తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కడగండ్ల బాటలో రవాణా బండి - రవాణా రంగంపై పెట్రోల్​ ధరల పెంపు ప్రభావం

పెద్దసంఖ్యలో ఉపాధి చూపుతున్న రవాణా- భవిష్యత్తులో అతిపెద్ద ఉద్యోగ కల్పన రంగంగా అవతరించే అవకాశాలు ఉన్నాయనేది అంచనా. కొన్నేళ్లుగా ప్రైవేటు ఫైనాన్సు సంస్థలు సులభంగా రుణాలు ఇస్తుండటంతో చాలామంది లారీలు, ట్రక్కులతో రవాణా వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇలాంటి ఔత్సాహికులందరికీ కొవిడ్‌, చమురు ధరలు అశనిపాతంలా పరిణమించాయి. సాధారణంగా రవాణా వ్యయాల్లో డీజిల్‌కయ్యే ఖర్చు 30-40 శాతందాకా ఉంటుంది. పెరిగిన ధరలతో దానివాటా పెరుగుతోంది. ఫలితంగా లాభాలు తగ్గి, ఛార్జీలు పెంచక తప్పని స్థితి నెలకొంటోంది.

Although petrol prices have come down somewhat, the impact has not been big on the transport sector
కడగండ్ల బాటలో రవాణా బండి

By

Published : Nov 8, 2021, 5:39 AM IST

పెట్రో ధరలపై పన్ను వడ్డింపులను కేంద్ర ప్రభుత్వం తాజాగా కొంతమేర తగ్గించగా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఆ నిర్ణయాన్ని అనుసరించాయి. అయినప్పటికీ సంపూర్ణ ఉపశమనం దక్కక రవాణా పరిశ్రమ వర్గాల నుంచి అసంతృప్తే వ్యక్తమవుతోంది. తాజా ధరల తగ్గింపు చాలా స్వల్పమని, చమురు ధరల్లో త్రైమాసిక సవరణలు, దేశవ్యాప్తంగా ఏకరూప ధరలు, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వంటి దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చాలని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ అధ్యక్షుడు బల్‌మల్కిత్‌సింగ్‌ కోరుతుండటం గమనార్హం. కొవిడ్‌కు తోడైన చమురు కష్టాలు లారీల వంటి వాహనదారులను అప్పుల సుడిగుండంలోకి తోసేయడంతో, వారు బలవన్మరణాల బాటపడుతుండటం విషాదకరం. చమురు ధరలు రవాణా రంగం నడ్డి విరుస్తున్నాయి. భారీగా పెరిగిన డీజిల్‌, టైర్ల ధరలతోపాటు, వాహన బీమా ప్రీమియం, లూబ్రికెంట్లు, విడిభాగాలు, కార్మికుల వేతన ఖర్చులు ఇతరత్రా నిర్వహణ వ్యయాలు అధికమై యజమానులపై భారం తడిసి మోపెడైంది. కొవిడ్‌ ప్రభావంతో ఆర్థిక కార్యకలాపాలు తగ్గడం, నిర్మాణ తదితర రంగాల జోరు మందగించడంతో రవాణా వాహనాలకు గిరాకీలు సన్నగిల్లాయి. ఖర్చులకు తగిన ఆదాయాలు లేక వాహన రుణాలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. రుణాలు ఇచ్చిన ఆర్థిక సంస్థలు వాహనాల్ని స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. లాక్‌డౌన్ల కాలంలో వాహనాలు నిలిచి పోవడంతో సరకు రవాణా రైల్వేలకు మరలింది. తరవాతి కాలంలో ఆ గిరాకీ తిరిగి లారీలు,ట్రక్కులకు వెనక్కి రాకపోవడం పెద్ద లోటే. గిరాకీ తక్కువగా ఉన్న కారణంగా, పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచలేకపోవడంతో, వచ్చే కాసిన్ని లాభాలూ హరించుకుపోతున్నాయి. ఇవన్నీ వాహన యజమానులను బలవన్మరణాల వైపు నడిపిస్తున్నాయి.

పెరిగిన నిర్వహణ వ్యయం

పెద్దసంఖ్యలో ఉపాధి చూపుతున్న రవాణా- భవిష్యత్తులో అతిపెద్ద ఉద్యోగ కల్పన రంగంగా అవతరించే అవకాశాలు ఉన్నాయనేది అంచనా. కొన్నేళ్లుగా ప్రైవేటు ఫైనాన్సు సంస్థలు సులభంగా రుణాలు ఇస్తుండటంతో చాలామంది లారీలు, ట్రక్కులతో రవాణా వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇలాంటి ఔత్సాహికులందరికీ కొవిడ్‌, చమురు ధరలు అశనిపాతంలా పరిణమించాయి. సాధారణంగా రవాణా వ్యయాల్లో డీజిల్‌కయ్యే ఖర్చు 30-40 శాతందాకా ఉంటుంది. పెరిగిన ధరలతో దానివాటా పెరుగుతోంది. ఫలితంగా లాభాలు తగ్గి, ఛార్జీలు పెంచక తప్పని స్థితి నెలకొంటోంది. లాక్‌డౌన్ల తరవాత పరిస్థితులు బాగుపడతాయని, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని, అవకాశాలు మెరుగవుతాయని భావించగా, పెరిగిన చమురు ధరలు వారి ఆశలపై నీళ్లుచల్లాయి. మరోవైపు, క్యాబ్‌ సేవలు అందించే అగ్రిగేటర్‌ సంస్థలతో అనుసంధానమైన కార్ల వంటి వాహన యజమానులు సైతం, లాభాలు దక్కడంలేదని వాపోతున్నారు. లాక్‌డౌన్లతో వ్యాపారం మందగించడం, చమురు ధరలతో లాభాలు తగ్గడంతో ఆదాయాలు కోసుకుపోయి, రుణాల చెల్లింపు కష్టమైంది. అగ్రిగేటర్‌ సంస్థలు కూడా లాభాల పంపకంలో చేయివిదల్చక పోవడంతో వ్యయభారం భరించలేక చాలామంది వాహనాల్ని అమ్ముకొని, ఇతర ఉపాధి మార్గాల్ని వెదుక్కోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. సొంతంగా ఆటోలు వంటి వాహనాలు నడుపుకొనేవారు విద్యాసంస్థలు, ఐటీ తదితర పరిశ్రమలు, సంస్థల మూసివేతతో ఉపాధి కోల్పోయారు. వాహనాల అద్దె, ఈఎంఐలు, వడ్డీల వంటివి భారంగా మారాయి. కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపుతుండటంతో ఆటోలు, ట్యాక్సీల నిర్వాహకులు గిరాకీలు లేక ఈసురోమంటున్నారు. ఇలాంటి ప్రభావం రోడ్డు రవాణా సంస్థలపైనా తీవ్రంగా పడింది. డీజిల్‌ ధరలు నిర్వహణ వ్యయాన్ని పెంచడంతో నష్టాలు పేరుకుపోతున్నాయి. పలు పరిశ్రమలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించడం, పర్యాటకులు, యాత్రికుల రాకపోకలు తగ్గడం వంటివీ రవాణా రంగాన్ని దెబ్బతీశాయి.

పరిశ్రమ అస్తవ్యస్తం

చమురు ఖర్చులు పదిశాతందాకా పెరిగితే, రవాణా ఛార్జీల్లో కనీసం సుమారు రెండు శాతం పెరుగుదల ఉంటుందనేది నిపుణుల అంచనా. దీనివల్ల చమురు వ్యయం పెరిగినప్పుడు రవాణా ఖర్చులు పెరగడంతోపాటు, వినియోగదారుడికి చేరే తుది వస్తువు ధర కూడా పెరుగుతోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో వినియోగదారులు చిల్లర వర్తకులు, ఈ-కామర్స్‌ సంస్థల నుంచి భారీ రాయితీలను ఆశించడం మామూలే. రవాణా వ్యయాలు పెరిగిన పరిస్థితుల్లో వినియోగదారులకు భారీ ఆఫర్లను అందించలేని సంకట స్థితి నెలకొంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో రవాణా వ్యయం అధికంగా ఉండటానికి శాస్త్రీయ నిర్వహణ తీరు లేకపోవడమూ ఒక కారణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తూ, మెరుగైన నిర్వహణ పద్ధతులను పాటిస్తేనే, ఒక్కో వాహనంపై సమకూరే సగటు ఆదాయం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలూ ఈ రంగంపై ఎప్పటికప్పుడు భారాల్ని పెంచుతున్నాయనే విమర్శలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగం ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కేవలం స్వల్పకాలిక ఉపశమన చర్యలు కాకుండా, దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్యల దిశగా నడుంకట్టాలి. నిపుణులతో అధ్యయనం జరిపించి, మెరుగైన సిఫార్సులను నిర్దిష్టంగా అమలు చేయడం ద్వారా ఈ రంగానికి జవసత్వాలు కల్పించాలి. వాహన యజమానులు కోరుకుంటున్నట్లుగా పన్నుల పరంగా ఉపశమనం కల్పించాలి. రవాణా రంగంలో పనిచేసే శ్రామికుల పరిస్థితులను ప్రత్యేకంగా పరిగణించాలి. సామాజిక సంక్షేమ పథకాల్లో అవకాశాలు కల్పించాలి. వ్యక్తిగత, ఆరోగ్య, సామూహిక బీమా సదుపాయాల్ని అందించాలి. ప్రజాపంపిణీ పథకంలో ఆహారం అందజేయాలి. చిన్నారులకు గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో అవకాశాలు కల్పించాలి. మారుమూల పల్లెలను ఆధునిక నగరాలను అనుసంధానిస్తూ, పెద్దసంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల్ని సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థకు జీవరేఖగా నిలుస్తున్న రవాణా రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ, సంపూర్ణ కాయకల్ప చికిత్స చేయడం ప్రస్తుతావసరం. వస్తుసేవల చేరవేత ద్వారా దేశ ఆహార, ఆర్థిక భద్రతకు ఊతమిచ్చే వాహనాల్ని- బంగారు బాతుల్లా పరిగణిస్తూ వసూళ్లు దండుకోవడం పరిహరిస్తేనే ఈ రంగం ఆర్థికంగా పరిఢవిల్లుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, యంత్రాంగాలు, ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

ఇతర రాష్ట్రాల్లో ఇక్కట్లు

ఒక రాష్ట్రానికి చెందిన వాహనం వేరే రాష్ట్రానికి వెళ్లినప్పుడు ప్రత్యేక రుసుములతో బాదుతుండటంతోపాటు అధికారుల వేధింపులు, ఆమ్యామ్యాలు ఈ రంగానికి శరాఘాతంగా మారాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా, అడ్డగోలు కొర్రీలతో సరిహద్దుల్లో వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి విషయాల్లో రాష్ట్రాల రవాణా శాఖల మధ్య సమన్వయం అవసరం. కేంద్రం కూడా ఏకీకృత విధానాలను అమలు చేయడం, గందరగోళాన్ని పరిహరించడంపై కసరత్తు జరపాలి.

- శ్రీనివాస్‌ దరెగోని

ఇదీ చూడండి:సంక్షేమ రాజ్యంలో 'మందు'పాతరలా?

ABOUT THE AUTHOR

...view details