విమానాలను నిరోధించడంలో అది అంత ప్రభావశీలంగా పని చేయకపోవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. పేట్రియాట్‌తో పోలిస్తే ఎస్-400 ధర చాలా తక్కువ. కాబట్టి భారత్ తన అవసరాలు, ఆర్థిక పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఎస్-400ను ఎంచుకోవడం ఉత్తమ నిర్ణయమన్నది నిర్వివాదాంశం. తొలి ఎస్-400 వ్యవస్థ వచ్చే నెలలోనే మన దేశానికి అందే అవకాశముంది.
చైనా వద్ద ఇప్పటికే ఎస్-400 రక్షణ వ్యవస్థ ఉంది. గత ఏడాది మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ముందుజాగ్రత్తగా చైనా ఈ వ్యవస్థను మోహరించినట్లు సమాచారం. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ల నుంచి గణనీయ స్థాయిలో సైనిక, నిఘా ఒప్పందాలు కుదుర్చుకొని, సంబంధిత ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసే దేశాలపై ఆర్థిక, ప్రయాణపరమైన ఆంక్షలు విధించేందుకు కాట్సా చట్టం వీలు కల్పిస్తుంది. జాతీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక అవసరాలను పరిరక్షించే చర్యల్లో భాగంగా దీనినుంచి మినహాయింపులు ఇచ్చే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది. ఎస్-400ను కొనుగోలు చేసిన కారణంగా చైనా, టర్కీ (ఇది నాటో భాగస్వామి)లపై ఇప్పటికే కాట్సాను ప్రయోగించారు.