తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంస్కరణలతోనే రక్షణ రంగం సుసంపన్నం

దేశీయ రక్షణ పరిశ్రమ 'భారత్‌లో తయారీ' దిశగా అడుగులు వేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తోడ్పడుతుంది. రక్షణ రంగంలో తయారీ దిశగా భారీగా కృషి చేయాల్సిన అవసరం నెలకొంది. రక్షణ రంగాన్ని దేశీయంగా స్వయంసమృద్ధితో తీర్చిదిద్దే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సిఉంది. దురదృష్టవశాత్తు తయారీ విధానాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు సంతృప్తికరంగా లేని కారణంగా విదేశీ సామగ్రిని కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఈ విధానాల్లోనే పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Amendments should be made to improve Indian Army's weapons system
రక్షణ ఉత్పత్తుల్లో సంస్కరణలతోనే సుసంపన్నం

By

Published : May 19, 2020, 7:54 AM IST

రక్షణ రంగానికి ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయ రక్షణ పరిశ్రమ 'భారత్‌లో తయారీ' దిశగా అడుగులు వేసేందుకు తోడ్పడనుంది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను సుసంపన్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2015-19 మధ్య ఆయుధాల దిగుమతిలో భారత్‌ ప్రపంచంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో తయారీ దిశగా భారీగా కృషి చేయాల్సిన అవసరం నెలకొంది. దేశీయంగా సైనిక ఉత్పత్తుల్ని తయారు చేసే ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ) విషయానికి వస్తే...ఇది సైన్యానికి అవసరమైన వస్త్రాలు, బూట్లు, ట్రౌజర్లు తదితర సామగ్రినే ఎక్కువగా తయారు చేస్తుంది. దీని ఉత్పత్తుల నాణ్యతపై గతంలో విమర్శలు వెలువడ్డాయి. ఆయుధ సామగ్రికి సంబంధించిన ఉత్పత్తులపైనా ఫిర్యాదుల్ని గుర్తించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓఎఫ్‌బీని మరింత సమర్థంగా తీర్చిదిద్దాల్సి ఉంది. ఈ క్రమంలో ఓఎఫ్‌బీ కార్పొరేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీనివల్ల మెరుగైన నాణ్యతతో కూడిన వస్తువులు వచ్చే అవకాశం ఉంటుంది. బోర్డుకు సామర్థ్యంపరంగా నెలకొన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. భారత్‌లో తయారీ మన దేశాన్ని నిర్వహణ, మరమ్మతుల కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. దీనివల్ల విమానం ఇంజిన్ల సర్వీసింగ్‌ వంటి భారీ నిర్వహణ పనులు భారత్‌లోనే చేపట్టవచ్చు. అప్పుడు మన వైమానిక, నావికా దళాలకు చెందిన విమానాల ఇంజిన్‌ సర్వీసులు కూడా జరుగుతాయి. అది మనకు ప్రయోజనకరమే. భారత్‌లో తయారు చేయగలిగే సామగ్రి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రక్షణ రంగంలో ఉపయోగించే ఉపకరణాలను తయారు చేసే యూనిట్లు సమర్థమైనవని, దిగుమతి చేసుకునే వస్తువులకు దీటుగా తయారు చేయగలవన్న సంగతి స్పష్టమవుతోంది.

రక్షణ రంగాన్ని దేశీయంగా స్వయంసమృద్ధితో తీర్చిదిద్దే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంది. ఇదంతా ఆదరాబాదరాగా చేయాల్సిన ప్రక్రియ కాదు. మనకు సుస్థిరమైన, పరిణతి చెందిన రక్షణ తయారీ మౌలిక వ్యవస్థ లేదు. ఈ కారణంగానే విమానాలు, హెలికాప్టర్లు, శతఘ్నులను దిగుమతి చేసుకుంటున్నాం. ఫలితంగా కొంత కొరత వెంటాడుతూ ఉంటుంది. రక్షణ పరికరాలకు సంబంధించి భారత్‌లో ఎలాంటి ఉత్పత్తులు తయారు చేసినా, ప్రైవేటు పరిశ్రమనూ ప్రోత్సహించాల్సిందే. రక్షణ, ప్రభుత్వరంగ సంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలకు సంబంధించి పునర్‌వ్యవస్థీకరణ జరపాల్సి ఉంది. ఎందుకంటే, ఆయా సంస్థలు అత్యున్నత స్థాయి సాంకేతిక పరిశోధనతో ముందుకు సాగాల్సి ఉంది. ఇవన్నీ తక్షణమే ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు. అలాగే అన్ని రకాల విదేశీ దిగుమతులనూ ఒక్కసారిగా ఆపివేయాల్సిన అవసరం లేదు. వందశాతం దిగుమతుల్ని పూర్తిగా ఆపేయడమూ సాధ్యం కాదు. కొన్ని కొనసాగాల్సిందే. దేశీయంగా తయారీ దిశగా భారీ స్థాయిలో ముందుకు కదలాల్సిన అవసరం మాత్రం ఉందన్న సంగతి గుర్తించాలి.

రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతం వరకూ పెంచాలనే యోచన మంచి పరిణామంగా చెప్పవచ్చు. రక్షణ ఉత్పత్తుల రంగంలో పునాది బలంగా లేకపోవడంతోపాటు, మన దేశంలో అత్యున్నత స్థాయి నాణ్యతతో కూడిన రక్షణ సామగ్రి తయారు కావడం లేదు. అందుకని, మనకు విదేశీ పెట్టుబడులు, విదేశీ భాగస్వాముల అవసరం ఉంది. వీటితోపాటు రక్షణ పరికరాల తయారీలో మంచి ట్రాక్‌ రికార్డు కలిగి ఉన్న విదేశీ కంపెనీలను ప్రధాన భాగస్వాములుగా ఆహ్వానించాల్సిందే. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కడికి వచ్చేందుకు వారిని తగినవిధంగా ప్రోత్సహించాలి. ఇందుకోసం పూర్తి సాధన సంపత్తితో కూడిన ఆవరణ వ్యవస్థ అన్ని రంగాలకూ విస్తరించాలి. అయితే, రాబోయే రెండు మూడేళ్లలోనే మొత్తం జరిగిపోతుందని ఆశించవద్దు. ఇదంతా ఫలవంతమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈ విషయంలో మనం ఎంచుకున్న దిశ మాత్రం పూర్తిగా సరైనదేనన్నది విస్పష్టం. రక్షణ పరిశ్రమలో స్వదేశీ తయారీ భావన తాజాగా వినిపిస్తున్నా, ప్రస్తుత ప్రభుత్వం 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడే దేశీయ ఉత్పత్తి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వ రక్షణ విధానంలో సైతం భారత్‌లో తయారీకి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు తయారీ విధానాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరు సంతృప్తికరంగా లేని కారణంగా విదేశీ సామగ్రిని కొనుగోలు చేస్తూనే ఉన్నాం. ఈ విషయంలో విధానాల్లోనే పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ తదుపరి అడుగులు ఈ దిశగానే పడతాయని ఆశిద్దాం.

- డీఎస్​ హూడా ( విశ్రాంత లెఫ్టినెంట్​ జనరల్​)

ABOUT THE AUTHOR

...view details